సెలబ్రిటీలు ప్రజాప్రతినిధులుగా మారి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలపై అందరికీ ఒక ప్రత్యేక దృష్టి ఉంటుంది. అక్కడ ఏం జరిగినా.. ఎమ్మెల్యే లేదా ఎంపీ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధుల తీరుకు ముడిపెడుతూ ఉంటారు. సెలబ్రిటీలు కాని ఎమ్మెల్యేలు ఎంపీలు తమ నియోజకవర్గాలకు ఏం చేస్తున్నారు? అనేది ఎవరూ చూడరు కానీ... సెలబ్రిటీలు మాత్రం ఎంపీలుగా ఏం పొడుస్తున్నారు? అనేది అందరికీ ఆసక్తికరమైన విషయమే. మరి నందమూరి బాలకృష్ణకు కూడా ఇప్పుడు అలాంటి పరిస్థితే ఏర్పడింది. తొలిసారి తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయిన బాలయ్య కు సొంత నియోజకవర్గంలో ప్రతిపక్షం పోటు మొదలైంది. ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన వంద రోజులకు బాలయ్య ఏం చేశాడు? నియోజకవర్గాన్ని ఏ విధంగా ఉద్ధరించాడు? అనే విషయంపై నియోజకవర్గ స్థానిక నేతలు విశ్లేషణలు, విమర్శలు మొదలుపెట్టారు. బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదంటూ అక్కడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు విరుచుకుపడుతున్నారు. ఎన్నికల ముందు ఎన్నో కబుర్లు చెప్పిన నందమూరి బాలకృష్ణ ఇప్పటి వరకూ ప్రజలకు చేసింది ఏమీలేదని... మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీ చేసిన నవీన్ నిశ్చల్ అంటున్నాడు. నియోజకవర్గంలోనే మకాం పెడతామని చెప్పుకొచ్చిన బాలయ్య అసలు నియోజకవర్గం వైపే చూడటం లేదని ఆయన విరుచుకుపడుతున్నాడు. మరి బాలయ్య విషయంలోప్రతిపక్షం యాక్టివ్ గానే ఉంది. మొన్నటి ఎన్నికల్లో బాలయ్య కు బాగానే పోటీ ఇచ్చిన నవీన్ ఇప్పటికీ వెనక్కు తగ్గేలా లేడు. బాలయ్య మీద పోరును కొనసాగించేలానే ఉన్నాడు. మరి బాలయ్య బ్యాచ్ ఈ విమర్శలను ఎలా ఎదుర్కొంటుందో!

మరింత సమాచారం తెలుసుకోండి: