అసెంబ్లీలోకి అడుగుపెట్టి ఒక్కసారైనా అధ్యక్షా.. అనాలని.. రాజకీయ నేతగా మారిన వారెవరికైనా ఉంటుంది. అది రాజకీయాల్లో కనీస లక్ష్యం కూడా. ఎమ్మెల్యేనో, ఎమ్మెల్సీలోనో అయ్యాక.. ఆపై దక్కే పదవులు బోనస్ అన్నమాట. కానీ ప్రస్తుత ఎన్నికల వ్యవహారం చూస్తే.. ఎమ్మెల్యేగా ఎన్నికవ్వాలన్నా.. కోట్ల రూపాయలు కుమ్మరించాల్సిన పరిస్థితి. ఇంతా చేసినా గెలుస్తామో లేదో అన్న అనిశ్చితి. మరికొందరు విపరీతమైన మేథావులైనా.. మాస్ ఇమేజ్ ఉండదు. ఎన్నికల రణంలో గెలవలేరు. ఇలాంటి వారి కోసం సృష్టించిందే శాసన మండలి. ఇప్పుడు శాసన మండలి సభ్యుల పెంచాలన్న ప్రతిపాదనలు రావడంతో టీడీపీ నేతల్లో చాలామంది మండలి సీటుపై కన్నేశారు. నవంబర్ నెలలో మండలిసీట్ల సంఖ్య పెంపు ప్రతిపాదనకు పార్లమెంట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ప్రస్తుతం మండలి సభ్యుల సంఖ్య 53. వచ్చే ఏడాది మార్చినాటికి పెరిగే సీట్లతో కలుపుకుని 21 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. అందుకే ఆ సీట్ల కోసం టీడీపీ నేతలు ఇప్పటి నుంచే లాబీయింగ్ మొదలుపెట్టారు. చంద్రబాబు నుంచి మాట దక్కించుకునేందుకు పోటీ పడుతున్నారు. ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాగా కష్టపడి.. అధికారం అందే నాటికి ఎన్నికల్లో దురదృష్టవశాత్తూ ఓడిపోయిన నేతలు.. ఎలాగైనా మండలి టికెట్ దక్కించుకోవాలని పట్టుదల గా ఉన్నారు. తెదేపా సీనియర్ నేతలు గాలి ముద్దుకృష్ణమనాయుడు, పయ్యావుల కేశవ్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వంటి వారు గత పదేళ్లలో పార్టీకోసం బాగా పనిచేసినా గత ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. వీరికి ఎమ్మెల్సీ సీటు తప్పకుండా లభిస్తుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. పోటీ చేసి ఓడిపోయిన వారే కాకుండా.. వివిధ సమీకరణాల రీత్యా అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ సంపాదించలేకపోయిన నేతలకూ ఎమ్మెల్సీ అవకాశాలు పరిశీలిస్తారు. అంతే కాకుండా.. చాలా సందర్భాల్లో పార్టీ కోసం తెరవెనుక ఎంతో కష్టపడినా ఫలితం దక్కని నేతలకు ఎమ్మెల్సీ స్థానం ఊరటకలిగించబోతోంది. వీరితో పాటు మొత్తం 21 సీట్లలో బీజేపీ నేతలకూ ఒకటో రెండో కేటాయించాలని చంద్రబాబు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: