భూగ్రహంపై ప్రస్తుతం మనం రెండు రకాలైన విపత్తులను ఎదుర్కొంటున్నాం. మొదటిది పర్యావరణ మార్పు కాగా రెండవది జాతులు అంతరించిపోవడం. నేడు మనం చేసే ఉత్పత్తి, వినియోగం మొత్తం పారిశ్రామిక విప్లవ కాలం ప్రారంభం నాటిది. ఇక పారిశ్రామిక వ్యవసాయం ఎప్పుడైతే అమల్లోకి వచ్చిందో ఇది మరింత తీవ్రస్థాయికి చేరుకుంది. ఇప్పటి నుంచే మనం గ్రీన్ హౌజ్ వాయువుల ఉద్గారాలను నియంత్రించకపోతే ఈ శతాబ్దాంతానికి భూమి ఉష్ణోగ్రత 4 డిగ్రీలు పెరగడం ఖాయం. కానీ పర్యావరణ మార్పు అంటే కేవలం భూతాపం మాత్రమే కాదు. కరువు కాటకాలు, వరదలు, తుపానులు ఇతర వాతావరణ పరమైన తీవ్ర స్థాయి సంఘటనలు చోటు చేసుకోవడానికి కేవలం ఈ పర్యావరణ మార్పే కారణం. ప్రస్తుతం జమ్ము-కాశ్మీర్‌లో ఉధృత వరదలు సృష్టిస్తున్న జల విలయానికి ఇప్పటికే 200 మంది ప్రాణాలు కోల్పోయారు. పర్యావరణంలో వస్తున్న మార్పులకు ఈ వరదలు ప్రధాన సంకేతం. పారిశ్రామిక విప్లవం రాకమునుపు వాతావరణంలో గ్రీన్ హౌజ్ వాయువులు 228 పిపిఎం (పార్ట్ పర్ మిలియన్)కు ఎన్నడూ మించలేదు. ప్రస్తుతం వాతావరణంలో కార్బన్ డైయాక్సైడ్ స్థాయ 395 పిపిఎంకు చేరుకున్నది. కార్బన్ డైయాక్సైడ్ వంటి గ్రీన్ హౌజ్ వాయువులైన నైట్రస్ ఆక్సైడ్, మీధేన్ వాయువులు కూడ మరింత ప్రబలమైనవే. ఐక్యరాజ్య సమితి పర్యావరణ సదస్సు ఫ్రేమ్‌వర్క్ (యుఎన్‌ఎఫ్‌సిసి) నివేదిక ప్రకారం నైట్రస్ ఆక్సైడ్..కార్బన్ డైయాక్సైడ్ కంటే భూతాపాన్ని వృద్ధి చేయడంలో 300 రెట్లు అధిక ప్రభావశీలమైనదిగా పేర్కొంది. అదేవిధంగా మీధేన్ ఇరవై రెట్లు అధిక నష్టాన్ని కలుగజేయగలదు.పారిశ్రామిక వ్యవసాయ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత నైట్రస్ ఆక్సైడ్ మరియు మీధేన్ ఉద్గారాలు నాటకీయంగా పెరిగిపోయాయి. వ్యవసాయంలో సింథటిక్ నైట్రోజన్ ఎరువుల వాడకం వల్ల నైట్రస్ ఆక్సైడ్ వాతావరణంలోకి విడుదలవుతుంది. అదేవిధంగా పాడి పరిశ్రమ, మాంసం మరియు గుడ్లు ఉత్పత్తి చేసే సంస్థల ద్వారా ఉత్పత్తి అయిన మీధేన్ వాతావరణంలో కలిసిపోతుంది. 1995లో ఐక్యరాజ్య సమితికి చెందిన ‘‘లైపిజిగ్’’ సదస్సును నిర్వహించడం జరిగింది. ప్రపంచంలోని జీవ వైవిధ్యంలో 70 శాతం వరకు అదృశ్యమై పోవడానికి కారణం హరిత విప్లవం ద్వారా చేపట్టిన వ్యవసాయ విధానాలు మరియు పారిశ్రామిక వ్యవసాయం మాత్రమేనని ఈ సదస్సు తేల్చింది. పారిశ్రామిక వ్యవసాయం వల్ల కలిగిన మరో ముప్పు ఏమంటే..పరాగ సంపర్కానికి దోహదం చేసే జీవులు, నేల సారాన్ని వృద్ధి చేయడానికి ఉపయోగపడే జీవులు అదృశ్యమై పోవడం. ఫలితంగా జీవవైవిధ్యం దారుణంగా దెబ్బతినింది. జీవవైవిధ్య విధ్వంసానికి ఇది మరో కోణం. వాతావరణంలో మార్పులు, వ్యవసాయం, జీవవైవిధ్యం అనే అంశాలు పరస్పరం ఒకదానితో మరొకటి ముడిపడి ఉన్నాయ. హరిత విప్లవం రాకముందు వివిధ పంటలను పండించడం వల్ల జీవవైవిధ్యం పరిరక్షించబడేది. కానీ హరిత విప్లవం పుణ్యమాని కేవలం ఒకే పంటను పండించడం, రసాయన ఎరువులను తీవ్రస్థాయిలో వినియోగించడం మొదలైంది. తత్ఫలితంగా వివిధ జీవుల ఆవాసాలు దెబ్బతిన్నాయి. ఈ విధంగా ఆవాసాలు దెబ్బతినడంతో ఆయా జీవులు అంతరించిపోవడం మొదలై జీవవైవిధ్యం కూడా అదృశ్యం కావడం ప్రారంభమైంది. దీని ఫలితంగా గ్రీన్ హౌజ్ వాయువులు వేరుపడి వాతావరణంలోకి క్రమంగా విడుదల కావడం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. రసాయన ఎరువుల వాడకం, ఒకే పంటపై దృష్టి కేంద్రీకరించడం వంటివి వాతావరణ అస్థిరతకు దోహదకారులు. ఈవిధంగా మనం ఆహారంపై ఆధారపడే ఒక వ్యవస్థ పూర్తిగా దెబ్బతినిపోతున్నది. అంటే ప్రస్తుతం వాతావరణం స్థిరత్వాన్ని కోల్పోవడం వల్ల...ఈ వ్యవస్థపై ఆహారం కోసం మనం ఆధారపడలేని దుస్థితి ఏర్పడుతోంది. అస్థిర వాతావరణంలో ఎప్పటికప్పుడు మనం అంచనా వేయలేని రీతిలో కలిగే మార్పులను తట్టుకోవాలంటే మళ్లీ మనం ప్రతి స్థాయిలో జీవవైవిధ్యాన్ని కాపాడుకునే దిశగా కృషి చేయాల్సిందే. అయితే వాతావరణ మార్పులకు అనుగుణంగా మార్పులు చెందే స్థితిస్థాపక లక్షణం జీవవైవిధ్యానికి లేదు. కేవలం పోషక విలువల పరంగా ఒక ఎకరంలో ఎంత పెద్ద మొత్తంలో ఉత్పత్తిని సాధించవచ్చు అనేదానికి మాత్రమే జీవవైవిధ్యానికి సంబంధం ఉంటుంది. అయితే వావరణం మరియు జీవవైవిధ్య సంక్షోభం గురించి మానవాళికి తెలియంది కాదు. కాకపోతే దీన్ని అరికట్టడానికి ఏవిధమైన చర్యలు తీసుకోలేదంతే! 1992లో రియో డిజెనరోలో జరిగిన ధరిత్రీ సదస్సులో, అంతర్జాతీయ సమాజం మొత్తం రెండు చట్టబద్ధమైన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. అవి వరుసగా యుఎన్‌ఎఫ్‌సిసి మరియు ఐక్యరాజ్య సమితి జీవవైవిద్య పరిరక్షణా సదస్సు. ఇప్పుడిప్పుడే ఉద్గమిస్తున్న జీవావరణ శాస్త్రాలు మరియు పర్యావరణ ఉద్యమాల నేపథ్యంలో ఈ రెండు ఒప్పందాలు కుదరడం గమనార్హం. వీటిల్లో ఒకటి శిలాజ ఇంధనాలను విపరీతంగా వాడటం వల్ల కలిగే శాస్ర్తియ పరమైన కాలుష్య ప్రభావం కాగా రెండవది, పరిశ్రమలు, రసాయన మోనో కల్చర్లతో పాటు జన్యు పరివర్తిత జీవుల (జీఎంఓ) వల్ల విస్తరించే కాలుష్యం. జీవవైవిధ్య పరిరక్షణకు సంబంధించిన 19.3 అధికరణం, పరివర్తిత జీవుల (ఎల్‌ఎంఓ) వినియోగం మరియు సురక్షిత విధానంలో బదలాయింపులకు అవసరమైన విధి విధానాల రూపకల్పన అవసరాన్ని నొక్కి చెబుతున్నది. ముఖ్యంగా జీవ సాంకేతిక పరిజ్ఞానం వల్ల కలిగిన ప్రతికూల ప్రభావం జీవ వైవిధ్యంపై పడుతోంది. ఈ నేపథ్యంలోనే జీవ వైవిధ్య పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యతనివ్వడం జరుగుతోంది. ఫలితంగానే జీవవైవిధ్య ప్రొటొకాల్‌ను అమలు జరపడానికి ప్రపంచ దేశాలు నడుం బిగించాయి. వాతావరణం, ప్రజారోగ్యం, సామాజిక-ఆర్థిక పరిస్థితులు, వ్యవసాయానికి సంబంధించిన సామాజిక మరియు వాతావరణ సుస్థిరతకు , ఆహార వ్యవస్థలకు బీమా సౌకర్యం కల్పించడం వంటివాటిపై జిఎంవోల ప్రభావాన్ని జీవపరిరక్షణ శాస్ర్తియంగా అంచనా వేస్తుంది. జీవవైవిధ్య వ్యవస్థల పరిరక్షణకు, ఆరోగ్యం, పోషకాహార విలువలను పెంపొందించడం వంటివి వ్యవసాయ పర్యావరణ ఆధారిత వ్యవస్థల వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. అంతేకాదు ఆహార భద్రతను మరింతగా పెంచి, వాతావరణాన్ని మరింతగా కాపాడటానికి వీలు కలుగుతుంది. కానీ 1992 నుంచి, శిలాజ ఇంధనాల పరిశ్రమ, వ్యవసాయ పరిశ్రమలు, అప్పటి వరకు సశాస్ర్తియంగా, చట్టపరంగా వివిధ దేశాల మధ్య పర్యావరణ, జీవవైవిధ్య పరిరక్షణకు సంబంధించి కుదిరిన ఒప్పందాలను పూర్తిగా ధ్వంసం చేశాయనే చెప్పాలి. కానీ పర్యావరణ శాస్త్రం చెబుతున్న ప్రమాణాలపై బాధ్యతారాహిత్యంగా చేస్తున్న దాడులు మనల్ని మరింతగా వినాశనానికి దగ్గరకు తీసుకెళుతున్నాయ. అంతే కాదు ప్రస్తుతం అమలు జరుపుతున్న వినాశకర విధానాలకు ప్రత్యామ్నాయంగా పర్యావరణ హిత విధానాలు ఉన్నాయని శాస్ర్తియంగా నిరూపించినా పట్టించుకునే వారు లేకపోవడం విచిత్రం. తప్పనిసరిగా మనం పరిశ్రమల, రసాయనాలను విపరీతంగా వాడే వ్యవసాయం మరియం కేంద్రీకృత, ప్రపంచ వస్తు ఆధారిత ఆహార వ్యవస్థ వంటి వాటినుంచి దూరంగా వైదొలగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీటివల్ల విషవాయు ఉద్గారాలు తప్ప మరో ప్రయోజనమేమీ ఉండబోదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం అనుసరిస్తున్న జీవవైవిధ్య విధ్వంసక విధానాలు, జిఎంవో విత్తనాల ఆధారంగా ఒకే పంటను పారిశ్రామికంగా ఉత్పత్తి చేసే విధానాలనుంచి మనం పక్కకు తొలగాలి. జీవవైవిధ్యం, జీవపరిరక్షణకు అనుకూలంగా ఉండే పర్యావరణ మిత్ర వ్యవసాయ విధానాలను అనుసరించాలి. జీవవైవిధ్యాన్ని, పర్యావరణ పరిరక్షణకు దోహదపడే వ్యవసాయాన్ని పెద్ద ఎత్తున చేపట్టడం ద్వారా మనం రెండు లాభాలను పొందవచ్చు. మొదటిది జీవవైవిధ్య సంక్షోభ నివారణ కాగా రెండవది పర్యావరణ సంక్షోభ నివారణ. ఏకకాలంలో మనం ఆహార సంక్షోభాన్ని కూడా మనం అధిగమించవచ్చు. పారిశ్రామిక వ్యవసాయం వాతావరణ మార్పునకు ప్రధాన కారణమైనప్పటికీ, దీనికంటే మరింత ప్రమాదకరమైంది, జిఎంవో పంటలకు జీవసాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించడం. ఇవి వాతావరణానికి తీవ్ర హానికలిగిస్తున్నాయి. ముఖ్యంగా వాతావరణ సంక్షోభాన్ని సావకాశంగా తీసుకొని జిఎంవో పంటలను మరింతగా ప్రోత్సహించడం పరిస్థితిని మరింత దారుణంగా మార్చివేస్తున్నది. అంతేకాదు ‘‘బయోపైరసీ’’ ఆధారిత విత్తనాలపై పేటెంట్లను పొందడంద్వారా రైతులు తరతరాలుగా భద్ర పరుస్తున్న పర్యావరణానికి హానికరం కాని విత్తనాలపై కూడా ఆయా కంపెనీలు ఆధిపత్యం చెలాయించడానికి యత్నిస్తుండటం దారుణం. ఇక్కడ ఐన్‌స్టీన్ చెప్పిన మాట ఒకటి గుర్తుంచుకోవాలి. ‘‘మనం నూతనంగా ఆవిష్కరించిన మైండ్‌సెట్‌తో ఉంటే, సమస్యలను మనం పరిష్కరించుకోలేం’’, అన్నారాయన. కేంద్రీకృత, ఒకే పంటను పండించే విధానం, శిలాజ ఇంధనాలను విపరీతంగా వాడటం, జిఎంవో వ్యవసాయం వంటివి సరళమైనవి కావు. అవి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అనువర్తనం చెందలేవు. కానీ మనకు కావలసింది సరళమైనవి, స్థితిస్థాపక లక్షణం కలవి, వాస్తవిక మార్పులకు అనువర్తనం చెందగలిగినవి. మరి ఈ స్థితిస్థాపక శక్తి కేవలం జీవవైవిధ్యం వల్ల మాత్రమే సాధ్యం. ఈ జీవవైవిధ్య విజ్ఞానం, ఆర్థికశాస్త్రం, రాజకీయాలు.. ఈ మొత్తాన్ని కలిపే నేను భూమి ప్రజాస్వామ్యమని వ్యవహరిస్తున్నాను. గత ఏడాది ఉత్తరాఖండ్ ఏవిధమైన వరద విపత్తును ఎదుర్కొన్నదో ఈ ఏడాది కాశ్మీర్ కూడ అదే దుస్థితిని ఎదుర్కొంటున్నది. ఒక రోజులో సాధారణంగా కురిసే వర్షపాతానికి ఐదారు రెట్లు అధిక వర్షపాతం నమోదైతే నిజంగా అదొక అసాధారణ సంఘటన. ఇదే వాతావరణ మార్పుకు గొప్ప ఉదాహరణ. దీనివల్ల ప్రాణ, ఆస్తి నష్టం తీవ్రస్థాయిలో వాటిల్లింది. రోడ్లు, పల్లెలు, వ్యవసాయ క్షేత్రాలు, వంతెనలు ఈ వరద విపత్తులో కొట్టుకుపోయాయి. ప్రస్తుతం కాశ్మీర్‌లో మాదిరి ప్రకృతి విపత్తులకు కారణం కేవలం మానవుల కార్యకలాపాలే! మరి ఈ ప్రకృతి విపత్తులను నిరోధించాలి. మన దేశంలో ‘‘్భతల స్వర్గంగా’’ భావించే కాశ్మీర్ ‘‘కోల్పోయిన స్వర్గం’’గా మారిపోతుంటే వౌన ప్రేక్షకుల మాదిరిగా కూర్చునే సమయం కాదిది.

మరింత సమాచారం తెలుసుకోండి: