తెలంగాణలోని మెదక్‌ లోక్‌సభ నియోజకవర్గ, ఆంధ్రప్రదేశ్‌లోని నందిగామ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రెండు రాష్ట్రాల్లోని రెండు నియోజకవర్గాల్లో మొత్తం 17.27 లక్షల మంది ఓటర్లు శనివారం తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది. 16వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మెదక్‌ లోక్‌సభ నియోజకవర్గంలో 15,43,700 మంది ఓటర్లు ఉండగా, నందిగామ అసెంబ్లీ నియోజకవర్గంలో 1,84,061 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం మెదక్‌లో 1837, నందిగామలో 200 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ శుక్రవారం పత్రికల వారికి వెల్లడించారు. 2014 సాధారణ ఎన్నికల్లో మెదక్‌లో 77 శాతం, నందిగామలో 85 శాతం పోలింగ్‌ జరిగింది. ఈసారి అంతకంటే ఎక్కువ పోలింగ్‌ జరుగుతుందని భావిస్తున్నామన్నారు. ఫోటో గుర్తింపుకార్డుతో సహా రేషన్‌కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఆధార్‌కార్డ్డ్‌, బ్యాంక్‌ పాస్‌బుక్‌, పాన్‌కార్డ్‌ లాంటి 11 రకాల డాక్యుమెంట్లలో దేనినైనా ఒకదానిని చూపించి ఓటు హక్కును వినియోగిం చుకోవచ్చు. గురువారం సాయంత్రా నికి 95 శాతం ఓటర్లకు ఫోటో ఓటర్‌ స్లిప్పులను అందజేసి నట్లు భన్వర్‌లాల్‌ తెలిపారు. ఫోటో ఓటర్‌ స్లిప్‌ ఉంటే గుర్తింపు కార్డు కూడా అవసరం లేదన్నారు. బూత్‌ లెవల్‌ ఆఫీసర్‌ వద్ద కూడా ఫోటో ఓటర్‌ స్లిప్‌ ఉంటాయని, దానిని ఓటు వేసే ముందు పొంది వినియోగించుకోవచ్చన్నారు. నిర్భయంగా, స్వచ్ఛం దంగా ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వచ్చే 24 గంటలు అత్యంత కీలకమని, అందువలన గట్టి నిఘాను ఏర్పాటు చేస్తున్నామన్నారు. కర్నాటక సరిహద్దుల నుండి మద్యం మెదక్‌ జిల్లాలోకి తరలకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆరుగురు పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. ఇందులో నలుగురు మెదక్‌ పార్లమెంటు స్థానానికి, ఇద్దరు నందిగామ అసెంబ్లీ స్థానానికి పరిశీలకులుగా ఉంటారు. వీరుగాక రెండు నియోజకవర్గాలకు ఒక్కొక్కరి చొప్పున అభ్యర్థులు చేసే ఖర్చులను పర్యవేక్షించేందుకు పరిశీలకులను కూడా నియమించారు. మెదక్‌ నియోజకవర్గంలో 1141, నందిగామలో 129 పోలింగ్‌ కేంద్రాల్లో ఓటింగ్‌ సరళిని వీక్షించేందుకు లైవ్‌ టెలికాస్ట్‌ ఏర్పాట్లు జరిగాయి. మీడియా ద్వారా ప్రచారం చేయడంగానీ, ఎస్‌ఎంఎస్‌ ద్వారా ఓట్లను అభ్యర్థించడం గానీ చేయరాదని ఆయన తెలిపారు. కోటి రూపాయల నగదు, 5 వేల లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు భన్వర్‌లాల్‌ తెలిపారు

మరింత సమాచారం తెలుసుకోండి: