ఉమ్మడి రాష్ట్రంలో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేయాలంటూ ఉద్యమిం చిన గుంటూరుకు ఏకంగా హైకోర్టు తరలిరానుంది. ఆరు దశాబ్దాల క్రితం హైకోర్టు ఉన్న గుంటూరు లోనే కొత్త రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఏర్పా టుకు శరవేగంగా కసరత్తు సాగుతోంది. అన్ని కోర్టులు ఒకేచోట ఉంటే భవిష్యత్‌లో ఎలాంటి సమ స్యలు ఉండబోవని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు 200 ఎకరాల భూమిని గుర్తించాలంటూ గుంటూరు జిల్లా కలెక్టర్‌ కాంతిలాల్‌ దండేకు హైకోర్టు రిజిస్ట్రార్‌ మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. దీంతో భూసేకరణకు ఆ జిల్లా యం త్రాంగం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.  హైకోర్టు ఒక్కటే అయితే పది ఎకరాల స్థలం సరిపోతుంది. కోర్టుకు అవసరమైన స్థలం నగరంలోనే అందుబాటులో ఉంటుందని ఆ జిల్లా అధికారులు ఇప్పటికే నివేదిక కూడా ఇచ్చినట్లు తెలిసింది. హైకోర్టుతోపాటు ఏసీబీ, సీఐడీ తదితర అన్ని రకాల కోర్టులు ఒకే ప్రాంగణంలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్న నేపథ్యంలోనే 200 ఎకరాలు అవసరమని రిజిస్ట్రార్‌ ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. గుంటూరు జిల్లాలోని నాగార్జుననగర్‌, మంగళగిరి, పెదకాకాని ప్రాంతాల్లోని భూములపై జిల్లా కలెక్టర్‌తోపాటు న్యాయాధికారులు కూడా ఆరా తీస్తున్నారు.  గుంటూరులో కోర్టుల సముదాయం ఏర్పాటు చేస్తే అన్ని జిల్లాలకు కేంద్రంగా ఉంటుంది. కోర్టుల సముదాయం ఏర్పాటుకు అవసరమైన భూముల పరిశీలనకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) త్వరలో గుంటూరు రానున్నట్లు తెలిసింది. ఆయన వచ్చిన తర్వాతే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే సీజే పర్యటన ఇంకా అధికారికంగా ఖరారు కావాల్సి ఉంది. రాష్ట్ర రాజధాని విజయవాడ పరిసరాల్లోనే ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. విజయవాడ పరిసర ప్రాంతాలలోనే అసెంబ్లీ, సచివాలయం, రాష్ట్రస్థాయి కార్యాలయాలు ఉంటాయన్నారు. వీటిని ఎక్కడ ఏర్పాటు చేస్తారో ఇంకా నిర్ణయించలేదు. దీంతో ఆ నిర్ణయం తర్వాతే హైకోర్టు, కోర్టుల సముదాయంపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: