సీమాంధ్రలో ప్రముఖంగా మూడు పార్టీలున్నా నందిగామ ఉపఎన్నికలో ప్రధానంగా రెండు పార్టీలే పోటీకి దిగాయి. ఎమ్మెల్యే తంగిరాల హఠాన్మరణంతో.. ఆయన కుమార్తెను టీడీపీ రంగంలోకి దించింది. ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిని పోటీకి నిలపలేదు. అటు ఆళ్లగడ్డలో తమకు టీడీపీ మద్దతు అవసరం కాబట్టి.. నందిగామలో టీడీపీ అభ్యర్థికి ఇబ్బందులు కలిగించడం ఎందుకని పోటీకి దిగలేదు. సహజంగా ఇలా ఎమ్మెల్యేలు మరణించినప్పుడు జరిగే ఎన్నికల్లో వారి వారసులపై పోటీకి దిగకుండా అవతలి పార్టీలు సహకరించడం సాంప్రదాయంగా వస్తోంది. నందిగామలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఆ ఆనవాయితీని పాటించలేదు. చివరకు బరిలో టీడీపీ, కాంగ్రెస్ అభ్యర్థులు పోటీపడుతున్నారు. రాష్ట్ర విభజన పుణ్యమా అని ఏపీలో కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోయింది. గత ఎన్నికల్లో మొత్తం 175 స్థానాల్లో కనీసం ఒక్కటంటే ఒక్కటి కూడా ఆ పార్టీ గెలుచుకోలేకోపోయింది. పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, మాజీ చీఫ్ బొత్స సత్యనారాయణ వంటి ప్రముఖులు కూడా అసెంబ్లీ మొహం చూడలేకపోయారు. కాంగ్రెస్ పార్టీకి ఇంతటి పరాభవం ఏపీ కాంగ్రెస్ చరిత్రలో ఇదే తొలిసారి. మరి ఇప్పుడు నందిగామ ఉపఎన్నికల్లో ఆనవాయితీని కాదని పోటీ చేసి సాధించేదేముంది ? కొత్తగా అక్కడ గెలిస్తే మాత్రం ఆ పార్టీకి ఒరిగేదేముంది..? ఈ ప్రశ్నలకు పీసీసీ మాజీ చీఫ్ బొత్స అదిరిపోయే సమాధానం ఇచ్చారు. అదేమిటంటే... నందిగామలో తమ పార్టీని గెలిపించడం ద్వారా అసెంబ్లీలో తమకూ ప్రాతినిథ్యం దక్కుతుందట. ఆ విధంగా రాష్ట్రంలో నెలకొన్ని ప్రజాసమస్యల మీద గళం విప్పే అవకాశం దొరుకుతుందట. రాష్ట్ర్రంలో టీడీపీ సర్కారు ఎన్నికల హామీలను నెరవేర్చకపోయినా.. నిలదీయడంలో ప్రతిపక్ష స్థానంలో ఉన్న జగన్ పార్టీ సరిగ్గా స్పందించడం లేదంట. నందిగామలో గెలిపించి తమ అభ్యర్థిని అసెంబ్లీకి పంపితే.. ఇక అక్కడ దుమ్ముదులిపేస్తారట. ఒక్కడితో ఏమవుతుందని అస్సలు ఆలోచించవద్దంట. జగన్ అనుభవరాహిత్యంతో ప్రతిపక్ష పాత్ర సరిగ్గా పోషించడం లేదని అభిప్రాయపడుతున్న బొత్స.. తమకూ ఓ అవకాశం ఇవ్వాలని వేడుకుంటున్నాడు. నూటపాతికేళ్ల పార్టీ ఒక్క సీటు గెలిపించి అసెంబ్లీలో తమ పార్టీ కూర్చునే అవకాశం కల్పించమని దీనంగా వేడుకోవడం నిజంగా ఆశ్చర్యమే.

మరింత సమాచారం తెలుసుకోండి: