తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విభజన నేపథ్యంలో తెలంగాణలో ఓట్లు కొల్లగొట్టేందుకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బీసీ కార్డును తెరమీదకు తీసుకువచ్చారు. తెలంగాణలో ఉన్న తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులను కాదని బీసీ సంఘం రాష్ట్రం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యను టీడీపీలో చేర్చుకుని ఎల్బీనగర్ నియోజకవర్గం నుండి నిలబెట్టారు. అంతేకాకుండా ఆయనను తెలంగాణ తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు. అయితే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కేవలం 15 శాసనసభ స్థానాలకు మాత్రమే పరిమితమయింది. టీఆర్ఎస్ పార్టీ 63 శాసనసభ స్థానాలు గెలుచుకుని అధికారం దక్కించుకుంది. దీంతో ఆర్.కృష్ణయ్యకు టీడీపీలో ప్రాధాన్యం లేకుండా పోయింది. అప్పటిదాకా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్న ఆయనను పక్కకు పెట్టాలని చంద్రబాబు మీద వత్తిడి తెచ్చారు. పార్టీలో సీనియర్ అయిన తమను కాదని ఆర్.కృష్ణయ్యకు శాసనసభా పక్ష నేత పదవి ఎలా ఇస్తారని ప్రశ్నించారు సీనియర్ నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు. అయితే అందరికన్నా సీనియర్ అని ఈ విషయంలో ఎర్రబెల్లికి ప్రాధాన్యం ఇచ్చి చంద్రబాబు మిగతావారిని పక్కన పెట్టారు. అధికారం వస్తే ముఖ్యమంత్రిని చేస్తామని ఆఖరుకు శాసనసభా పక్షనేత పదవి కూడా ఇవ్వలేదని ఆర్.కృష్ణయ్య గత కొంత కాలంగా టీడీపీతో అంటీ ముట్టనట్లుగా ఉండడమే కాకుండా ఎక్కడా కనీసం టీడీపీ కండువా కూడా వేసుకోవడం లేదు. ఈ నేపథ్యంలో తాజా సమాచారాన్ని బట్టి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు ఆర్.కృష్ణయ్య టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమయితే టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లే.

మరింత సమాచారం తెలుసుకోండి: