తెలంగాణ ప్రభుత్వం రూపొందిస్తున్న బడ్జెట్ లో ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ కు ఏ మాత్రం ప్రాధాన్యత లేదని, ఆయనను పక్కన పెట్టి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయంలో అన్ని బాధ్యతలు తీసుకుని దానిని రూపొందించేందుకు కసరత్తు చేస్తున్నాడని మీడియాలో వార్తలు వచ్చాయి. దీనిని కేసీఆర్ నేరుగానే ఖండించారు. అసలు మీడియా వార్తలు రాయడంలో పద్దతి మార్చుకోవాలని, తమ ప్రభుత్వంలో ఈటెల కీలక సభ్యుడని, అందరం కలిసి కూర్చుని బడ్జెట్ రూపొందిస్తే మీడియాకు ఎందుకు కడుపులో నొప్పి అని నేరుగానే ప్రశ్నించారు. కేసీఆర్ సమాధానం ఎలా ఉన్నా మీడియాలో మాత్రం ఆ విమర్శలు ఆగడం లేదు. బడ్జెట్ సమావేశాలను కేసీఆర్ మరికొద్ది కాలం వాయిదా వేశారు. బడ్జెట్ రూపకల్పనకు సంబంధించి కసరత్తు అంతా పూర్తయ్యాక కేసీఆర్ మొత్తం బడ్జెట్ స్వరూపాన్నే మార్చేశాడని, తెలంగాణ బడ్జెట్ తయారీకీ మొత్తం 14 టాస్క్ ఫోర్స్ కమిటీలను వేసి అందులో ఐఏఎస్ అధికారులను, నిపుణులను నియమించడంతో తెలంగాణ మంత్రులకు బడ్జెట్ లో ప్రాధాన్యం లేకుండా పోయిందని విమర్శలు వస్తున్నాయి. కేసీఆర్ బడ్జెట్ విషయంలో తమను దూరం పెట్టడంతో తెలంగాణ మంత్రులు మదనపడడం తప్ప ఏమీ చేయలేకపోతున్నారని మీడియా కథనాల సారాంశం. అయితే మూసపద్దతిలో బడ్జెట్ తయారు చేయడాన్ని కేసీఆర్ ఇష్టపడడం లేదని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు నేపథ్యంలో అభివృద్దికి మార్గంలా బడ్జెట్ ఉండాలని కేసీఆర్ భావిస్తున్నారట. అందుకే ప్రత్యేకంగా కమిటీలను వేశారని, వాటి నివేదికలు అందిన తరువాత మంత్రులతో చర్చించి బడ్జెట్ ఫైనల్ చేస్తారని అంటున్నారు. బడ్జెట్ ప్రజలకు అనుకూలంగా, అభివృద్ది చెందే విధంగా ఉండాలి కానీ ఎలా రూపొందితే ఏంటి ? అన్న విషయం కూడా ఇక్కడ గుర్తుంచుకోవాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: