తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజీనామా చేసిన మెదక్ లోక్ సభ స్థానం ఉప ఎన్నిక మీద ఇప్పుడు రాష్ట్రంలోని రాజకీయ పార్టీల కన్నుపడింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ స్థానంలో పోటీ చేయకుండా తప్పుకుంటే తెలుగుదేశం పార్టీ తన మిత్రపక్షం అయిన బీజేపీకి మద్దతు ఇచ్చి ఇక్కడ తెలంగాణలోని తెలుగుదేశం పార్టీ నేతలందరినీ మోహరించి ముందుకు వెళ్తోంది. ఇక్కడ బీజేపీ గెలిచే అవకాశాలు అంతంత మాత్రమే. అయితే టీడీపీ మాత్రం తన నేతలందరిని ఇక్కడ మోహరించి బీజేపీ కంటే ఎక్కువగా ఇక్కడ ప్రచారానికి దిగడం అందరినీ ఆకర్షిస్తోంది. అసలు మెదక్ ఎంపీ టికెట్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి దక్కడం వెనక ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ తో పాటు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడులు ఉన్నారన్నది అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ లో ఉన్న ఆయనకు తెల్లారేసరికి బీజేపీ ఎంపీ టికెట్ దక్కడం వీరి చలవే. అయితే బీజేపీ తెలంగాణ నేతలు ఈ నిర్ణయంతో ఢీలాపడి ప్రచారానికి ఇంకా పూర్థిస్థాయిలో దిగలేదు. కానీ టీడీపీ నేతలు మాత్రం నామినేషన్ నాటి నుండే మెదక్ లో విపక్షాల మీద విరుచుకుపడుతున్నారు. జగ్గారెడ్డిని గెలిపించి నరేంద్రమోడీకి బహుమతిగా ఇవ్వాలని, తద్వారా తెలంగాణకు మంత్రి పదవి తెచ్చుకుందామని టీడీపీ నేతలు పిలుపునిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజావ్యతిరేక పాలనకు మెదక్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించి బుద్దిచెప్పాలని, మెదక్ అభ్యర్థి జగ్గారెడ్డిని అక్రమంగా అరెస్టు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కుట్రలు పన్నుతుందని టీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, రేవంత్ రెడ్డి, ఎల్.రమణలు విరుచుకుపడుతున్నారు. మెదక్ పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలిస్తే ప్రధానమంత్రి మోడీ వద్ద పార్టీ ఇమేజ్ పెరుగుతుందన్న వ్యూహంతో చంద్రబాబు నాయుడు ఇటీవల తెలంగాణలో పోటీ చేసిన అభ్యర్థులు అంతా మెదక్ ప్రచారానికి వెళ్లాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: