మెదక్ లో ఏం జరగబోతోంది? అక్కడ ఎలాంటి ఫలితాలు వస్తాయి? అనే ప్రశ్నలను ఇప్పుడు ఎవరినైనా అడిగి చూస్తే... టీఆర్ఎస్ గెలిచేలానే ఉంది కదా! అని అంటున్నారు. దినపత్రికల్లో వార్తలను చదివి ఒక అభిప్రాయానికి వచ్చే వాళ్లు ఇప్పుడు ఇలాంటి అభిప్రాయానికి వచ్చేస్తున్నారు. ఇందుకు కారణం ఏమిటంటే... ఆ వార్తల్లో టీఆర్ఎస్ నేతలు వ్యక్త పరిచే కాన్ఫిడెన్స్! తాము భారీ మెజారిటీతో గెలిచేస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు అంటున్నారు. తమ ప్రధాన వైరి పక్షాలు అయిన కాంగ్రెస్ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేవనేది తెలంగాణ రాష్ట్ర సమితి నేతల మట. తాము గెలుస్తామని టీఆర్ఎస్ నేతలు చెప్పుకోవడం ఒక విధంగా వినడానికి బాగనే ఉంటుందేమో కానీ... ఈ విధంగా బీజేపీ, కాంగ్రెస్ లకు కనీసం డిపాజిట్ కూడా దక్కదని అనడం మాత్రం మరీ ఓవర్ అనిపిస్తోంది. అయితే ఇలాంటి మాటలతో టీఆర్ఎస్ వాళ్లు తాము గెలిచేయబోతున్నామనే అభిప్రాయాన్ని బయట వాళ్లలో కలిగిస్తున్నారు. మరి టీఆర్ఎస్ నేతల అతి విశ్వాసపు మాటలు మెదక్ పరిధిలోని ప్రజల ను టీఆర్ఎస్ వైపు నడిపిస్తాయా?! అనేది ఒకింత సందేహాస్పదమైన విషయం. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కే చంద్రశేఖర్ రావు పోటీ చేసిన అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోనే టీఆర్ఎస్ సత్తా ఏమిటోతెలిసిందే. ఎమ్మెల్యేగా కేసీఆర్ గెలిచిన ఈ నియోజకవర్గంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఇతర పార్టీలు జయకేతనం ఎగరేశాయి. తమ ఆధిపత్యాన్ని చాటుకొన్నాయి. అయితే కేసీఆర్ పోటీ చేసిన తరుణంలో మాత్రం మొత్తం పరిస్థితి మారిపోయింది. ఆయన భారీ మెజారిటీతో గెలిచాడు. మరి మెదక్ లోనూ ఇలాగే జరగదని నమ్మకం ఏముంది?! మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో ఇక్కడ కేసీఆర్ భారీ మెజారిటీతో గెలిస్తే గెలిచి ఉండవచ్చునేమో కానీ... రేపు కూడా టీఆర్ఎస్ కు ఇదే స్థాయిలో మెజారిటీ దక్కుతుందని.. ఈ స్థాయిలో విజయం దక్కుతుందని గ్యారెంటీ లేదు. కేసీఆర్ పోటీ చేస్తే ఒకలా.. ఇంకొకరు పోటీ చేస్తే మరోలా మారుతున్నాయి పరిస్థితులు. దీంతో ఈ నియోజకవర్గపు ఉప ఎన్నికల్లోఏదైనా సంచలనం నమోదయ్యే అవకాశాలూ లేకపోలేదు. అయితే మెదక్ ఆది నుంచి టీఆర్ఎస్ కు పట్టున్న నియోజకవర్గం. కాబట్టి ఆ పార్టీకే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ , భారతీయ జనతా పార్టీ లు కూడా తమ శాయశక్తులూ ఒడ్డి పోరాడుతున్నాయి. మరి ఈ త్రిముఖ పోరులో ఎవరు ఎలాంటి అనుభవాలను మిగుల్చుకొంటారో వేచి చూడాలి!

మరింత సమాచారం తెలుసుకోండి: