ప్రతిపక్షనేత జగన్ కు మావోయిస్టుల నుంచి ముప్పు ఉందట. సాధారణంగా మావోయిస్టుల నుంచి ప్రాణహాని.. అధికారంలో ఉన్నవాళ్లకు ఉంటుంది. లేకపోతే.. గతంలో అధికారంలో ఉండి ఇప్పుడు పవర్లో లేని వాళ్లకు ఉంటుంది. అందులోనూ మావోయిస్టుల పగ అంత త్వరగా చల్లారేది కాదు.. అందుకే మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి పదవి దిగిపోయిన చాలా కాలానికి ఆయనపై మందుపాతర ప్లాన్ చేశారు. మరి జగన్ పై మావోయిస్టుల కన్ను ఎందుకు పడింది. అసలు జగన్ కు మావోయిస్టుల నుంచి ముప్పు ఉందని చెప్పిందెవరనుకుంటున్నారా.. ఈ విషయం ఆయనే స్వయంగా చెప్పుకున్నాడు. అక్కడా ఇక్కడా కాదు. ఏకంగా కోర్టులోనే వివరించారు. తనకు ఇటీవల జెడ్ కేటగిరీ భద్రత తప్పించడంపై కోర్టును ఆశ్రయించిన ఆయన తనకు మావోయిస్టులతో పాటు అనంతపురం జిల్లా నేతల నుంచి కూడా ముప్పు ఉందని కోర్టుకు తెలిపారు. అలాంటి తనకు భద్రత తగ్గించడం అన్యాయమని ఆయన కోర్టుకు చెప్పుకున్నారు. జగన్ కు మావోయిస్టులకు ఉన్న లింకేంటా అని ఆలోచిస్తే.. అందుకు జగన్ తండ్రి వైఎస్సే కారణమని తెలుస్తోంది. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గతంలో మావోయిస్టులను చర్చలకు ఆహ్వానించారు. చర్చలు ఫలించలేదు కానీ.. చర్చల పేరుతో అడవి నుంచి కదిలిన మావోయిస్టుల గుట్టును మాత్రం పోలీసులు కనిపెట్టారు. దాని ఆధారంగా చాలా మంది నక్సల్ నేతలను ఎన్ కౌంటర్ల పేరుతో చంపేశారు. వై.ఎస్. పై ఉన్న కోపం తీర్చుకోవడానికి ఆయన ఎలాగూ బతికిలేరు. అందుకే వైఎస్ కుటుంబానికి కూడా మావోయిస్టుల నుంచి ముప్పు ఉందని నిఘా వర్గాలు చెబుతున్నాయి. అందుకే స్వయంగా జగనే తనకు నక్సల్స్ నుంచి ముప్పు ఉందని కోర్టులో చెప్పుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: