మెదక్‌ లోక్‌సభ ఉపఎన్నికలో అధికారపార్టీ అభ్యర్థి కోత్త ప్రభాకర్‌రెడ్డి విజయం నల్లేరుపై నడకేనని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖమంత్రి డాక్టర్‌ రాజయ్య అన్నారు. ఈ ఉప ఎన్నికలో బిజెపి, కాంగ్రెస్‌లు ద్వితీయ స్థానం కోసం పోటీ పడుతున్నాయన్నారు. మంగళవారం సంగా రెడ్డిలోని టిఆర్‌ఎస్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌, జహీరాబాద్‌ ఎంపీ బిబి పాటిల్‌తో కలిసి రాజయ్య మాట్లాడారు. ఈ ఉపఎన్నికలో కాంగ్రెస్‌, బిజెపిలకు ఓటమి ఖాయమని తెలిసినా ఆ పార్టీలు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నాయన్నారు. సమై క్యవాదులను తరిమికొట్టి మరోసారి తెలంగాణ వాదాన్ని నిరూపించుకోవాలని ప్రజలు తహతహలా డుతున్నారని చెప్పారు. జగ్గారెడ్డిపై ఎన్నో క్రిమినల్‌ కేసులు ఉన్నాయని, కరుడు గట్టిన సమైక్యవాది జగ్గారెడ్డి అని, బిజెపికి నుంచి పోటీ చేయడానికి ఎవరూ ముందుకు రాలేకపోవడంతో ఆ అవకాశం జగ్గారెడ్డికి దక్కిందన్నారు. ప్రజావ్యతిరేక పార్టీలను తెలంగాణ ప్రజలు కాలగర్భంలో కలుపుతారని తెలిపారు. టిఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విమర్శలు చేసే ముందు తమ నాయకులను చక్కబెట్టుకోవాలని కాంగ్రెస్‌కు హితవు పలికారు. ఉపఎన్నికలో టిఆర్‌ఎస్‌ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌ రాష్ట్రంలో ప్రజాసంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా రని, పేద బడుగు, బలహీనవర్గాల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. సమా వేశంలో ఎంపీలు వినోద్‌కుమార్‌, బాల్క సుమన్‌ తదితరులు పాల్గొన్నారు.   అన్నదాతలు నిత్యం ఎదుర్కొంటున్న విద్యుత్‌ సమస్యతో పాటు, తెలంగాణలో ఉన్న సమస్యలన్నీ ఆంధ్రపాలకులు వారసత్వంగా వదిలి వెళ్ళినవేనని రాష్ట్ర ఐటి శాఖమంత్రి కె.తారకరామారావు అన్నారు. మెదక్‌లో ఏర్పాటు చేసిన టిఆర్‌ఎస్‌ క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడారు. టిఆర్‌ఎస్‌ అధికారంలోకి రాగానే విద్యుత్‌ సమస్య ఉత్పన్నమైందని పేర్కొంటున్న పొన్నాల లక్ష్మయ్యకు మతి భ్రమించిందన్నారు. 9 ఏళ్ల టిడిపి, 10 ఏళ్ల కాంగ్రెస్‌ పరిపాలనలో తెలంగాణ ప్రాంతంలో ఎన్నివనరులు ఉన్నా, ఇక్కడ విద్యుత్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయకుండా ఆంధ్రా, రాయలసీమలో ఏర్పాటు చేశారన్నారు. సీమాంధ్రలో ఎలాంటి వనరులు లేకున్నా అక్కడి ప్రజలకు ఉపాధి కల్పించడం కోసం తెలంగాణ వనరులు, ఉపాధిని దోచుకున్నారని ఆరోపించారు. ఆర్డినెన్స్‌ పేరుతో భద్రాచలం డివిజన్‌లోని ఏడు మండలాలను పోలవరంలో ముంచారన్నారు. వెంకయ్యనాయుడు, చంద్రబాబునాయుడు, పవన్‌కళ్యాణ్‌ చెబితే టిక్కెట్‌ ఇచ్చినవారికి తెలంగాణ ప్రజలు ఎందుకు ఓట్లువేయాలని ప్రశ్నించారు. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చి ఆంక్షలు విధించిన కాంగ్రెస్‌, బిజెపిలకు దిమ్మతిరిగేలా ప్రజలు మెదక్‌ ఉపఎన్నికలో టిఆర్‌ఎస్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: