అసెంబ్లీ సమావేశాలలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజధానిపై ప్రకటన చేస్తూ రాష్ర్టంలోని 13జిల్లాలకు జిల్లాల వారీగా కొన్నేసి వరాలు కురిపించాడు. తాను సీఎం అయ్యింది మొదలు నెల్లూరుజిల్లాను చిన్నచూపు చూస్తున్న చంద్రబాబు ఈ వరాల విషయంలో కూడా అదే దృష్టితో వెళ్లాడు. నెల్లూరుజిల్లాకు ఆయన ఇచ్చిన కొన్ని హామీలను చూస్తే నవ్వాలో, ఏడవాలో కూడా అర్థం కాదు. జిల్లాలో దుగరాజపట్నం పోర్టును ప్రస్తావించారు. ఈ పోర్టు గత యూపిఏ ప్రభుత్వంలోనే మంజూరై గెజిట్ నోట్ కూడా వెలువడింది. అదీ కాకుండా ఇది కేంద్రప్రభుత్వ నిధులతో నిర్మించే పోర్టు. దీంట్లో చంద్రబాబు ఘనతేముంది. అంతేకాదు, చంద్రబాబు సీఎం అయ్యాక ఈ పోర్టు వస్తుందో రాదో అన్నట్లుగా పరిస్థితులొచ్చాయి. రాష్ర్ట ప్రభుత్వ నిర్వాకం మూలంగానే ఈ పోర్టు రాకుండా పోయే అవకాశాలు ఎక్కువయ్యాయి. కావలి దగ్గర ఎయిర్ పోర్టు అన్నారు.  గత కాంగ్రెస్ ప్రభుత్వంలోనే జిల్లాలో ఎయిర్ పోర్టు మంజూరైంది. దామవరం వద్ద దీనికి భూసేకరణ కూడా జరిగింది. జిల్లాలో ఎయిర్ పోర్టు కొత్తగా ఇచ్చిందేమీ కాదు. స్వర్గీయ మాజీప్రధాని పి.వి.నరసింహారావు హయాంలోనే రాచర్లపాడు వద్ద ఇఫ్కో ఫ్యాక్టరీ మంజూరైంది. కాని కొన్ని అవాంతరాల వల్ల అది నెరవేరలేదు. దివంగత నేత వై.యస్. హయాంలో ఇఫ్కో ఫ్యాక్టరీకి సేకరించిన భూముల్లోనే కిసాన్ సెజ్ ను ఏర్పాటు చేశారు. కాని ఈ సెజ్ లో ఒక్క వ్యవసాయ సంబంధిత పరిశ్రమ ఏర్పాటు కాలేదు. ఇఫ్కో భూములు అలాగే ఖాళీగా వున్నాయి. ఇఫ్కో ఎరువుల కర్మాగారం జిల్లాకు దశాబ్దాల కలగానే మిగిలిపోతుంది. చంద్రబాబు వాగ్ధానాల్లో ఆటోమొబైల్ హబ్ ఒకటి. వైయస్ హయాంలోనే తడ సమీపంలో శ్రీసిటీ సెజ్ రూపుదిద్దుకుంది. ఇప్పటికే ఎన్నో ఆటోమొబైల్ కంపెనీలు అక్కడ వెలిసాయి. ఇక కొత్తగా ఆటోమొబైల్ హబ్ ఏముంటుందో.  చెన్నై – వైజాగ్ పారిశ్రామిక కారిడార్ లో ఎలాగూ నెల్లూరు ఉండాల్సిందే. దానిని ప్రత్యేకంగా చేర్చేదేమీ వుండదు. హోటల్ మేనేజ్ మెంట్ కేంద్రం గత ప్రభుత్వంలోనే మంజూరై నిర్మాణంలో ఉంది. పులికాట్ ను పర్యాటక కేంద్రంగా మార్చే అంశం చంద్రబాబు గతంలో సీఎంగా వున్నప్పటి నుండి నానుతున్నదే. గత కాంగ్రెస్ ప్రభుత్వం పులికాట్ గురించి పెద్దగా పట్టించుకోలేదు. రాష్ర్టంలో 10స్మార్ట్ సిటీలలో నెల్లూరొకటి. రాష్ర్టంలో వైజాగ్, విజయవాడల తర్వాత అందరూ ఇష్టపడే నగరం నెల్లూరు. దీనిని స్మార్ట్ సిటీల జాబితా నుండి తప్పించలేరు. చంద్రబాబు జిల్లాకు ఇచ్చిన వరాలు చాలావరకు పాతవే. అయితే వాటిలో ఇంకా మొదలుపెట్టనివి, మధ్యలో ఉన్నవి పూర్తి చేస్తే జిల్లాపై చంద్రబాబు పగ పట్టి వున్నాడన్న ప్రచారాన్ని కొంతవరకు అడ్డుకోగలరు.

మరింత సమాచారం తెలుసుకోండి: