నరేంద్ర మోడీ... గత చరిత్రను తిరగరాస్తూ సరికొత్త రికార్డులతో భారతీయ జనతా పార్టీని జాతీయ స్థాయిలో విజయపథాన నడిపిన నాయకుడు. తన ముఖ వర్చస్సుతో, మాటల మాంత్రికతతో సీఎం నుంచి పీఎం పీఠంపైకి చేరిన మోడీ పాలనకు వంద రోజులు పూర్తయ్యాయి. ఇదే ఏడాది మే 26న భారత ప్రభుత్వ పాలనా పగ్గాలు అందుకున్న నరేంద్రుడు... తనదైన పాలనా ముద్రతో ముందుకు సాగుతున్నారు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఈ వంద రోజుల పాలన తీపి చేదు కలయికగానే కనిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికల కంటే ఏడాదిన్నర ముందు నుంచీ దేశంలో మోడీ మానియా మొదలయింది. మూడుసార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా అద్భత అభవృద్ధిని అందుకున్న నరేంద్రమోడీయే... బీజేపీ భవిష్యత్తుకు ఆశాదీపం అంటూ దేశమంతటా ఊహాగానాలు మొదలయ్యాయి. మీడియా సంస్థల నుంచి, రాజకీయ మేధావులు, విశ్లేషకులు, సామాన్య ప్రజానీకం కూడా మోడీ తదుపరి ప్రధాని అని ఊహించుకున్నారు. బలమైన కాంగ్రెస్ ను ఢీ కొట్టడం బీజేపీలో వృద్ధ నేతలకు సాధ్యం కాదని భావించారు. దేశవ్యాప్తంగా బలపడిన అభిప్రాయాన్నే కమలం పార్టీ అధిష్టానం కూడా అంగీకరించింది. గుజరాత్ రాజకీయాల నుంచి మోడీని క్రమంగా జాతీయ రాజకీయాల్లోకి మళ్లించారు. ముందుగా ప్రచార కమిటీ బాధ్యతలు, ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే ప్రధాని అభ్యర్థిగా ప్రకటించి శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. ఈ కోణంలో ఎదురైన అనేక అసంతృప్తులను, అడ్డంకులను మోడీ తన రాజకీయ చాతుర్యంతో తిప్పికొట్టారు. కుంభకోణాల్లో కూరుకుపోయి, బక్కచిక్కిన కాంగ్రెస్ పార్టీని తన వాక్ పటిమతో ముచ్చెటమలు పట్టించాడు. దేశమంతా ఊపునిచ్చిన నమో మంత్రం భారతీయ జనతా పార్టీకి అఖండ విజయాన్ని తెచ్చిపెట్టింది. ఎలాంటి అడ్డంకులు లేకుండానే ప్రధాని పీఠం పైకి మోడీ చేరుకున్నారు. మంత్రివర్గంలో తన ముద్రను స్పష్టం చేస్తూ తన తన వాళ్లనే అక్కున చేర్చుకున్నారు. అంతకుముందు అడ్డంకులు సృష్టించిన నేతలను దూరం పెట్టారు. తర్వాత క్రమంగా పార్టీ పైనా నరేంద్రుడు పట్టు పెంచుకున్నారు. ఉత్తర్ ప్రదేశ్ లో పార్టీ విజయానికి బాటలు వేసిన తన మనిషి అమిత్ షా కు జాతీయ బాధ్యతలు కట్టబెట్టారు. అద్వానీ, వాజ్ పేయి, మురళీ మనోహర్ జోషీ వంటి వృద్ధ నేతలను పార్టీ పార్లమెంటరీ బోర్డు నుంచి పక్కన పెట్టి కొత్త రక్తం తీసుకొచ్చారు. ఛాయ్ అమ్ముకునే స్థాయి నుంచి నూటా ఇరవై కోట్ల జనాభా కలిగిన భారతావనిని పాలించే స్థాయికి ఎదిగే క్రమంలో నరేంద్ర మోడీ ఎదుర్కొన్న ఆటుపోట్లు అన్నీ ఇన్నీ కావు. స్వల్ప కాలంలో వాటన్నింటినీ పటా పంచలు చేస్తూ వేగంగా జాతీయ రాజకీయాల్లో దూసుకొచ్చిన మోడీ పాలన పై ప్రజల్లో అదే స్థాయిలో అంచనాలు ఉన్నాయి. అయితే మోడీ వంద రోజుల పాలన మాత్రం ఏ రకంగానూ ఆ అంచనాలను అందుకోలేకపోయింది. జనాకర్షక పథకాలు తేకపోవడం, దీర్ఘకాలిక ప్రయోజనాలున్న వాటికే పెద్ద పీఠ వేస్తుండడమే అందుకు కారణం కావచ్చు. వంద రోజుల ప్రధానిగా మోడీ ప్రభుత్వం ఏమీ అద్భుతాలు ఆవిష్కరించలేదు. జనాకర్షషక పథకాలు ఏవీ ప్రకటించలేదు. అయితే అదే సమయంలో బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే పునాదులు మాత్రం పటిష్టంగానే పడ్డాయి. వంద రోజుల పాలనను పరికించి చూస్తే స్వల్పకాలంలో సత్వర, తాత్కాలిక ఫలితాలనిచ్చే చర్యలు ఎక్కడా చేపట్టలేదు. దీర్ఘకాలంలో శాశ్వత ఫలితాలనిచ్చే వాటిపైనే ఎక్కువ దృష్టి కేంద్రీకరించారు. ముఖ్యంగా మంత్రివర్గం పై పూర్తి స్థాయి పట్టు సాధించిన మోడీ... మంత్రుల పేషీల్లోని అధికారుల విషయంలోనూ తన ముద్రనే వేశారు. ఆర్థికవ్యవస్థను పరుగులు తీయించే క్రమంలో ఎలాంటి అవరోధాలు ఉండరాదని భావించి ప్రధాని ఏకంగా ప్రణాళికాసంఘాన్నే రద్దు చేశారు. బీజేపీ సర్కార్‌ ప్రవేశపెట్టిన తొలి సాధారణ, రైల్వే బడ్జెట్‌లు జనానికి కాస్త కటువుగా కనిపించాయి. అయితే దీర్ఘకాలంలో ధరలను అదుపులో ఉంచేందుకు చర్యలు తప్పవని నిపుణులు విశ్లేషించారు. ముఖ్యంగా మోడీ వంద రోజుల పాలనలోని మంచీ చెడులను ముఖ్యాంశాలుగా చెప్పుకుంటే... విదేశాంగ విధానం విషయంలో మోడీ సర్కార్ చురుకుగా, చాకచక్యంగా సాగుతోంది. దక్షిణాసియాలో భారత్‌ ఆధిక్యాన్ని చాటేందుకు సార్క్‌ దేశాల అధినేతలను తన ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించారు. భూటాన్‌, నేపాల్‌, జపాన్ లలో పర్యటించారు. పాకిస్థాన్ కు స్నేహహస్తం అందించినా... దుందుడుకు చర్యలు చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. విదేశీ పర్యటనల్లో మన సాంప్రదాయాన్ని, కట్టూ బొట్టుకు తనదైన శైలిలో గుర్తింపు తీసుకొస్తున్నారు. ఇక రాజకీయంగా సొంత పార్టీలో పట్టు పెంచుకోవడమే కాదు... ప్రతిపక్షాలను సైతం నియంత్రణలో ఉంచారు. 44 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా ఇచ్చే ప్రసక్తి లేదని స్పష్టం చేసి రాజకీయ ముద్రను చాటారు. విదేశాల్లోని 50 వేల కోట్ల రూపాయల నల్లధనాన్ని రప్పించేందుకు చర్యలు చేపట్టడం, పీఎంవోని ఏకైక అధికార కేంద్రంగా మార్చడం, గతంలో ఉన్న 62 మంత్రుల బృందాలను రద్దు చేయడం, జాతీయ ఆహార గ్రిడ్‌ను ఏర్పర్చి ఆహార లోటున్న ప్రాంతాలకు సరఫరా చేయడం, తద్వారా ధరలను నియంత్రించడం, గ్యాస్‌ ధర పెంపును మరో 3 నెలలపాటు వాయిదా వేసి అంబానీ లాంటి పారిశ్రామికవేత్తల ఆటలు సాగవన్న సంకేతాలు పంపడం, ఆగస్టా వెస్ట్‌ల్యాండ్‌ హెలికాప్టర్ల ఒప్పందం రద్దు వంటి చర్యలు మోడీ పాలనకు, దూరదృష్టికి అద్దం పడుతున్నాయి. ఈ వంద రోజుల పాలనలోనే రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సంబధాలను చెడగొట్టుకోవడం మాత్రం ప్రధానిగా మోడీకి లాభించే అంశం కాదు. ఇలాంటి విషయాల్లో వైఖరి మార్చుకుని ముందుకు సాగితే పాలనలో మరిన్ని మంచి మార్కులు కొట్టేయవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: