చెడు వినవద్దు.. చెడు అనవద్దు.. చెడు చేయవద్దు.. ఇవీ మహాత్ముడి శాంతి వచనాలు.. కానీ వీటిని పట్టించుకునే ఓపిక కంత్రీగాళ్లకు ఎందుకుంటుంది. అందుకునేమో హైదరాబాద్ లో కబ్జారాయుళ్లు ఏకంగా మహాత్ముడి స్థలంపైనే కన్నేశారు. గోల్కొండ కోటకు వెళ్లే దారిలో మూసీ నది ఒడ్డున ఉన్న బాపూ ఘాట్ లో దాదాపు 4వేల చదరపు గజాల స్థలాన్ని భూబకాసురులు కబ్జా చేసేశారు. మహాత్ముడి స్మారకంగా బాపు ఘాట్ నిర్మాణానికి గతంలో ప్రభుత్వం స్థలం కేటాయించింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని దాదాపు 68 ఎకరాల భూమిని కేటాయించింది. ఆ స్థలంలో బాపు ఘాట్ నిర్మించారు. 2002 సమయంలో బాపుఘాట్ అభివృద్ధి వేగంగా జరిగింది. ఆనాటి గవర్నర్ కృష్ణకాంత్ దీని అభివృద్దిపై ప్ర్తత్యేకంగా దృష్టిసారించారు. ధ్యాన మందిరం, కాలినడకదారి, గార్డెన్ కూడా నిర్మించాలని అనుకున్నారు. మహాత్ముడు వాడిన వస్తువులతో ఓ మ్యూజియం కూడా నిర్మించాలని నిర్ణయించారు. ఆ తర్వాత ప్రభుత్వం పెద్దగా పట్టించుకోకపోవడంతో ఆ కార్యక్రమాలు ఆగిపోయారు. ఇదే అదనుగా కబ్జారాయుళ్లు రెచ్చిపోయారు. అనుకూలంగా అన్న ప్రాంతాలను ఆక్రమించేశారు. తమదేనంటూ బోర్డులు పెట్టేశారు. ఇంకొందరు అమ్మకాలకూ ప్లాన్ చేశారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం భూములపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి.. లెక్కలు తీయించడంతో ఈ కబ్జాల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఏకంగా 68 ఎకరాల భూమి ఉండటంతో.. హైదరాబాద్ లో గజం భూమి కూడా విలువైంది కావడంతో.. వాస్తవ నివేదిక ఇవ్వాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. అధికారులు జరిపిన పరిశీలనలో కబ్జాలు నిజమేనని రుజువైంది. మొత్తం 4వేల చదరపు గజాలు ఆక్రమణకు గురయ్యాయని అధికారులు చెబుతున్నారు. ఏకంగా కేసీఆరే ఆదేశించడంతో.. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల కలెక్టర్లు స్వయంగా బాపుఘాట్ ను పరిశీలించారు. మొత్తం స్థలాన్ని సర్వే చేయిస్తామని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: