కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో కలిసి ప్రచారం చేసేందుకు శరద్ పవార్ మళ్లీ నో చెప్పారు. మరో నెల రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న మహారాష్ట్రలో కాంగ్రెస్-ఎన్సీపీ కూటమిలో అన్ని విషయాల్లో సమన్వయలోపం స్పష్టంగా కనిపిస్తోంది. పవార్-కు పెత్తనం అప్పగించేందుకు హైకమాండ్ సిద్ధమైనా రాష్ట్ర కాంగ్రెస్ మాత్రం విమర్శలకు దిగడంతో వీరిది నామమాత్రం పొత్తుగా మిగిలింది. రాహుల్ గాంధీతో పాటు వేదిక పంచుకునేందుకు నేషలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ ససేమిరా అంటున్నారు. రాహుల్-తో కలిసి మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు పవార్ నో చెప్పడం ఇది రెండవసారి. పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా రాహుల్-తో కలిసి శరద్ పవార్ ప్రచారం చేయలేదు. పైపెచ్చు అనారోగ్య కారణంతో ఈ ఎన్నికల్లో సోనియా కూడా తన పర్యటనను రద్దుచేసుకున్నారు. దీంతో ఎన్సీపీ- కాంగ్రెస్ మధ్య అభిప్రాయ భేదాలు అప్పట్లో రచ్చకెక్కాయి. పదిహేనేళ్లుగా మహారాష్ట్రలో అధికారం చెలాయిస్తున్న కాంగ్రెస్- నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీపై మరాఠాల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. పైపెచ్చు పలు కుంభకోణాలతో పాటు ఎన్సీపీ- కాంగ్రెస్ నేతల మధ్య భేదాభిప్రాయాలు తారస్థాయికి చేరడంతో 48 లోక్-సభ స్థానాలున్న మహారాష్ట్రలో ఈ కూటమి కేవలం 6 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇవే ఫలితాలు రానున్న అసెంబ్లీ ఎన్నికలపై పడతాయని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.  గోపీనాథ్ ముండేను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని బీజేపీ భావించినప్పటికీ తానే సీఎం అభ్యర్థిగా ఉంటానన్న ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యలతో బీజేపీ- సేన కూటమి మధ్య పొరపొచ్చాలు వచ్చాయి. ఈ లోగా రోడ్డు ప్రమాదంలో ముండే హఠాన్మరణం చెందారు. ఆ తరువాత సీఎం అభ్యర్థిని ప్రకటించకుండానే ఈ ఎన్నికలు ఎదుర్కొనేందుకు బీజేపీ కూటమి సిద్ధమైంది. కేవలం మోడీ వంద రోజుల పాలన, అభివృద్ధి అనే మంత్రంతోనే బీజేపీ మరాఠాల తీర్పు కోరనుంది. హిందువుల పరిరక్షణనే ప్రధాన అజెండాగా శివసేన ఎన్నికల బరిలోకి దిగుతోంది. అయితే ఈ సారి సీఎం అభ్యర్థిగా శివసేనకే అవకాశమివ్వాలని సేన గట్టిగా పట్టుబడుతోంది. అంతేకాదు కేవలం నమో నామస్మరణతో పని జరగదని కూడా శివసేన అధికారికంగా పేర్కొంది. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో సేన 169 స్థానాల్లో పోటీచేయగా కేవలం 44 స్థానాలు దక్కించుకుంది. 119 అసెంబ్లీ స్థానాల్లో పోటీచేసిన బీజేపీ 46 సీట్లు గెలిచింది.  288 అసెంబ్లీ స్థానాల్లో సగానికి పైగా సీట్లు తమకు కేటాయించాలంటూ 73 ఏళ్ల పవార్ డిమాండ్ చేస్తుండడం కాంగ్రెస్-కు మింగుడుపడకపోవడంతో ఇంకా సీట్ల పంపకాలు కొలిక్కి రాలేదు. మోడీ వేవ్-తో మరాఠా గడ్డపై ఈ రెండు పార్టీలు చతికిలపడి డీలా పడ్డాయి. మరోవైపు శివసేన- బీజేపీ కూటమిలో అసెంబ్లీ ఎన్నికలు నయా జోష్-ను నింపాయి. అమిత్-షా బీజేపీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టడంతో మోడీ చరిష్మా, అమిత్-షా వ్యూహం తమకు చక్కని ఫలితాలు తెచ్చిపెడతాయని కమలం కూటమి ఉత్సాహంగా ఉంది. ముంబైలోనే పుట్టిన అమిత్-షా పుట్టిన గడ్డపై అధికారాన్ని ఎలాగోలా చేజిక్కించుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: