తూర్పు కనుమలను తవ్వి పారేసిన బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు పడమటి కనుమలను సైతం పచ్చదనానికి దూరం చేయడానికి చేస్తున్న ప్రయత్నం నడిచిపోతున్న పర్యావరణ వైపరీత్యం! పడమటి కనుమలలో త్వరగా పాడయిపోవడానికి వీలున్న ప్రాంతాల-ఎకో సెన్సిటివ్ ఏరియా-ఇఎస్‌ఏస్-ను గుర్తించడంలో ప్రభుత్వాల వైఫల్యాన్ని సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన ‘హరిత న్యాయ మండలి’వారు విమర్శించడం సమస్య తీవ్రతకు మరో నిదర్శనం! ‘ఎకో సెన్సిటివ్ ఏరియా’ పరిధిలో చేర్చదగిన పశ్చిమ పర్వతీయ ప్రాంతాలను గుర్తించడానికి వీలుగా కొత్తగా సర్వే జరిపించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను కోరిందా అన్నది హరిత పరిరక్షక జాతీయ న్యాయమండలి-నేషనల్ ట్రైబ్యూనల్-వారి సందేహం! ఈ విషయమై వారం రోజులలోగా వివరణాత్మకమైన ప్రమాణ పత్రాన్ని-అఫిడవిట్-దాఖలు చేయవలసిందిగా ట్రైబ్యునల్ న్యాయమూర్తి స్వతంతర్ కుమార్ కేంద్ర ప్రభుత్వ పర్యావరణ మంత్రిత్వ శాఖ కార్యదర్శిని ఆదేశించారట! ఇతర దేశాలలో కంటే చాలా ఎక్కువగా భారతదేశంలో అటవీ పరిరక్షక అధికారులపై సిబ్బందిపై దాడులు జరుగుతున్నాయని ఒక అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ వారు నిర్ధారించడం మరో సమాంతర వైపరీత్యం! ‘ప్రత్యేక ఆర్థిక మండలుల’-స్పెషల్ ఎకనమిక్ జోన్స్-సెజ్‌లు- పేరుతో పారిశ్రామిక ప్రగతి కేంద్రీకరణ జరగడానికి వీలుగా ప్రభుత్వ విధానాలు వ్యవస్థీకృతమైన తరువాత పదేళ్లలో లక్షలాది హెక్టారులలోని అడవులు ధ్వంసమైపోయాయి! ఇది నడిచి పోతున్న ఇంకొక సమాంతర వైపరీత్యం! గంధపు చెక్కల దోపిడీదారుడు వీరప్పన్ వంటివారు హతులైనప్పటికీ అటవీ సంపదను అప్రతిహతంగా కొల్లగొడుతున్న దొంగలు, దళారీలు, అసాంఘిక బీభత్సకారులు విస్తరిస్తునే ఉన్నారు! ఇది ఇంకొక వైపరీత్యం! తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప ప్రాం తాలలోని ఎర్రగంధపు వృక్షాలను నరికిపారేసి కలపను తరలిస్తున్న ముఠాలను సమూలంగా నిర్మూలించలేకపోవడం ప్రభుత్వం వారి వైఫల్యం! ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర ప్రభుత్వమే తిరుమల సమీపంలోని ఈ అపురూపమైన రక్త చందన వృక్షాలను నిర్మూలించి ‘క్రికెట్ మైదానాన్ని’ ఏర్పాటు చేయడానికి ప్రయత్నించడం చరిత్ర! ‘గ్రీన్ ట్రిబ్యునల్’ వారి జోక్యంతో ఈ అటవీ విధ్వంసం ఆగిపోయింది... నల్లమల కనుమల ప్రాంతంనుండి చెంచులను పారద్రోలి అడవులను ‘డీబీర్స్’ అనే విదేశీయ సంస్థకు అప్పగించడానికి జరిగిన ప్రయత్నం కూడ తాత్కాలికంగా ఆగిపోయింది! కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానంలో స్పష్టత లేని కారణంగా వ్యవసాయ భూములతోపాటు అటవీ భూములు కూడ బహుళ జాతీయ వాణిజ్య సంస్థల పారిశ్రామిక దురాక్రమణగ్రస్తమైపోతున్నాయి! గత ఏడాది రూపొందిన భూమి సేకరణ చట్టం భూములను ‘కబ్జా’ చేయదలచుకున్న పారిశ్రామిక సంస్థల ప్రయోజనాలకు భంగకరంగా ఉందట! అందువల్ల మన్‌మోహన్‌సింగ్ ప్రభుత్వం చేసిన ‘్భమి సేకరణ చట్టం’లోని నిబంధనలను ప్రస్తుత ప్రభుత్వం సడలించనున్నదట! అడవులు పాడు పడిపోయినప్పటికీ ‘అభివృద్ధి’ జరిగిపోతే చాలునన్న విధానం విషయంలో ప్రభుత్వ రాజకీయ నిర్వాహకులందరూ ఏకాభిప్రాయంతో ఉండడం అతి ప్రధానమైన వైపరీత్యం... గత డిసెంబర్‌లో తిరుమల, తిరుపతి సమీపంలోని శేషాచలం అడవులలో ఎర్రగంధం చెట్లను నరికి కలపను తరలిస్తుండిన దొంగ రవాణాదారులను నిరోధించడానికి యత్నించిన ఇద్దరు అటవీ అధికారులు హతులైపోయారు! ‘స్మగ్లర్లు’ తిరగబడి అధికారులపై దాడిచేసి హత్య చేశారు. ఎనిమిది మంది అటవీ ఉద్యోగి బృందంపై దాడి చేయగలిగిన కలప దొంగల సంఖ్య ఎంత ఉందో ఊహించుకోవచ్చు! ఈ దుర్ఘటన జరిగిపోయి పది నెలలు కావస్తున్నప్పటికీ అడవులను గాలించి హంతక ముఠాలను ప్రభుత్వం ఏరివేయలేకపోవడం విచిత్రమైన వ్యవహారం. తమిళనాడు, కర్నాటక వంటి పొరుగు రాష్ట్రాలనుండి ప్రధానంగా ఈ స్మగ్లర్లు దిగుతుండడం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. వీరప్పన్ సహచరుడైన రియాజ్‌ఖాన్‌ను కర్నాటకలో పోలీసులు అరెస్టు చేసిన తరువాత కూడ ఎర్ర గంధం చెట్లను నరికివేయడం ఆగలేదు! అటవీ శాఖ అధికారులపై సిబ్బందిపై మన దేశంలో జరుగుతున్న రీతిలో మరే దేశంలోను దాడులు జరగడం లేదట! వన్యమృగాలు, అడవిదొంగల ముఠాలు జరిపిన దాడులలో గత మూడేళ్లలో డెబ్బయి రెండు మంది అటవీ అధికారులు -రేంజర్లు-హతులు కావడం అడవులకు ఏర్పడిన భౌతిక ప్రమాదానికి చిహ్నం! కానీ దీనికంటే వేయింతలుగా ‘చట్టం ప్రకారం’ ప్రభుత్వపు అండదండలతో అడవులను కబళిస్తున్న వాణిజ్య ప్రమాదం నిరంతరం విస్తరిస్తోంది!! ఐక్యరాజ్యసమితి వారు పశ్చిమ కనుమలలోని పలు ప్రాంతాలలోని అడవులను ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా నిర్ధారించిన తరువాత కనుమలకు సైతం ‘కన్నాలు‘ పడిపోతున్నాయి! కేరళనుంచి మహారాష్ట్ర వరకు సముద్ర తీరంలో సమాంతరంగా విస్తరించి ఉన్న పశ్చిమ కనుమలలోని ‘అధ్యయన బృందాలు’, ‘పరిశోధక బృందాల’ ముసుగులో ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థల’ దళారీలు చొరబడిపోతున్నట్టు గత ఐదేళ్లుగా ఆరోపణలు వినబడుతున్నాయి! ఈ నేపథ్యంలో అంతరిక్షంలోని ఉపగ్రహాలు పంపిన సమాచారం ఆధారంగా ‘ఇఎస్‌ఏ’లను నిర్ధారించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన అభినయం ప్రహసనంగా మారిపోయింది! ఉపగ్రహ సమాచారంపై ఆధారపడి కాక భూమిపై సర్వే చేయడం ద్వార పడమటి కనుమలలోని ఎకోసెన్సిటివ్ ఏరియాలను నిర్ధారించాలన్నది కేంద్ర ప్రభుత్వ విధానం! ప్రభుత్వం నియమించిన నిపుణుల సంఘాలు ఉపగ్రహ సమాచారం ఆధారంగా ఇఎస్‌ఏలను నిర్ధారించాయట! అందువల్ల తమ రాష్ట్ర పరిధిలోని కనుమలను ప్రతి రాష్ట్ర ప్రభుత్వం సర్వే జరపాలన్నది కేంద్ర ప్రభుత్వ విధానమట! కేరళ రాష్ట్రం మాత్రం ఇప్పటికే సర్వే ఆరంభించిందట! గోవా ప్రభుత్వం మరింత గడువును కోరిందట! మహారాష్ట్ర, కర్నాటక ప్రభుత్వాల విధానం ఏమిటో తెలియరాలేదు! పడమటి కనుమల పరిరక్షణపై స్పష్టమైన విధానం రూపొందించడంలో కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ విఫలమైందని, ఈ మంత్రిత్వ శాఖ ఇదివరకే చేసిన రెండు ప్రమాణ పత్రాల ద్వారా స్పష్టమైందట!! అందువల్ల వివరణాత్మక ప్రమాణ పత్రం దాఖలు చేయవలసిందిగా న్యాయమండలి ఆదేశించిందట! న్యాయస్థానాల జోక్యంతోను, ప్రజా ఉద్యమాల ఫలితంగాను అటవీ విధ్వంస కాండ తాత్కాలికంగా నిలిచిపోయినప్పటికీ చివరికి హరిత హనన కారకులదే పైచేయి అవుతుండడం నిరాకరించలేని నిజం! ఒరిస్సాలోని నియాంగిరి అడవులను ‘వేదాంత’ వంటి సంస్థలు తవ్విపారేసి వనవాసులకు నీటిబొట్టు మిగలని పరిస్థితిని సృష్టించారు! మహారాష్టల్రోని పూణె సమీపంలో పడమటి కనుమలను తవ్వేసిన ‘లావాసా’ సంస్థ కూడ నీటి ఊటలు ఎండిపోవడానికి దోహదం చేసింది! కేంద్రీకృత ప్రగతి సాధన విధానం సృష్టిస్తున్న ఈ వైపరీత్యం తొలగడానికి ప్రపంచీకరణ శక్తుల ప్రభావంనుండి ప్రభుత్వ విధానాలు విముక్తం కావడం అనివార్యం! కోట్లాది మొక్కలు నాటుతున్నట్టు ప్రకటిస్తున్న ప్రభుత్వాలు మరోవైపు పచ్చటి పొలాలను పరిశ్రమల కోరలకు బలి చేస్తున్నాయి!!

మరింత సమాచారం తెలుసుకోండి: