కరుడుకట్టిన ఉగ్రవాది యాసిన్‌ భత్కల్‌ ఇంటరాగేషన్‌లో వీటికి సంబంధించిన భయంకర వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. దక్షిణ భారతదేశంలో తమ నెట్‌వర్క్‌ విస్తరించిందన్న ఈ తీవ్రవాది వాంగ్మూలం పోలీసులకు హెచ్చరికలు పంపుతోంది. దేశంలో ఎక్కడ బాంబులు పేలినా హైదరాబాద్‌ ఉలిక్కిపడుతోంది. బాంబుపేలుళ్ల మూలాలు ఇక్కడ నుంచే ఉన్నాయన్నది చాలా సందర్భాల్లో బయటపడింది. ఆరేళ్ల పాటు ఉగ్రవాద కార్యకలాపాలను సాగించిన యాసిన్‌ భత్కల్‌ వివిధ బాంబు పేలుళ్లతో 220 మంది అమాయకుల ప్రాణాలు బలిగొన్నాడు. మోస్ట్‌ వాటెండ్‌గా మారిన కరుడుగట్టిన యాసిన్‌ భత్కల్‌ గత ఏడాది ఆగస్టు 28న నేపాల్‌లోని పోక్రా వద్ద పట్టుబడ్డాడు. దర్యాప్తు సంస్థలు కస్టడీలో తీసుకుని విచారిస్తన్నాయి. భారతదేశంలో నెట్‌వర్కును పెంచుకోవడమే ప్రధాన లక్ష్యంగా తమ కార్యకలాపాలు సాగిస్తున్నట్లు యాసిన్‌ భత్కల్‌ పోలీసుల ముందు అంగీకరించాడు. దక్షిణ భారతదేశంలో యువత నుంచి ఇప్పటికే మద్దతు పొందగలిగామని.. దీనికి అనుగుణంగా నెట్‌వర్కును పెంచుకోగలిగామని వాంగ్మూలమిచ్చాడు. దక్షిణ భారత దేశంలో ఉగ్రవాదుల కదలికలున్న ప్రాంతాల్లో హైదరాబాద్‌ కీలకంగా మారింది. పాతబస్తీలోని పరిస్థితులను ఉగ్రవాదులు అనుకూలంగా మలుచుకుంటున్నారు. అమాయకులైన యువతను ఉగ్రవాద గ్రూపుల్లోకి రిక్రూట్‌ చేసుకుంటున్నారు. మతోన్మాదాన్ని రెచ్చగొట్టడం.. డబ్బు ఎరగా వేసి యువతకు వల వేస్తున్నారు. బెంగళూరు, ముంబై, అహ్మదాబాద్‌, పూణెలలో ఎక్కడ బాంబులు పేలినా వ్యూహరచన పాతబస్తీలో జరిగినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడవుతోంది. లష్కర్‌ ఇ తోయిబా, ఇండియన్‌ ముజాహిదీన్‌ వంటి ఉగ్రవాద సంస్థల నేతలు హైదరాబాద్‌లో కొంతకాలం మకాం వేసినట్టు పోలీసుల వద్ద ఆధారాలు కూడా ఉన్నాయి.  దిల్‌సుఖ్‌నగర్‌లో గత ఏడాది ఫిబ్రవరి 21వ తేదీన బాంబుపెలుళ్ల ఘటనకు ముందుగానే ఇండియన్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాదులు హైదరాబాద్‌లో మకాం వేశారు. రెక్కీ నిర్వహించి నగరంలో అయిదు ప్రాంతాలను బాంబులు పెట్టేందుకు అనుకూలమైనవిగా గుర్తించారు. పాతబస్తీలో మకాం వేసిన యాసిన్‌ భత్కల్‌ అక్కడి నుంచి హయాత్‌నగర్‌కు వెళ్లాడు. వకాస్‌తో తన ప్లాన్‌ను అమలుచేశాడు. ఈ సమయంలో పాతబస్తీలో పలువురు యువకులను స్లీపర్‌సెల్స్‌గా వినియోగించుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఉగ్రవాదులకు ఈ స్లీపర్‌ సెల్స్‌ షెల్టర్‌ జోన్లుగా వినియోగించుకుంటారు. తమ కార్యకలాపాలకు సంబంధించిన వివరాలు తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: