కొత్త ప్రభుత్వాల మీద బోలెడు ఆశలు పెట్టుకొన్న వాళ్లు అనేక మంది ఇప్పుడిప్పుడే నిరసన బాటలను ఎంచుకొంటున్నారు. పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ఏదో చేసేస్తాయని అనుకొన్న వాళ్లు... ఏదీ జరగకపోవడంతో రోడ్డెక్కుతున్నారు. తమ నిరసన స్వరాలను వినిపిస్తున్నారు. ఇలాంటి వారి పై ప్రభుత్వం యథాతథంగా అణిచివేత చర్యలకు పాల్పడుతుండటం విశేషం. వారి సమస్యల గురించి తెలుసుకోవడానికి ప్రజాప్రతినిధులకు బదులుగా పోలీసులు వచ్చి జోక్యం చేసుకొంటుండటం విశేషం. మొన్న డ్వాక్రా మహిళలు..ఇప్పుడు విద్యావలంటీర్లు.. నిరసన కార్యక్రమాలు చేపడుతున్న వారి జాబితాల్లో వీరు జాయిన్ అయ్యారు. ఏపీ ప్రభుత్వం ఐటిడిఎ పరిదిలోని విద్యా వాలంటీర్లను కొనసాగించాలని కోరుతూ విజయనగరం జిల్లా పార్వతీపురంలో నిరుద్యోగులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. కొన్ని వందల మంది యువతీయువకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తమ ఉపాధిని కాపాడాలని లేదా కొత్త ఉపాధిని ఇప్పించాలని వారు డిమాండ్ చేశారు. మరి చంద్రబాబు ప్రభుత్వం ఇంకా హనీమూన్ పిరియడ్ లో ఉంది... ఇలాంటినిరుద్యోగులతో చర్చలు జరుపుతారని, ఏ మంత్రిగారో, ఎమ్మెల్యేగారోవారితో మాట్లాడి వారి ఊరడిస్తారని అందరూ అనుకొన్నారు. అయితే జరిగింది వేరు. ఆందోళనకారులతో చర్చలు జరపడానికి పోలీసులు రంగంలోకి దిగారు. మొదట ఆందోళనను విరమించాలని కోరిన పోలీసులు...పరిస్థితి అదుపులోకి రాకపోయే సరికి లాఠీలకు పని చెప్పారు. యువతీయువకులను చెదరగొట్టారు. మరి ఇది అంత ఆహ్వానించదగిన పరిణామం అయితే కాదు. నిరుద్యోగులపై గత ప్రభుత్వం వ్యవహరించిన తీరుగానే చంద్రబాబు ప్రభుత్వం కూడా వ్యవహరిస్తోంది... ఇంటికో ఉద్యోగం అన్న బాబు గారి హయాంలో ఇలా తొలగించబడ్డ విద్యావలంటీర్లపై లాఠీ విరగడం విడ్డూరం అవుతోంది!

మరింత సమాచారం తెలుసుకోండి: