పీకలల్లోతు నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసీ అప్పుల ఊబి నుంచి బయట పడేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తోంది. ఓ వైపు అప్పులు పెరిగిపోతుంటే....మరోవైపు రోజువారీ నష్టాలు సంస్థ మనుగడనే ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ప్రభుత్వాల నుంచి ఆర్ధిక సాయం కరవవడం వల్ల సమస్యలను అధిగమించేందుకు ఆర్టీసీ యాజమాన్యం బాండ్లు జారీ చేసి నిధులు సమకూర్చే ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే 4వేల 500 కోట్ల అప్పుల్లో కూరుకు పోయిన ఆర్టీసీకి రోజూ ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు రెండున్నర కోట్ల రూపాయలు, తెలంగాణలో 2 కోట్ల రూపాయలు నష్టం వస్తున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఆర్ధిక ఇబ్బందులతో బ్యాంకులకు కంతులు చెల్లించలేని దుస్ధితి నెలకొంది. అప్పుల కొండగా మారిన ఆర్టీసీకి అప్పులు ఇవ్వడానికి ఎవరూ ముందుకురావడం లేదు. ఇప్పటికే ఉద్యోగులు పొదుపు చేసుకున్న సొసైటీ , పీఎఫ్ మొత్తాన్ని కూడా రోజువారీ నిర్వహణకు వాడేశారు. కార్మికుల వేతనాల పెంపు కూడా ఏడాదికి పైగా నిలిపివేశారు. ఇన్ని ఇబ్బందుల్లో ఉన్న ఆర్టీసీకి ప్రభుత్వాల నుంచి ఆశించినంత ఆర్ధిక సాయం అందడంలేదు. రాష్ట్ర విభజన కారణంగా రాయితీల నిమిత్తమై రెండు ప్రభుత్వాలు చెల్లించాల్సిన సుమారు 700 కోట్ల రూపాయల చెల్లింపులు నిలిచిపోయాయి. ఇచ్చే నిధులు ఏ ప్రాంతానికి ఖర్చు పెడతారో స్పష్టంగా చెబితే తప్ప నిధులు ఇవ్వలేమంటున్నాయి రెండు ప్రభుత్వాలు. ఈ గడ్డు పరిస్థితి నుంచి బయటపడాలంటే ఆర్టీసీకి తక్షణం వెయ్యికోట్ల నిధులు అవసరం. ఇంత భారీ మొత్తంలో నిధులను ప్రభుత్వాల నుంచి ఆశించడం అసాధ్యమని ఆర్టీసీ అధికారులు నిర్ణయానికొచ్చారు. ఇప్పటివరకు ఆస్తులను తనఖాపెట్టి బ్యాంకుల్లో ఆర్టీసీ అప్పులు తీసుకుంటోంది. విభజన ప్రక్రియ పూర్తి కాకపోవండం...స్థిరాస్తుల పంపకాల్లో స్పష్టత రాకపోవడంతో ప్రస్తుతం ఇది సాధ్యపడటం లేదు. ఆర్టీసీకి రెండు రాష్ట్రాల్లో ఉన్న స్థిరాస్తుల మార్కెట్ విలువ 60 వేల కోట్లుగా ఉంటుందని అంచనా. వీటిని హామీలుగా చూపుతూ.. బాండ్లు జారీ చేసి.. నిధులు సేకరించాలని ఆర్టీసీ అధికారులు యోచిస్తున్నారు. ఆ మేరకు రెండు ప్రభుత్వాలతో పాటు ఆర్బీఐ నుంచి అనుమతి పొందేందుకు ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నారు. బాండ్ల జారీకి ఓకే అంటారా.. లేకపోతే.. వెయ్యి కోట్లు నిధులు సమకూరుస్తారా అని రెండు ప్రభుత్వాలను ఆర్టీసీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: