తీవ్రంగా దెబ్బతిన్న జమ్మూ కాశ్మీర్‌లో ఇప్పటివరకూ 47 వేల మంది బాధితులను రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించగలిగినా, ఇంకా 4లక్షలమందికిపైగా జనం జలదిగ్బంధంలోనే ఉన్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో భారీ ఎత్తున సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మరో వైపు, వరదనీరు తగ్గనిచోట్ల బాధితులు ఇంకా ఇళ్లపైకప్పులపైనే గడుపుతున్నారు. భారీవర్షాలు వరదల్లో కొండచరియలు విరిగిపడటం, ఇళ్లుకూలడం వంటి సంఘటనల్లో ఇప్పటివరకూ దాదాపు 200మంది ప్రాణాలు కోల్పోయారు. సహాయ కార్యక్రమాల్లో సైన్యం, ఎన్డీఆర్‌ఎఫ్, నావికాదళం నిర్విరామంగా పాల్గొంటున్నాయి. బాధితుల తరలింపులో పౌరవిమాన శాఖ, ప్రభుత్వ, ప్రైవేట్ హెలికాప్టర్ సంస్థలుకూడా రంగప్రవేశం చేశాయి. వరదల్లో చిక్కుకుపోయిన పర్యాటకులను ఉచితంగా తరలించేందుకు బుధవారం అదనంగా రెండు విమానాలను శ్రీనగర్‌కు నడుపుతామని ఎయిర్ ఇండియా ప్రకటించింది. మరో వైపు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలనుంచి రక్షించిన బాధితుల జాబితాను ప్రభుత్వం వెబ్‌సైట్లో ఉంచాలని కేంద్ర ప్రభుత్వం జమ్ము కాశ్మీర్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తద్వారా తమవారి సమాచారంతో బాధితుల కుటుంబ సభ్యులు ఊరటచెందే అవకాశం ఉంటుందని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి చెప్పారు. పలు ప్రాంతాల్లో దెబ్బతిన్న టెలికమ్యూనికేషన్ సదుపాయాలను దశలవారీగా పునరుద్ధరించగలమని అధికారులు చెప్పారు. దెబ్బతిన్న టెలికం సంబంధాలు, బోట్ల కొరత కారణంగా సహాయ కార్యక్రమాల నిర్వహణ కష్టతరమవుతోందని అధికారులు చెప్పారు. ఇప్పటికే వినియోగిస్తున్న 110 ఆర్మీ బోట్లు, 148 ఎన్‌డీఆర్‌ఎఫ్ బోట్లు సరిపోకపోవడంతో, ఢిల్లీనుంచి విమానాల ద్వారా అదనపు బోట్లు తెప్పిస్తున్నారు. సహాయ కార్యక్రమాల్లో లక్షమంది సైనికులు పాలుపంచుకుంటున్నారు. రాజధాని శ్రీనగర్‌లో కొన్నిచోట్ల వరదనీరు ఒకటిన్నర అడుగులనుంచి 3అడుగులవరకూ తగ్గినా, ఉత్తర ప్రాంతంలో, దాల్ సరస్సులో నీటిమట్టం పెరుగుతోందని అధికారులు తెలిపారు. దాల్ సరస్సునుంచి పొంగిన నీటిప్రవాహం హజరత్ బాల్ దర్గా చుట్టూ ఉన్న మైదానంలోకి చేరుతున్న దృశ్యాలు టీవీ చానళ్లు ప్రసారం చేశాయి. వైమానిక దళం తరలించిన 310 మంది బాధితులలో ఒక కొరియన్ జంట, ఆర్మీ మేజర్ జనరల్ ఉన్నారు. వివిధప్రాంతాల్లో చిక్కుకుపోయిన 300మంది కేరళవాసుల్లో మలయాళం సినీనటి అపూర్వ బోస్ కూడా ఉన్నారు. లే ప్రాంతంనుంచి కాశ్మీర్‌లోయ వర కు ఉన్న రహదారిని ఆర్మీ ఇంజనీర్లు, సరిహద్దు రహదారుల సంస్థ సిబ్బంది పునరుద్ధరించారు. పాక్ గోల్ఫ్ జట్టును కాపాడిన ఆర్మీ ----------------------------------- కాశ్మీర్ రాజధాని శ్రీనగ ర్‌లో వరదల్లో చిక్కుకుపోయిన 28మంది క్రీడాకారుల పాకిస్థాన్ గోల్ఫ్ జట్టును, నేపాల్ రాయబారిని భారత సైన్యం కాపాడింది. సార్క్ గోల్ఫ్ టోర్నమెంటులో పాల్గొనేందుకు పాక్ గోల్ఫ్ జట్టు, అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు 17మంది ప్రతినిధుల నేపాల్ బృందం శ్రీనగర్ వచ్చి వరదల్లో చిక్కుకుపోయినట్టు సైన్యాధికారులు తెలిపారు. వారిని సురక్షితంగా కాపాడా మన్నారు. సహాయ బృందాలకోసం గూగుల్ యాప్ ----------------------------------------- వరదప్రాంతాల్లో బాధితులను గుర్తించేం దుకు, గతంలో ఉత్తరాఖండ్ వరదల్లో విజయవంతమైన’పర్సనల్ ఫైండర్’ గూగుల్ అప్లికేషన్‌ను ప్రస్తుతం జమ్ము కాశ్మీర్‌లోనూ వినియోగించబోతున్నారు. సహాయక బృందాలు సమర్థంగా పనిచేసేందుకు ’పర్సనల్ ఫైండర్’ దోహదపడుతుంది. వైపరీత్యాల్లో చిక్కుకుపోయిన తమ బంధువు, స్నేహితుల తాజా స్థితిగతులను ప్రత్యేకమైన ఈ వెబ్‌అప్లికేషన్ ద్వారా తెలుసుకోవడానికి వీలు కలుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: