తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం 2009లో ఇచ్చినట్లే ఇచ్చి సీమాంధ్ర ఉద్యమానికి తలవంచి కాంగ్రెస్ అధిష్టానం వెనక్కు తీసుకుంది. నిజంగా కాంగ్రెస్ కు తెలంగాణ ఇవ్వాలని ఖచ్చితమయిన అభిప్రాయం ఉండి ఉంటే అప్పుడే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చి రెండు రాష్ట్రాలు ఏర్పాటు చేసి ఈ నాలుగేళ్లు రెండు రాష్ట్రాల సమస్యలు తీర్చి ఓ పరిష్కారం చూయించి ఉంటే తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఇంత దారుణంగా ఉండేది కాదు. కానీ తెలంగాణ విషయం తెగేదాకా లాగిన కాంగ్రెస్ పోతూ పోతూ చివరి నిమిషంలో తప్పినిసరి పరిస్థితులలో తెలంగాణను ఏర్పాటు చేసింది. దీంతో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ఆదరించకపోగా, తెలంగాణ ఇచ్చిందన్న కోపంతో సీమాంధ్ర ప్రజలు అసలు పార్టీని నామరూపాలు లేకుండా చేశారు. సీమాంధ్ర ప్రజలు అంటే ఓట్లు వేయలేదు. మరి తెలంగాణ ప్రజలు ఎందుకు ఓట్లు వేయలేదు ? తెలంగాణలో మనం ఎందుకు గెలవలేదు ? అని కనిపించిన ప్రతి తెలంగాణ నేతను నిలదీస్తుందట పార్టీ అధినేత సోనియగాంధీ. ఇక ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజీనామా చేయడంతో తెలంగాణలో మెదక్ లోక్ సభకు ఉప ఎన్నిక వచ్చిపడింది. దీనిని తెలంగాణ ఇచ్చినందుకు సోనియాగాంధీకి కానుకగా ఇవ్వాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ తో తెరవెనుక ప్రయత్నాలు చేశారట. అయితే ప్రియాంకా గాంధీని నిలబెట్టండి అని టీఆర్ఎస్ కౌంటర్ ఇచ్చిందట. దీంతో విధిలేని పరిస్థితులలో కాంగ్రెస్ మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డిని బరిలోకి దించింది. ఈ సీటు ఖచ్చితంగా గెలవాలని సోనియా చెప్పడంతో తెలంగాణ నేతలు ప్రచారంలో తెగ తిరుగుతున్నారు. అయితే ఇంతా చేసినా కాంగ్రెస్ పరిస్థితి మూడో స్థానానికే పరిమితం అని అంచనాలు చెబుతున్నాయి. కానీ కాంగ్రెస్ మాత్రం పార్టీ అధిష్టానం పెద్దలను ప్రచారానికి రంగంలోకి దింపుతోంది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి దిగ్విజయ్ సింగ్, మాజీ ఇంఛార్జి గులాం నబీ ఆజాద్, మాజీ ఎంపీ అజారుద్దీన్, జ్యోతిరాధిత్య సింధియా, కుంతియాలతో పాటు తెలంగాణ పార్టీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, సీఎల్పీ నేత జానారెడ్డి, డి.శ్రీనివాస్, మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ, ఎంపీ వి.హనుమంతరావులు కాళ్లకు బలపాలు కట్టుకుని ప్రచారంలో తిరుగుతున్నారు. కానీ ఆశించిన మేర మాత్రం స్పందన లభించడం లేదు. మరి కాంగ్రెస్ కు ఎన్ని ఓట్లు రాలతాయో ? వేచిచూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: