నందిగామ అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని తంగిరాల సౌమ్య భారీ ఆధిక్యంతో విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి బోడపాటి బాబూరావుపై ఆమె 74,827 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అంతకుముందు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున విజయం సాధించిన తంగిరాల ప్రభాకరరావు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయకముందే మరణించారు. దాంతో ఉప ఎన్నిక నిర్వహించారు. ఈ ఎన్నికల్లో సంప్రదాయాన్ని అనుసరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిని నిలబెట్టలేదు. కాంగ్రెస్ మాత్రం తమ ఉనికిని చాటుకోవాలంటూ బోడపాటి బాబూరావును అభ్యర్థిగా నిలబెట్టింది. మొదటి రౌండు నుంచి చివరి వరకు తంగిరాల సౌమ్య ఆధిక్యాన్ని కనబరుస్తూ వచ్చారు. చివరకు ఆమెకు మొత్తం 99748 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి బాబూరావుకు 24,921 ఓట్లు మాత్రమే వచ్చాయి. బరిలో ఉన్న స్వతంత్ర అభ్యర్థి 650 ఓట్లు మాత్రమే సాధించారు. కాంగ్రెస్ పార్టీ ఎలాగోలా డిపాజిట్ మాత్రం దక్కించుకుని కాస్త గౌరవం నిలబెట్టుకున్నట్లు అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: