కల్వకుంట్ల కవిత.. కేసీఆర్ కూతురుగా మొదట్లో ప్రాచుర్యం పొందినా... తనకంటూ సొంత ఇమేజ్ సంపాదించుకున్న నాయకురాలీమె. రొటీన్ గా రాజకీయ నాయకురాలిగా ఉంటే రాణించడం కష్టమనుకున్న ఈమె.. తెలంగాణ సంస్కృతి పరిరక్షణ ఎజెండాతో జనంలోకి వెళ్లారు. అప్పటికే తెలంగాణ వేడి బాగా ఉండటంతో.. సహజంగానే ఆమె క్లిక్కయ్యారు. ఊరికే ఉద్యమం పోరాటం అని మాత్రమే హంగామా చేయకుండా ఎవరూ పెద్దగా టచ్ చేయని అంశాలను స్పృశించారు. సాంస్కృతిక కోణాలను పట్టుకున్నారు. తెలంగాణ జాగృతి పేరిట సంస్థను స్థాపించి దాని ద్వారా ఎక్కువగా ఫోకస్ అయ్యారు. తెలంగాణలో బాగా జరుపుకునే పల్లె పండుగ బతుకమ్మకు బాగా ప్రచారం చేసి.. కోటి బతుకమ్మల పండుగ అంటూ హడావిడి చేశారు. రాజకీయాలే కాదు సంస్కృతిక అంశాలు కూడా బాగానే ప్రజలను ఆకట్టుకుంటాయని నిరూపించారు. కేసీఆర్ తరహాలోనే ఎక్కడా తడబడకుండా గడగడా మాట్లాడటం కవితకున్న మరో ప్లస్ పాయింట్. అలా తండ్రి ఇమేజ్ సాయం కొంత.. సొంత టాలెంట్ మరికొంత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. మొదటిసారే ఎంపీగా గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టారు. ఎంపీ అయిన కొద్ది రోజుల్లోనే కాశ్మీర్ మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మరో కాంట్రావర్సీకి కేంద్రబిందువయ్యారు. తాజాగా ఆమెను అమెరికాలోని ప్రతిష్ఠాత్మక యేల్ విశ్వవిద్యాలయం ఆహ్వానించడం ద్వారా వార్తల్లోకి వచ్చారు. అక్కడ జరుగుతున్న పార్లమెంటరీ నాయకత్వ సదస్సుకు కవితకు ఆహ్వానం అందింది. న్యూయార్క్ లో అక్టోబర్ 8 నుంచి 18 వరకూ ఎనిమిదో భారత్-యేల్ పార్లమెంటరీ లీడర్షిప్ ప్రోగ్రామ్ జరగనుంది. మనదేశం నుంచి మొత్తం 25మందిని ఆహ్వానించారట. వారిలో కవిత ఒకరు. ఎంపీగా ఎన్నికైన తొలిసారే ఈ గౌరవం దక్కడంతో కవిత మస్త్ ఖుషీగా ఉన్నారు. మరి అక్కడ కూడా కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తారా.. లేకపోతే బుద్దిగా ప్రసంగిస్తారా.. చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: