టెక్నాలజీ దిగ్గజం యాపిల్ తాజాగా ఆవిష్కరించిన ఐఫోన్ 6 స్మార్ట్‌ఫోన్లు.. ఆన్‌లైన్లో హల్‌చల్ చేస్తున్నాయి. అమెరికా తదితర దేశాలతో పోలిస్తే భారత్‌లో వీటి రాక కాస్త ఆలస్యం కానున్న నేపథ్యంలో ఈ ఫోన్లను దక్కించుకునేందుకు యాపిల్ అభిమానులు భారీ మొత్తం వెచ్చించేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో ఈ-బే వంటి ఆన్‌లైన్ స్టోర్స్‌లో 5.5 అంగుళాల ఐఫోన్ 6 ప్లస్ (16 జీబీ) అన్‌లాక్డ్ మోడల్ ఏకంగా రూ. 1.1 లక్ష పైచిలుకు పలుకుతోంది. ఇక 4.7 అంగుళాల ఐఫోన్ 6 (16 జీబీ) దాదాపు రూ. 75,000 పైగా పలుకుతోంది. ఈ ఫోన్ అమెరికా తదితర దేశాల్లో ఈ నెల 19న మార్కెట్లోకి రానుండగా.. అక్టోబర్ 17న భారత మార్కెట్లో అధికారికంగా రానున్నాయి. అయితే, ఈలోగానే ఆస్ట్రేలియా, సింగపూర్ వంటి దేశాల నుంచి ఈ హ్యాండ్‌సెట్స్‌ని కొనుగోలు చేసి సెప్టెంబర్‌లోనే అందిస్తామని హామీలు ఇస్తున్నారు ఆన్‌లైన్ విక్రేతలు. నిర్దిష్టంగా భారత్‌లో రేటును నిర్ణయించనప్పటికీ.. ఐఫోన్ 6 (16జీబీ) మోడల్ రేటు రూ. 48,000-50,000 మధ్యలో, ఐఫోన్ 6 ప్లస్ (16జీబీ) మోడల్ ధర సుమారు రూ. 58,000-60,000 మేర ఉండొచ్చని అంచనా. 64 జీబీ, 128 జీబీ మోడల్స్ ధరలు మరింత ఎక్కువగా ఉంటాయి. అయితే, దేశీయంగా కోల్‌కతా, న్యూఢిల్లీ వంటి ప్రాంతాల్లోని బ్లాక్‌మార్కెట్లలో వీటిని రూ. 5,000-10,000 ప్రీమియంతో ముందస్తుగా విక్రయిస్తున్నారు. ఈ నెలలోనే అందిస్తామన్న హామీతో ముంబైలోని కొన్ని మార్కెట్లలో 16జీబీ ఐఫోన్ 6ని దాదాపు రూ. 80,000-85,000 రేటుతో అమ్ముతున్నారు డీలర్లు.

మరింత సమాచారం తెలుసుకోండి: