ఒకనాడు భారత క్రికెట్ జట్టు కెప్టెన్ గా జాతి నీరాజనాలు అందుకొన్న మహ్మద్ అజారుద్దీన్ ఇప్పుడు తన తీరుతో అనేక రకాల అవమానాలు ఎదుర్కొంటున్నాడు. మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతంతోనే అజర్ పరువు సగం పోగా... రాజకీయాల్లోకి మిగిలిన బ్యాలెన్స్ పరువను పొగొట్టుకొంటున్నాడు. 2009 ఎన్నికల్లో అజర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి, ఎంపీగా గెలిచిన విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్ లోని ఒక నియోజకవర్గం నుంచి అజర్ ఎంపీగా గెలిచాడు. అయితే రెండో టర్మ్ లోమాత్రం అజర్ గెలవలేకపోయాడు. బెంగాల్ లోని ఒక నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసిన అజర్ ఓటమి పాలయ్యాడు. మరి మాజీ ఎంపీ అయిపోయాడు కాబట్టి... అజర్ ఢిల్లీలోని అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే మాజీ అయ్యి ఇప్పటికే నాలుగు నెలలు పూర్తి అయినా అజర్ మాత్రం ఇప్పటికీ అదే ఇంటిని అట్టిపెట్టుకొన్నాడు. అధికారిక నివాసాన్ని ఆక్రమించుకొనే ఉన్నాడు. ఇటువంటి నేపథ్యంలో ఆయనను ఇళ్లు ఖాళీ చేయించడానికి అధికారులు రంగంలోకి దిగారు. ఇంటికి కరెంటు, వాటర్ కట్ చేశారు! కేవలం అజర్ ఇంటికి మాత్రమే కాదు.. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలై ఇప్పటికీ ఇళ్లను ఖాళీ చేయని అనేక మంది నేతలకు అధికారులు ఇలాంటి పొగనే పెడుతున్నారు. మర్యాదగా నోటీసులు జారీ చేసి, ఇళ్లను ఖాళీ చేయమని అడిగితే స్పందించని నేతలను ఇలాంటి ట్రీట్ మెంట్ ద్వారా ఇళ్లను ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. కేంద్ర మాజీ మంత్రి అజిత్ సింగ్, మాజీ ఎంపీలు జితేంద్ర సింగ్, అజారుద్ధీన్ సహా మొత్తం 30 మంది ఎంపీల ఇళ్లకు వాటర్ , కరెంట్ ను కట్ చేసినట్టు అధికారులు తెలిపారు. కొత్తగా ఎన్నికైన ఎంపీలకు ఇళ్లను కేటాయించాల్సి ఉందని.. వీళ్లు ఖాళీ చేయకపోవడంతో కొత్త వాళ్లకు ఇళ్లను కేటాయించే అవకాశం లేకుండా పోతోందని.. అందుకే ఇలాంటి పనిచేస్తున్నట్టుగా వారు వివరించారు. మరి ఇప్పటికైనా ఈ మాజీ ఎంపీలకు బుద్ధి వస్తుందా?!

మరింత సమాచారం తెలుసుకోండి: