గీతలో-రాతలో-తీతలో తెలుగుదనాన్ని ఆవిష్కరించిన మహానుభావుడు బాపును పద్మవిభూషణ్ వరించే అవకాశాలున్నాయి. చిత్రకళ, సినిమా రంగాల్లో బహుముఖ ప్రజ్ఞతో ఆంధ్రులను అలరించిన ఆ కళాకారుడికి ఇప్పటికే పద్మవిభూషణ్ రావాల్సి ఉండగా.. గతంలో పద్మశ్రీ పురస్కారం మాత్రమే అందించారు. అది కూడా తెలుగు ప్రభుత్వం నుంచి కాకుండా తమిళనాడు ప్రభుత్వ సిఫారసుతో వచ్చింది. పద్మశ్రీ పురస్కారాల ఎంపికలో రాజకీయ నేతల జోక్యం సంగతి తెలిసిందే అయినా.. బాపు వంటి కళాకారులను ప్రోత్సహించడంలోనూ గత ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయి. ఇప్పుడా నష్టం పూడ్చుకునే దిశగా టీడీపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రెండు రోజుల క్రితం పద్మపురస్కారాల ఎంపికకు ఎవరి పేర్లు ప్రతిపాదించాలన్న అంశంపై అధికారులు సమావేశం నిర్వహించారు. ఇప్పటికే కొన్ని పేర్లలో జాబితా రూపొందించారు. వీటని ప్రభుత్వం ఖరారు చేయాల్సి ఉంది. ఆ తర్వాత జాబితా కేంద్రానికి చేరుతుంది. రాష్ట్రప్రభుత్వం సిఫారసు చేయనున్నవారిలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఉన్నారు. వీరిలో ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు పేరును పద్మవిభూషణ్ కోసం ప్రతిపాదిస్తున్నట్టు తెలుస్తోంది. పద్మవిభూషణ్ కోసం ఈయనతో పాటు ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డి.నాగేశ్వరరావు, ఆర్జీయూకేటీ కులపతి డాక్టర్ రాజ్ రెడ్డి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. ఇక పద్మభూషణ్ విషయానికి వస్తే.. సినీనటుడు, టీడీపీ ఎంపీ మురళీమోహన్, ఆధ్యాత్మిక ఉపన్యాసకులు చాగంటి కోటేశ్వరరావు, శాస్త్రీయ సంగీత విద్యాంసులు నేదునూరి కృష్ణమూర్తి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. పద్మశ్రీ అవార్డుల కోసం.. నటుడు కోట శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్టు ఐ. వెంకట్రావు, ఈనాడు కార్టూనిస్ట్ శ్రీధర్, కూచిపూడి గురువు పసుమర్తి రత్తయ్య, మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్సి మోహన్ కందా పేర్లు పంపించబోతున్నట్టు తెలుస్తోంది. వీరిలో ఐ.వెంకట్రావు గతంలో ఎన్టీఆర్, చంద్రబాబులపై పుస్తకాలు రాశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: