రాజకీయాల్లో శాశ్వత మిత్రలు.. శాశ్వత శత్రువులు ఉండంటారు. ఆ మాటను బీజేపీ నేత పురంధేశ్వరి మరోసారి రుజువు చేయబోతున్నారా.. ఆమె స్వల్పకాలంలోనే మరోసారి పార్టీ మారబోతున్నారా.. శత్రువుగా భావించే మరిదితోనే మళ్లీ చేతులు కలపబోతున్నారా.. ఈ ప్రశ్నలకు సమాధానం అవును అనే వినిపిస్తోంది. ఆమె త్వరలో తెలుగుదేశంలో చేరవచ్చని సంకేతాలు వెలువడుతున్నాయి. ఆ మాట ఆమే స్వయంగా చెప్పారు. అమెరికా పర్యటనలో ఉన్న పురంధేశ్వరి దంపతులు.. అక్కడ ఎన్ఆర్ఐ లు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా తెలుగుదేశంలోకి వచ్చేందుకు తాము సానుకూలమేనని చెప్పారు. ఎన్టీఆర్ సంతానంలో దగ్గుబాటి పురంధేశ్వరికి ప్రత్యేకత ఉంది. అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చినా.. ఆమె స్వల్పకాలంలోనే తన సమర్థత నిరూపించుకున్నారు. తండ్రి జీవితాంతం వ్యతిరేకించిన పార్టీలో చేరినా.. తండ్రి ఆశయసాధన కోసమే ఇందంతా అని చెప్పుకొచ్చారు. ఎంపీగా ఎన్నికైన తొలిసారే మన్మోహన్ సింగ్ కేబినెట్లో స్థానం సంపాదించుకున్నారు. అప్పగించిన బాధ్యతలు సమర్థంగా నిర్వహిస్తారని పేరు తెచ్చుకున్నారు. భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు చంద్రబాబుతో ఉన్న విభేదాల దృష్ట్యా.. ఆమె, చంద్రబాబు ఎప్పుడూ ఉప్పు-నిప్పులాగానే ఉంటూ వచ్చారు. కుటంబ వేడుకలకు సైతం ఒకరొస్తే ఇంకొకరు డుమ్మా కొట్టేస్థితికి చేరుకున్నారు. రాష్ట్ర విభజన..పురంధేశ్వరి రాజకీయ జీవితంలో పెను మార్పు తీసుకొచ్చింది. రాజకీయంగా జీవితం ఇచ్చిన కాంగ్రెస్ ను సైతం వదిలేయాల్సి వచ్చింది. బీజేపీలో చేరి మంచి నిర్ణయమే తీసుకున్నా.. కాలం కలసిరాలేదు. దేశమంతటా.. రాష్ట్రంలోనూ బీజేపీ ప్రభంజనం కనిపించినా ఆమె మాత్రం ఎంపీగా గెలవలేకపోయారు. రాజంపేటలో ఆమె పరాజయానికి తెదేపా శ్రేణుల సహాయనిరాకరణ కూడా ఓ కారణమేనని విశ్లేషకులు అంచనా వేశారు. పరాజయం తర్వాత పెద్దగా వార్తల్లో కనిపించని పురంధేశ్వరి.. తాజా ప్రకటన ద్వారా మరోసారి అందరి దృష్టినీ ఆకర్షించారు. గతం గత: అనుకుని.. విభేదాలు పక్కకుపెట్టి టీడీపీలో చేరితే నందమూరి అభిమానులకు పండుగే.

మరింత సమాచారం తెలుసుకోండి: