ఆంధ్రప్రదేశ్‌కి ఆర్థిక సహాయంపై ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కేంద్రానికి విజ్ఞప్తి చేసి వచ్చారు. ప్రధానితో భేటీ అయినా, కేంద్రంలోని పలువురు మంత్రులతో భేటీ అయినా, చంద్రబాబు మంతనాలు జరిపినా.. ఆ చర్చలు మాత్రం సత్ఫలితాలు ఇస్తున్న దాఖలాల్లేవు. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ కొత్త రాజధాని నిర్మాణం కోసం కేంద్రం సహకరిస్తామని గతంలో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ఎక్కడో తేలిందిగానీ, కేంద్రం ఇవ్వబోయే నిధుల వ్యవహారంపై స్పష్టత రాకపోవ డం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా, ఉత్త రాంధ్ర , రాయలసీమ ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ వంటివి కీలకమైనవి. వీటిల్లో ఏ ఒక్కదానిపైనా కేంద్రం సీరియస్‌గా తీసుకోవడం లేదు. .విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కి తగిన సహాయం అందిస్తామని కేంద్రం చెబుతున్నప్పటికీ విభజన చట్టంలో ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ వ్యవహారాలపై అప్పటి మన్మోహన్‌ సర్కార్‌ స్పష్టత ఇవ్వలేదు. రాజ్యసభలో మాత్రం ప్రధాని మన్మోహన్‌ ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ గురించి మాత్ర మే ప్రస్తావించడం జరిగింది. చట్ట సభల్లో మాట్లాడినదానికీ, చట్ట సభలు ఆమోదించిన బిల్లుకీ తేడాలున్నాయి. అదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కి శాపంలా మారేలా కన్పిస్తోంది. తాజాగా 14వ ఆర్థిక సంఘం ప్రతినిథులతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌కి దక్కాల్సిన ఆర్థిక సహాయంపై ప్రతినిథులకు విజ్ఞప్తి చేశారు. స్వయంగా ప్రధానిని కలిసి విజ్ఞప్తి చేస్తేనే కేంద్రం నుంచి చిల్లిగవ్వ ఆంధ్రప్రదేశ్‌కి రానప్పుడు, ఆర్థిక సంఘం ప్రతినిథులు మాత్రం ఏం చేయగలరనే ప్రశ్న ఉదయిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ నుంచి కేంద్ర క్యాబినెట్‌లో ఇద్దరు వ్యక్తులు కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఒకరేమో బీజేపీ సీనియర్‌ నేత వెంకయ్యనాయుడు కాగా, మరొకరు టీడీపీ సీనియర్‌ నేత అశోక్‌ గజపతిరాజు. కేంద్ర మంత్రులుగా ఈ ఇద్దరూ తమ రాష్ట్రం బాగు కోసం ప్రయత్నించడంలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ విమర్శలకు తగ్గట్టుగానే ఇదిగో చేస్తాం, అదిగో చేస్తాం అనే కాలయాపనతోనే కేంద్ర మంత్రులిరువురూ సరిపెడుతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు స్మార్ట్‌ సిటీలు, మెగా సిటీలు ఇలా పలు పేర్లు చెబుతున్నారు. కానీ కేంద్రం నుంచి ఇవి రాబట్టాం.. అని వంద రోజుల పాలన గురించి గట్టిగా చెప్పుకోలేని దుస్థితి వుంది. ఇదిలా వుండగా కొత్తగా ఆవిర్భవించిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి సంబంధించి అందాల్సిన సాయంపై రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడిపెరుగుతూ వస్తోంది. పలువురు మంత్రులు కూడా ఇందుకు సంబంధించి అసహనం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం వద్ద తాడోపేడో తే ల్చుకోవాలని పలువు రు మంత్రులు ముఖ్యమంత్రిపై వత్తిడి తె స్తున్నారు.భారత రాష్టప్రతికి, ప్రధాన మంత్రికి పలుమార్లు వినతిపత్రాలు సమర్పించినా ఇంతవరకు ఆంధ్రప్రదేశ్‌ కు ఎలాంటి ఆర్థిక సహాయం ప్రకటించకపోవడం పట్ల పాలకపక్షం నిరసన వ్యక్తం చేస్తున్నది. ఈ సందర్భంగా సీనియర్‌ మంత్రి ఒకరు మాట్లాడుతూ రాష్ట్రాన్ని అకారణంగా విభజించి, అనంతరం రాజ్యాంగం ప్రకారం రావాల్సిన హక్కుల విషయంలో కేంద్రం తాత్సారం చేస్తోందని విమర్శించారు. మోడి ప్రభుత్వంలో తమకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని, లేనట్లయితే నిరసన తెలపాల్సిందేననే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: