బకాయిల కోసం చెరకు రైతులు నిర్వహించిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. విజయనగరం జిల్లా సీతానగరం మండలం లచ్చయ్యపేట వద్ద ఎన్‌సిఎస్ సుగర్స్ ఫ్యాక్టరీ ఎదుట మంగళవారం రైతులు మహాధర్నా నిర్వహించడంతో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. రైతులు కొందరు రాళ్లు రువ్వటంతో ఫ్యాక్టరీ కార్యాలయ అద్దాలు ధ్వంసమయ్యాయి. పోలీసులు లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో ఒక సిఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు, నలుగురు రైతులు గాయపడ్డారు. గత ఏడాది ఎన్‌సిఎస్ సుగర్స్‌కు చెరకును సరఫరా చేసిన రైతులకు నేటి వరకు యాజమాన్యం బకాయిలు చెల్లించలేదు. యాజమాన్యం చెరకు రైతులకు దాదాపు 27 కోట్ల రూపాయల వరకు బకాయిపడింది. ఈ బకాయిలు చెల్లించాలని పలుమార్లు చెరకు రైతులు డిమాండ్ చేశారు. దీనిపై ఈ ఏడాది ఫిబ్రవరిలో యాజమాన్యంతో చర్చలు జరుపగా జూన్‌లోగా బకాయిలు చెల్లిస్తామని ఫ్యాక్టరీ యాజమాన్యం హామీ ఇచ్చింది. జూన్‌లో బకాయిల గురించి అడగ్గా మరో నెల గడువు కోరింది. జిల్లా జాయింట్ కలెక్టర్ సమక్షంలో జరిగిన చర్చల్లో కుదిరిన ఒప్పందం ప్రకారం నిర్దేశించిన సమయంలో బకాయిలు చెల్లించలేకపోయింది. తిరిగి యాజమాన్యం ఆగస్టు నెలాఖరు వరకు గడువు కోరడంతో దానికి కూడా రైతు సంఘం అంగీకరించింది. అయితే నేటి వరకు రైతులకు బకాయిలు చెల్లించకపోవడంతో ఆగ్రహించిన రైతులు చెరకు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం సూర్యనారాయణ ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో సీతానగరం, బొబ్బిలి తదితర మండలాలకు చెందిన రైతులు పాల్గొన్నారు. సాయంత్రం 4 గంటల సమయంలో కొంత మంది రైతులు రోడ్డుపై బైఠాయించి ఉండగా, మరికొంత మంది ఫ్యాక్టరీ కార్యాలయంపైకి రాళ్లు రువ్వారు. దీంతో అద్దాలన్నీ ధ్వంసమయ్యాయి. ఫ్యాక్టరీ వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పార్వతీపురం ఎఎస్పీ, బొబ్బిలి డిఎస్పీ, పలువురు సిఐలు, ఎస్సైలు గట్టి బందోబస్తు నిర్వహించారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన రైతుల మహాధర్నా రాత్రి పొద్దుపోయేవరకు కొనసాగింది. విజయనగరం-రాయపూర్ రహదారిపై రైతుల ఆందోళన కారణంగా ఇతర మార్గాల్లో ట్రాఫిక్‌ను మళ్లించినప్పటికీ వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయి జనం ఇబ్బందులు పడ్డారు. రాత్రి 11 గంటలకు ఆందోళన విమరించారు

మరింత సమాచారం తెలుసుకోండి: