మెదక్‌ పార్లమెంట్‌ ఉప ఎన్నిక ఫలితం నేతల్లో గుబులు పుట్టిస్తున్నది. ఇదే సమయంలో పార్టీలు... అభిమానుల కంటే బెట్టింగ్‌ రాజాలు ఉత్కంఠగా చూస్తున్నారు. ఉప ఎన్నికపై ఐపీఎల్‌ మ్యాచ్‌ల తరహాలో బెట్టింగ్‌ సాగుతున్నది. గెలుపు ఊహించిందే అయినా.. బెట్టింగ్‌లు ఎంటని ఆశ్చర్యపోతే తప్పులో కాలేసినట్టే... అక్కడే ఉంది అసలైన ట్విస్ట్‌.. బెట్టింగ్‌ పెట్టాలంటే.. గెలుపోటములే కాదు.. మెజార్టీ కూడా ఉంది కదా...! ఇంకేం బెట్టింరాయుళ్లకు ఇదే అదునుగా దొరికింది. టీఆర్‌ఎస్‌ మెజార్టీపై జోరుగా బెట్టింగ్‌ కాస్తున్నారు. మరి కొన్ని గంటల్లో తెలిపోనున్న ఫలితంపై లక్షల్లో బెట్టింగ్‌ సాగుతోంది.. వేసవి కాలంలో జరిగిన ఐపీఎల్‌ పందెం కాస్తున్న బెట్టింగ్‌రాయుళ్లు ఈసారి ఉప ఎన్నిక ఫలితాన్ని ఎంచుకున్నారు. అయితే ఏక పక్షంగా అధికార పార్టీయే గెలుస్తుందని ప్రచారం సాగుతున్న తరుణంలో బెట్టింగ్‌బాబులు మాత్రం వినూత్నంగా పందెం కాస్తున్నారు.అదేలాగంటే.. సాధారణ ఎన్నికల్లో మెదక్‌ ఎంపీగా గెలిచిన కేసీఆర్‌కు వచ్చిన మెజార్టీ వస్తుందా... రాదా...? అన్నదానిపై పెద్ద ఎత్తున పందెం కాసారు. ఇక కొత్త ప్రభాకర్‌రెడ్డి లక్షకు పైగా మెజార్టీ వస్తుందని.. కాదు రెండు లక్షలపై వస్తుందని మరికొందరు బెట్టింగ్‌లో పాల్గొన్నట్లు సమాచారం. ప్రధానంగా పోటీలో ఉన్న అభ్యర్థుల్లో మూడోస్థానంలో ఏ పార్టీ ఉంటుందన్న దానిపై కూడా వేలాది రూపాయల్లో బెట్‌ కట్టారు. అంతేకాకుండా నర్సాపూర్‌లో సునీతారెడ్డికి మెజార్టీ వస్తుందని కొందరు.. సంగారెడ్డిలో జగ్గారెడ్డి మెజార్టీ ఎంత వస్తుందన్న దానిపై మరి కొందరు పెద్ద ఎత్తున పందెం కాసినట్లు చర్చించుకుంటున్నారు.. ప్రధానంగా హోటళ్లు, పాన్‌ షాపుల వద్ద గతంలో ఐపీఎల్‌ బెట్టింగ్‌లు నిర్వహించన వారే ఉప ఎన్నికల ఫలితాలపై కూడా లక్షలాది రూపాయల్లో బెట్టింగ్‌ నిర్వహించినట్లు తెలిసింది. ఈ ఉప ఎన్నికల ఫలితాలపై రాజకీయా నేతల్లో కూడా జోరుగా పందెలు కాస్తున్నట్టు సమాచారం. ఇరు పార్టీల నేతల్లో తమ పార్టీ అభ్యర్థి గెలుస్తాడని.. లేదు తమ అభ్యర్థి నాలుగు లక్షల మెజార్టీతో గెలుస్తాడన్న ధీమాతో కూడా పందెం కాసిన నాయకులు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి చూస్తున్న మెదక్‌ పార్లమెంట్‌ ఉప ఎన్నిక ఫలితంపై అటు రాజకీయ పార్టీలతోపాటు ప్రతి ఒక్కరూ ఉత్కంఠగానే ఉన్నారు. మరి గెలుపెవరితో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది...

మరింత సమాచారం తెలుసుకోండి: