ఎన్టీఆర్ కు భారతరత్న వ్యవహారం గురించి తాడో పేడో తేలిపోయే సందర్భం రానే వచ్చినట్టుంది. చాన్నాళ్ల నుంచి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఈ విషయంలో డిమాండ్ వినిపిస్తున్న విషయం తెలిసిందే. ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలోకి వెళ్లినప్పటి నుంచి ఈ డిమాండ్ చాలా గట్టిగా వినిపిస్తోంది. గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ ఎన్టీఆర్ కు భారతరత్న అనే డిమాండ్ వినిపించలేదు. అసలుకు అప్పట్లో ఎన్టీఆర్ పేరే పెద్దగా వినిపించేది కాదన్నవిషయం తెలిసిందే. అయితే అధికారం కోల్పోయాకా బాబు ఆధ్వర్యంలోని తెలుగుదేశం వాళ్లు ఎన్టీఆర్ స్మరణ మొదలు పెట్టారు. అవసరం వచ్చినప్పుడల్లా ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలనే వాయిస్ వినిపించ సాగారు. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ వాళ్లు ఈ డిమాండ్ ను పట్టించుకోలేదు. మీరు అధికారంలో ఉన్నప్పుడు, మీ మిత్రపక్షం బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ మీకు గుర్తుకు రాలేదా? అని కాంగ్రెస్ వైపు నుంచి ఎదురుదాడి జరిగేది. అయితే ఈ ఎదురుదాడికి తెలుగుదేశం పార్టీ సమాధానం ఇవ్వలేకపోయేది. మరి ఎలాగైతేనేం ఇప్పుడు రాష్ట్రంలో అధికారం తెలుగుదేశం చేతుల్లోకివచ్చింది. కేంద్రంలో అధికారం బీజేపీ చేతిలో ఉంది. తాజాగా పద్మ పురస్కారాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఆహ్వానాలను కోరింది. ఇటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రముఖులకు పద్మ పురస్కారాలకు సంబంధించి ఒక జాబితాను రాష్ట్ర ప్రభుత్వం పంపించింది. ఆ జాబితాతో పాటు... ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని కూడా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్టు తెలుస్తోంది. మరి ఇప్పుడు ఎన్టీఆర్ కు భారతరత్న పురస్కారం ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది కేంద్రప్రభుత్వం చేతిలోని వ్యవహారంగా కనిపిస్తోంది. మరేం జరుగుతుందో!

మరింత సమాచారం తెలుసుకోండి: