రెండు రాష్ట్రాల్లో శాసనసభ స్థానాల పునర్విభజనలో తొలి అడుగుపడింది. ఎన్నికల కమిషన్ కూడా రెండు రాష్ట్రాల అధికారులు, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌తో నిర్వహించిన సమావేశంలో లోతుగా చర్చించింది. పునర్విభజనకు ఉన్న సాంకేతిక అడ్డంకులు, రెండు రాష్ట్రాల్లో సీట్లు పెరుగుదల వంటి అంశాలను సమీక్షించింది. అంశాలు నిర్ధిష్టంగా ఖరారు కాకపోయినప్పటికీ... అంకెలు మాత్రం ఖరారయ్యాయి. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఇప్పుడున్న ఏడు అసెంబ్లీ స్థానాలకుగాను, ఇకపై తొమ్మిది స్థానాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 119 స్థానాలు ఉండగా, అవి 153కు పెరగనున్నాయి. అలాగే ఆంధ్రలో ఇప్పుడున్న 175 అసెంబ్లీ స్థానాలు ఇక 225 కానున్నాయి. ఇదే సమయంలో రిజర్వ్‌డ్ స్థానాలపైనా దాదాపు కసరత్తు జరిగింది. ఎస్సీ, ఎస్టీ స్థానాలను ఆయా రాష్ట్రాల్లోని ఆయా కులాల జనాభా ప్రాతిపదికన ఖరారు చేయనున్నారు. ఆంధ్రలో ఎస్సీ, తెలంగాణలో ఎస్టీ సీట్లు ఎక్కువగా పెరగనున్నాయి. తెలంగాణకు సంబంధించి 19ఎస్సీ, 12 ఎస్టీ స్థానాలకుగాను 24 ఎస్సీ, 14 ఎస్టీ స్థానాలు కానున్నాయి. ఆంధ్రలో 29 ఎస్సీ, 7 ఎస్సీ స్థానాలకుగాను 38 ఎస్సీ, 12 ఎస్టీ స్థానాలకు పెరగనున్నాయి. అయితే పార్లమెంట్ స్థానాల్లో ఎటువంటి పెరుగుదల కనిపించడం లేదు. తెలంగాణలో మొత్తం అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఖమ్మంలో రెండు, వరంగల్, నల్లగొండల్లో మూడు చొప్పున, మహబూబ్‌నగర్‌లో నాలుగు, హైదరాబాద్‌లో రెండు, రంగారెడ్డిలో అత్యధికంగా తొమ్మిది, మెదక్‌లో మూడు, కరీంనగర్‌లో నాలుగు, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో రెండేసి చొప్పున స్థానాలు పెరగనున్నాయి. అదే ఎస్సీ స్థానాలకు సంబంధించి వరంగల్, నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో ఒక్కో స్థానం చొప్పున పెరగనుంది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మొత్తం శాసనసభ స్థానాల్లో చిత్తూరు, అనంతపురం, గుంటూరు, కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో ఐదేసి స్థానాల చొప్పున, కర్నూలు, నెల్లూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో నాలుగు చొప్పున స్థానాలు పెరుగుతాయి. కడప, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మూడు స్థానాల చొప్పున, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో రెండేసి చొప్పున స్థానాలు పెరగనున్నాయి. ఇదే రాష్ట్రంలో ఎస్సీ సీట్ల పెరుగుదల పరిశీలిస్తే చిత్తూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో మూడేసి చొప్పున, నెల్లూరు, నాలుగు సీమ జిల్లాల్లో రెండేసి సీట్లు చొప్పున, ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో ఒక్కో సీటు చొప్పున పెరగనున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: