పోలీసు శాఖలో రాష్టవ్య్రాప్తంగా ఖాళీలను భర్తీ చేసేందుకు త్వరలో పోలీసు కానిస్టేబుళ్ల నియామకం చేపట్టనున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. జిల్లా, డివిజన్ కేంద్రాల్లో మహిళా పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేస్తామన్నారు. ఆదివారం ఒంగోలులో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రం విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టుల ప్రాబల్యం తగ్గిందన్నారు. మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని మంత్రి పిలుపునిచ్చారు. ఇటీవల విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల సరిహద్దుల్లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయే తప్ప అంతకుమించి రాష్ట్రంలో ఎలాంటి సంఘటనలు చోటుచేసుకోలేదన్నారు. మావోయిస్టులు తమ ఉనికిని కాపాడుకునేందుకే ఈ చర్యలకు పాల్పడ్డారన్నారు. మావోయిస్టుల కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. శాంతిభద్రతలను కాపాడటంలో, మహిళలకు రక్షణ కల్పించడంలో త్వరలో పకడ్బందీగా చట్టాలను అమలులోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. త్వరలో రాష్టవ్య్రాప్తంగా కానిస్టేబుళ్ల దగ్గర నుండి డిఐజి వరకు బదిలీలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. పోలీసు సిబ్బందికి విధి నిర్వహణ సమయం తగ్గించడానికి త్వరలో పోలీసు శాఖలో ఖాళీలు పూర్తిస్థాయిలో భర్తీచేసి వాహనాల సంఖ్యను పెంచుతామని వెల్లడించారు. రాష్ట్రంలో జాతీయ రహదారిపై ఉన్న మద్యం షాపులు తొలగించేందుకు పరిశీలన చేస్తున్నట్లు వెల్లడించారు. కోస్తాతీర ప్రాంతాల్లో ఇప్పటికే మెరైన్ పోలీసుస్టేషన్లను ఏర్పాటు చేశామని తెలిపారు. మరికొన్ని ప్రాంతాల్లో మెరైన్ పోలీసుస్టేషన్లను ఏర్పాటుచేసి నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేయనున్నట్లు తెలిపారు. శ్రీలంక దేశం నుండి సముద్ర తీరప్రాంతం ద్వారా జిల్లాకేంద్రమైన ఒంగోలుకు శ్రీలంక వాసులు వస్తున్నారని, ఇప్పటికే వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని విలేఖర్లు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో నూతనంగా విధుల్లో చేరిన ఎస్‌ఐలపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయని విలేఖర్లు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం దాటవేశారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో పోలీసు బెటాలియన్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పోలీసుల సంక్షేమం కోసం ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఇదిలావుండగా ఎన్నికల హామీల్లో భాగంగా కాపులను బిసి జాబితాలో చేరుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారని, ఆ హామీ అమలుకు త్వరలో కమిషన్ వేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే బిసిల సంక్షేమం కోసం సంవత్సరానికి వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించినట్లు రాష్ట్ర హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: