ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సర్కార్‌ వైఫల్యాలపై ఉద్యమాలకు సిద్దం కావాలని ఏపి కాంగ్రెస్‌ నిర్ణయించింది. మరీ ముఖ్యంగా డ్వాక్రా, రైతుల రుణమాఫిపై టిడిపి సర్కార్‌పై ఒత్తిడి పెంచాలని నిర్ణయించింది. రైతులు పొందిన బంగారు రుణంపై బ్యాంకుల తీరును ఏపి కాంగ్రెస్‌ తీవ్రంగా ఖండించింది. అప్పు కింద తాకట్టు పెట్టిన రైతుల బంగారును బ్యాంకులు వేలం వేసేందుకు సిద్దమైతే అందుకు తీవ్రంగా ప్రతిఘటించాలని ఏపి కాంగ్రెస్‌ నిర్ణయించింది. ఇందుకోసం అన్ని బ్యాంకుల వద్ద కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆందోళనకు దిగాలని నిర్ణయించింది. గురువారంనాడు హైదరాబాద్‌లోని ఇందిరాభవన్‌లో ఏపి కాంగ్రెస్‌ పార్టీ సమావేశం జరిగింది. ఏపి పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పిసిసి మాజీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ, ఎంపీ కెవిపి రామచంద్రరావు, మాజీ మంత్రులు ఆనం రాంనారాయణరెడ్డి, సి.రామచంద్రయ్య, శైలజానాథ్‌, ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు తదితరులు సమావేశమయ్యారు. పది అంశాల అజెండాపై వారు ఈ సమావేశంలో చర్చించారు. అప్పుకింద రైతులు తాకట్టు పెట్టిన బంగారంను బ్యాంకులు వేలం వేసే కార్యక్రమానికి పూనుకొంటే అడ్డుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఇందుకోసం అక్టోబర్‌ తొలివారంలో రాష్టవ్య్రాప్తంగా ఉన్న కాంగ్రెస్‌ క్యాడర్‌ను సమీకరించి బ్యాంకుల వద్ద ఆందోళన చేపట్టాలని తీర్మానించారు. ఎన్నికలకు ముందు ఇబ్బడి ముబ్బడిగా టిడిపి ఇచ్చిన హామీలను అమలు చేయించాలని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసేందుకు కాంగ్రెస్‌ ప్రతినిధుల బృందంతో ముందుకెళ్లాలని నిర్ణయించారు. తద్వారా టిడిపి సర్కార్‌ను ఇరకాటంలో పెట్టాలని భావిస్తున్నారు. అదే సందర్భంలో పార్టీలో అన్ని కమిటీలను రెండు విడతలుగా నియమించాలని తీర్మానిం చారు. అక్టోబర్‌ తొలి వారంలో పిసిసి రాష్ట్ర కార్యవర్గంతోపాటు పార్టీకి చెందిన వివిధ అనుబంధ విభాగాల అధ్యక్షుల నియామకం చేపట్టాలని నిర్ణయించారు. అక్టోబర్‌ చివరి వారంలో మండల, పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షులతోపాటు అవకాశ మున్న చోట డిసిసి అధ్యక్షుల మార్పులు, చేర్పులుచేయాలని భావిస్తోంది. పార్టీకి చెందిన మాజీ మంత్రులు, ప్రజాప్రతి నిధులకు సంబంధించిన భద్రతను రద్దుచేయడంపైనా ఈ సమావేశంలో చర్చకు వచ్చింది. మాజీ మంత్రులు శైలజానాథ్‌, కోట్ల సూర్య ప్రకాశ్‌రెడ్డి ఇతరుల భద్రతను తొలగించి టిడిపికి చెందిన మాజీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌కు మాత్రం భద్రతను కొనసాగిం చడంపై ఈ సమావేశంలో చర్చకు వచ్చింది. భద్రత విషయంలో అందరికీ ఒకే విధానంపాటించాలని ఈ సమావేశంలో నేతలు చర్చించారు. ఈ విషయంలో తమ పార్టీ నేతలకు ఉన్న భద్రతను కొనసాగించాలని కోరుతూ త్వరలో ఏపి సిఎం చంద్రబాబును, రాష్ట్ర హోంమంత్రి, డిజిపిలను కలసి వినతి పత్రం అందించాలని తీర్మానించారు. నందిగామలో పార్టీ విజయావకాశాలపై కూడా కాంగ్రెస్‌ నేతలు చర్చించుకొన్నారు. ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థికి మద్దతుగా నేతలంతా ఎంతో సమన్వయంతో పనిచేశారని, ఎన్నడూ లేనంతగా ప్రచారం చేపట్టారని సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు. ఈ ప్రచారంవల్ల పార్టీ ఫలితాలుమెరుగ్గా వస్తాయని ఈ సమావేశంలోని నేతలు చర్చించుకొన్నారు. పార్టీ విధానాలు, పోరాటాలు, ఉద్యమాల అంశాల గురించి మీడియా, సోషల్‌ మీడియాలో విస్త్రుతంగా ప్రచారం చేపట్టాని నిర్ణయించారు. అదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ప్రజల ముందుకు తీసుకెళ్లేందుకు ఈ ప్రసార, పత్రికా మద్యమాలను విస్త్రుతంగా వినియోగించుకోవాలని నిర్ణయించుకొన్నట్లు సమాచారం. గత ప్రభుత్వంలో అమలు అవుతున్న మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీలు, ఆదర్శరైతులు, ఫీల్డ్‌ అసిస్టెంట్‌లు, జౌట్‌ సోర్సింగ్‌ సిబ్బందిని యధాతథంగా కొనసాగించాలని రాష్ట్ర సర్కార్‌ను కోరాలని నిర్ణయించారు. వారిలో ఎవరినైనా ఆయా వర్గాలకు అండగా ఉండి పార్టీ తరపున రాష్ట్ర సర్కార్‌కు వ్యతిరేకంగాపోరాడాలని ఈ సమావేశంలో నేతలు తీర్మానం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: