తానొకటి తలిస్తే శివరామకృష్ణుడొకటి తలిచాడని తలపట్టుకుంటున్నాడు ఏపీ సీఎం చంద్రబాబు.. విజయవాడ -గుంటూరు ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించి అర్జంటుగా సింగపూర్ అంత డెవలప్ చేయాలని తాపత్రయపడుతుంటే.. అబ్బే అంత సీన్ లేదంటూ శివరామకృష్ణన్ కమిటీ రిపోర్ట్ ఇచ్చేసింది. హైదరాబాద్ లా అన్నీ ఒకేచోట ఉండే రాజధాని వద్దే వద్దంటూ తేల్చిచెప్పింది. అయితే రాజధానిపై నిర్ణయం తీసుకోవాల్సింది రాష్ట్రమే కనుక ఈ శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వక్కర్లేదని బాబు డిసైడయ్యారట. పెద్దాయన కమిటీ ఇచ్చిన నివేదిక అసమగ్రంగా ఉందని బాబు ప్రాథమికంగా ఓ నిర్ణయానికి వచ్చారు. దీనిపై సోమవారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించాలని భావిస్తున్నారు. రాజధాని ఎంపిక కమిటీ విధివిధానాలు, పరిధి విస్తృతంగా ఉన్నా శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ఆ స్థాయిలో సంపూర్ణంగా లేదన్న భావనతో బాబు టీమ్ ఉన్నట్లు తెలుస్తోంది. రాజధాని రాష్ట్రానికి మధ్యలో ఉండాల్సిన అవసరం లేదంటూ కోల్ కత్తా, చెన్నై నగరాల గురించి చేసిన ప్రస్తావన సరైంది కాదని చంద్రబాబు ఉన్నతస్థాయి అధికారులతో జరిపిన సమావేశంలో అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాజధానులు చారిత్రక నగరాలని వాటిని దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ రాజధానిని నిర్ణయించడం సరికాదన్న భావన ఈ సమావేశంలో వ్యక్తమైంది. శివరామకృష్ణన్ కమిటీ నివేదికపై సోమవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో భాగంగా కమిటీ నివేదికలో సూచించిన ఏ అంశాలను స్వీకరించాలి..? వేటిని పరిగణనలోకి తీసుకోకూడదు..? అనే విషయాలపై ఒక నిర్ణయానికి రావాలని భావిస్తున్నారు. కాకపోతే.. శివరామకృష్ణన్ కమిటీలో చెప్పినట్టు ఆయా ప్రాంతాల్లో వ్యతిరేకత వచ్చే ప్రమాదం పొంచి ఉంది. దాన్ని చల్లార్చేవ్యూహంపై చంద్రబాబు మథనపడుతున్నారట

మరింత సమాచారం తెలుసుకోండి: