బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. వివిధ ప్రాంతాలు నీట మునిగాయి. ప్రధాన రహదారులపై వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రంలో గత రెండు రోజులుగా పలు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు ప్రజలు తమ ఇళ్లలోనే వుంటున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా, బొంరాస్‌పేట మండలం మదనపల్లిలో ఎర్రకుంట చెరువు కట్ట తెగిపోయింది. సుమారు 400 ఎకరాల్లో పత్తి, కంది, మొక్కజొన్న పంటలు తడిసిపోయినట్లు సమాచారం. జురాల జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రస్తుతం జూరాలకు లక్షా 40వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వుండగా, 16 గేట్ల ద్వారా లక్షా 10వేల క్యూసెక్కుల నీటిని శ్రీశైలం జలాశయానికి విడుదల చేస్తున్నారు. జూరాల గరిష్ట నీటిమట్టం 318.45 మీటర్లు కాగా, జలాశయంలో 318.4 మీటర్ల మేర నీరు నిల్వ వుంది. మొత్తం ఆరు యూనిట్లలో విద్యుదుత్పత్తి జరుగుతోంది. 39 మెగావాట్ల సామర్థ్యం గల ఒక్కో యూనిట్లలో 34 మెగావాట్ల చొప్పున విద్యుత్‌ ఉత్పత్తి అవుతోంది. అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలో కురుస్తున్న వానలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. తాండూరు మండల పరిధిలోని వీరశెట్టిపల్లి వద్ద గల కాగ్నా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో వీరశెట్టిపల్లి గ్రామం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుపోవడంతో రెండురోజులుగా విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. శంషాబాద్‌ మండల పరిధిలోని కెపి దొడ్డి, ఆమస్‌నగర్‌, శ్రీరామ్‌నగర్‌ గ్రామాలు నీటి మునిగాయి. మసాన్‌పల్లి, కందనెల్లి వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. వందల ఎకరాల్లో పంట నీటమునిగింది. పలు గ్రామాల నుంచి హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌కు రాకపోకలు నిలిచిపోయాయి. కరీంనగర్‌లో కురిసిన భారీ వర్షానికి ప్రధాన రోడ్లపై ఉన్న తారు కొట్టుకుపోవడంతో గుంతలమయమయ్యాయి. పలుచోట్ల రోడ్లపై నీరు నిలిచిపోవడంతో రహదారులు నీటమునిగాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరంలోగల బలిజపేట మండలం చిలకలపల్లిలో వరి పొలాలు నీట మునిగాయి. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో భారీ వర్షం కురవడంతో జనజీవనం స్తంభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: