తెలంగాణ రాష్ట్ర సమితిలో చీలిక వస్తుందన్న భయంతోనే ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఇతర పార్టీల నేతలపై ‘ఆకర్ష్’ ప్రయోగం చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్క, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారాన్ని పక్కన పెట్టి ఇతర పార్టీల నుంచి నాయకులను చేర్చుకోవడంలో నిమగ్నమయ్యారని వారు శనివారం విలేఖరుల సమావేశంలో ఆరోపించారు. టిఆర్‌ఎస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయలేకపోతున్నదని వారు తెలిపారు. తాము అధికారంలో ఉన్నప్పుడు రూపొందించిన ఎస్‌సి, ఎస్‌టి సబ్-ప్లాన్‌ను ఖచ్చితంగా అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. కెసిఆర్ తన వంద రోజుల పాలనపై శే్వతపత్రం విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. కెసిఆర్ విపరీతమైన ధోరణితో వ్యవహారిస్తున్నారని వారు విమర్శించారు. మెదక్ ఉప ఎన్నికకు ముందు అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తే ప్రభుత్వ లోపాలు బయటపడి, ఉప ఎన్నికపై ప్రభావం పడుతుందన్న భయంతోనే సమావేశాలను వెంటనే నిర్వహించకుండా కొంత కాలం వాయిదా వేశారని వారు తెలిపారు. అసెంబ్లీ సమావేశాలను వెంటనే నిర్వహించాలని వారు ముఖ్యమంత్రి కెసిఆర్‌ను డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: