పేద ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా సిఎం కెసిఆర్ ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తుండగా, రాష్ట్రంలో టిఆర్‌ఎస్ తిరుగులేని శక్తిగా ఎదిగినట్లు రాష్ట్ర ఐటి, పంచాయతీరాజ్ శాఖా మంత్రి కె.తారకరామారావు స్పష్టం చేశారు. గురువారం గజ్వేల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని ఆయన ప్రసంగించారు. డిపాజిట్ కోసం పాకులాడుతున్న కాంగ్రెస్, బిజెపిలకు అది కూడా కష్టం కానుండగా, జీర్ణించుకోలేని ఆ పార్టీల నేతలు రాష్ట్ర, జాతీయ నేతలను తెచ్చి కెసిఆర్‌ను తిట్టిపిస్తున్నట్లు ఎద్దేవా చేశారు. పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం టీఆర్‌ఎస్‌తోనే సాధ్యపడనుండగా, ఎన్నికల మెనిఫెస్టోలో పొందుపర్చిన హామీల ఆమలుకు కట్టుబడి పని చేస్తూ 100 రోజుల్లో వందకు పైగా సంక్షేమ పథకాల జీఓలు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. మెదక్ నుండి కొత్త ప్రభాకర్‌రెడ్డిని గెలిపించి సత్తా చాటాలని, అయితే జాతీయ పార్టీ బిజెపికి అభ్యర్థి కరువవగా, ఎపి సిఎం బాబు, కేంద్ర మంత్రి వెంకయ్య, హీరో పవన్‌కల్యాణ్ షాడోగా సమైక్యవాది జగ్గారెడ్డిని భరిలో దింపినట్లు విమర్శించారు. సీమాంధ్రులకు తొత్తుగా ఉంటూ ఉద్యమకారులు, ఉద్యమనేతలే లక్ష్యంగా విమర్శలు చేసిన ఆయనను జనం నిలదీస్తుండగా, హైద్రాబాద్‌లో గవర్నర్ పెత్తనం, 7మండలాలు ఎపిలో కలవడానికి బిజెపి కారణమని ఆరోపించారు. స్వంత నియోజకవర్గాల్లోనే పట్టుకోల్పోయిన వారిని భరిలో దిగడం సిగ్గుచేటని, టీఆర్‌ఎస్ అధికారం చేపట్టగానే 480కోట్ల ఇన్‌ఫుట్ సబ్సిడీని విడుదల చేయగా, రైతు రుణమాఫీపై మొండి ధైర్యంతో ముందుకెల్తూ రూ,19వేల కోట్ల మాఫీకి రంగం సిద్ధం చేసినట్లు చెప్పారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కల్యాణ లక్ష్మి పేరిట 51వేల సహాయం చేస్తుండగా, దళితులందరికి 3ఎకరాల భూ పంపిణీ, వివిధ రకాల పెన్షన్ల మంజూరికి చర్యలు తీసుకున్నట్లు వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: