తన అనర్గళ ప్రసంగాలు, మాటల మాంత్రికతతో యావత్ భారతాన్ని ఓ ఊపు ఊపిన నాయకుడు నరేంద్ర మోడీ. పాలనలో గుజరాత్ సీఎంగా విజయం సాధించడంతోపాటు తనకున్న ఈ శక్తియుక్తులతోనే భారత ప్రధాని పీఠాన్ని అధిష్టించారు. పీఎంగా పగ్గాలు అందుకున్న తర్వాత విదేశీ పర్యటనల్లోనూ తన మాటలు, చేష్టలతో అక్కడి వాళ్ల హృదయాలను గెలుస్తూనే ఉన్నారు. తాజాగా భారత ప్రధాని జరుపుతున్న జపాన్ పర్యటనలో అందుకు అద్దం పట్టే ఘట్టాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడే కాదు అంతకుముందు నేపాల్ పర్యటనలోనూ మోడీ ఇలాగే మనసులు గెలుచుకున్నారనే సంగతి జగతికి తెలిసిందే. ఎపుడో ఏడేళ్ల క్రితం గుజరాత్‌ సీఎంగా జపాన్ లో పర్యటించారు మోడీ. అప్పట్లో మోడీకి గుజరాతీ వంటకాలు చేసిపెట్టిన అక్కడి మహిళ మినాజీ చుడ్గార్‌. సాధారణంగా ఎవ్వరికైనా ఆ సందర్భం గుర్తుంటుందేమో కానీ... ఆమె పేరు మాత్రం గుర్తుపెట్టుకోవడం అంత సులభం కాదు. కానీ మోడీ మాత్రం ఆమెను పేరు పెట్టి పిలిచి తన మేథస్సును చాటుకుని, ఆమెతోపాటు అక్కడి వాళ్ల మనసులనూ గెలుచుకున్నారు. కారెక్కుతున్న సమయంలో దూరం నుంచి గుజరాతీ భాషలో పిలిచిన మహిళను చూసి, దగ్గరకి వెళ్లి, బాగున్నారా మినాజీ అంటూ కుశల ప్రశ్నలు వేసి మరీ ఆమెతో కలిసి ఫోటోలు దిగి జపాన్ హృదయంలో నిలిచిపోయారు. తప్పిపోయి వచ్చి తన సంరక్షణలో పెరిగిన చిన్నారిని పెద్దచేసి వారి తల్లిదండ్రులకు అప్పగించారు నరేంద్ర మోడీ. ఇది అంతకుముందు నేపాల్ పర్యటనలో అక్కడి వాళ్లను ఫిదా చేసిన ఘటన. తాజాగా జపాన్ పర్యటనలోనూ రెండు బౌద్ద ఆలయాలను సందర్శించిన మోడీ... ప్రధానార్చకుడు యయ నగమోరీని సైతం తన మాటల మర్మంతో మరిచిపోకుండా చేశారు. నేను మోడీ, మీరు మోరీ అంటూ హాస్యోక్తి విసిరి ఆయనను పులకింపజేశారు. కింకాకుజి బౌద్ధాలయంలోనూ సరస్సు, తోటల్లో కలియదిరుగుతూ అందర్నీ పలకరిస్తూ ఉత్సాహం గా గడిపారు. తాను పీఎం అన్న సంగతిని మరిచిపోయి మరీ ఒక పదేళ్ల చిన్నారి చెవులు మెలిపెడుతూ ముద్దు చేయడం అందరినీ ఆక ర్షించింది. మొత్తంగా మోడీ విదేశీ పర్యటనలు దేశాల మధ్య సంబంధాలనే కాదు... భారతీయుల కలుపుగోలుతనాన్ని ప్రపంచానికి చాటుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: