2004 అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఓటమికి కారణాన్ని వివరించారు తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. నాడు ముఖ్యమంత్రిగా ఉండి తాను చేసిన తప్పుల ఫలితంగానే పార్టీ ఓటమి పాలయ్యిందని ఆయన అన్నాడు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ పార్టీ అప్పుడు అధికారంలోకి రాగా... తెలుగుదేశం పార్టీ కేవలం 42 అసెంబ్లీ స్థానాలకు పరిమితం అయ్యింది. ఆ ఎన్నికల ముందు వరకూ కూడా మీడియా తెలుగుదేశం గెలిచేస్తోందని హోరెత్తించింది. బాబు ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి అవుతున్నాడని వార్తలు రాసింది. సర్వేలు అంటూ తెలుగుదేశం పార్టీ ఏపీలోకనీస మెజారిటీని సాధించుకొంటుందని మీడియా స్పష్టం చేసింది, అయితే ఆ అంచనాలన్నీ తలకిందుల అయ్యాయి. తెలుగుదేశం పార్టీ చిత్తుగా ఓటమి పాలయ్యింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.  ఆ తర్వాత అనేక విశ్లేషణలు వినిపించాయి. తెలుగుదేశం ఓటమికి, కాంగ్రెస్ విజయానికి ఎవరికి తోచిన కారణాలను వారు వివరించారు. ఈ విషయంలో తెలుగుదేశం నేతలను కదిలిస్తే వాళ్లు సవాలక్ష కారణాలను చెబుతారు. కార్యకర్తల్లోని అసంతృప్తే పార్టీ ఓటమికి కారణమని కొందరు, బాబు గారి ఒంటెత్తు పోకడే కారణమని మరికొందరు, ప్రతిపక్ష పార్టీ ఇచ్చిన హామీలే తమ చేతి నుంచి అధికారం చేజారడానికి కారణమని ఇంకొందరు అంటారు. 2014లో తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారం సాధించుకొనేంత వరకూ టీడీపీ నేతలు నాటి ఓటమి గురించి అనేక రీజన్లు చెబుతూ వచ్చారు. అయితే ఇప్పుడు చంద్రబాబు ఆ విషయం గురించి నోరు మెదిపారు. నాడు రాష్ట్ర అభివృద్ధి పై తాను నిర్లక్ష్యం వహించడమే ఓటమికి కారణం అని ఆయన అన్నాడు. పదేళ్ల నాటి పొరపాటు గురించి ఇప్పుడు చెప్పుకొన్నాడు. ఎలాగైతేనేంద పదేళ్లకు అయినా తిరిగి అధికారం చేతికొచ్చిందిగా!

మరింత సమాచారం తెలుసుకోండి: