ఈనెల 5న టీఆర్‌ఎస్‌లో చేరటం దాదాపుగా ఖాయమైన ఖమ్మం జిల్లా టీడీపీ సీనియర్‌ నేత తుమ్మల నాగేశ్వరరావును తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోవటానికి రంగం సిద్ధమవుతోంది. తుమ్మల కోసమే తన మంత్రివర్గాన్ని విస్తరించాలని సీఎం కేసీఆర్‌ సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. అవసరమని మరికొందరికి కూడా ఈ విస్తరణలో బెర్త్‌ దక్కవచ్చనే ప్రచారం జరుగుతోంది. ఇదిలావుంటే..రాబోయే పది, పదిహేను రోజుల్లో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ప్రభుత్వంలోని ఉన్నతస్థాయి అధికార వర్గాలు కూడా చెబుతున్నాయి.  ఈమేరకు మంత్రివర్గ విస్తరణ ముహూర్తంగా ఈనెల 10వ తేదీని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జూన్‌ 2న తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కె.చంద్రశేఖర్‌రావు, మరో 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని శాసనసభ్యుల దామాషా ప్రకారం మరో ఆరుగురిని మంత్రివర్గంలోకి తీసుకోవచ్చు. ఆగస్టు నెలాఖరులో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని సీఎం కేసీఆర్‌ బహిరంగ ప్రకటన చేశారు. ఆ తర్వాత ఆయనే మీడియా సమావేశంలో విలేకరుల నుంచి ‘మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు ?’ అనే ప్రశ్న వచ్చినప్పుడు ‘నాకు జాతకాలు తెలియదు’ అని బదులిచ్చారు. దీంతో అసలు మంత్రివర్గ విస్తరణ ఉంటుందా? ఉండదా?.. ఉంటే ఎప్పుడు? అనే ఉత్కంఠ ఆశావహుల్లో రోజు రోజుకు పెరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: