దేశవ్యాప్తంగా జరిగిన ఉపఎన్నికల్లో బిజెపికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ప్రత్యేకించి నాలుగు మాసాల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో దాదాపు క్లీన్‌స్వీప్‌ చేసిన ఉత్తరప్రదేశ్‌, బిజెపి పాలిత రాష్ట్రాలు గుజరాత్‌, రాజస్థాన్‌లలో కాషాయపార్టీకి షాక్‌ తగిలింది. 23 సిట్టింగ్‌స్థానాల్లో 13 సీట్లను బిజెపి కోల్పోయింది. ఉత్తరప్రదేశ్‌లో ములాయంసింగ్‌ యాదవ్‌ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ బిజెపిని కంగుతినిపించింది. మొత్తం 11 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరుగగా 8 స్థానాలను ఎస్‌పి గెలుచుకున్నది. కేవలం మూడు స్థానాలకే బిజెపి పరిమితమైంది. ఇవన్నీ బిజెపి సీట్లే కావడం గమనార్హం. అలాగే ప్రధానమంత్రి నరేంద్రమోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో సైతం బిజెపికి షాక్‌ తగిలింది. బిజెపి సిట్టింగ్‌ సీట్లు మూడింటిని కాంగ్రెస్‌ చేజిక్కించుకున్నది. రాజస్థాన్‌లో సైతం మూడు బిజెపి సిట్టింగ్‌ స్థానాలను కాంగ్రెస్‌ గెలుచుకున్నది. సార్వత్రిక ఎన్నికల్లో ఈ మూడు రాష్ట్రాల్లో కాషాయపార్టీ అద్భుత విజయాలు సాధించింది. ఈ ఉపఎన్నికల్లో బిజెపి తన సిట్టింగ్‌ సీట్లు 24లో ఏకంగా 13 కోల్పోయింది. ఇక లోక్‌సభ సీట్ల ఫలితాలు పరిశీలిస్తే మూడు స్థానాలకు పోలింగ్‌ జరగగా ఆ మూడింటిని బిజెపి, టిఆర్‌ఎస్‌, ఎస్‌పి తలో సీటు గెలుచుకున్నాయి. రెండు మాసాల క్రితం బీహార్‌, ఉత్తరాఖండ్‌, కర్నాటక, మధ్యప్రదేశ్‌లలో జరిగిన ఉపపోరులోనూ బిజెపికి ఎదురుదెబ్బ తగిలింది. బీహార్‌లో నితీష్‌, లాలు ద్వయం బిజెపికి చుక్కలు చూపించింది. ఈ ఎన్నికల ఫలితాల పట్ల కాషాయపార్టీ తీవ్ర అసంతృప్తికి గురైంది. ఇలాంటి ఫలితాలను బిజెపి ఊహించి వుండదు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రజాదరణకు విషమ పరీక్షగా పరిగణించిన ఈ ఉపఎన్నికల ఫలితాలు బిజెపికి నిరాశ మిగిల్చాయి. మోడీ హవాతో లోక్‌సభ ఎన్నికల్లో అద్భుత విజయాలు సాధించామని చెప్పుకున్న బిజెపి ఈ ఎన్నికల్లో పరాజయానికి కారణాలు వెతుక్కుంటున్నది. దేశవ్యాప్తంగా 9 రాష్ట్రాల్లో 33 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఛత్తీస్‌ఘర్‌లోని అంతఘర్‌ ఉప ఎన్నికల లెక్కింపు సెప్టెంబరు 20న జరగనున్నాయి. మిగిలిన 32 స్థానాలకుగాను బిజెపి 12 సీట్లు గెలుచుకున్నది. కాంగ్రెస్‌ ఏడు, సమాజ్‌వాదీ పార్టీ 8, టిడిపి, తృణమూల్‌ కాంగ్రెస్‌, ఎఐయుడిఎఫ్‌, సిపిఎం తలో సీటు గెలుచుకున్నాయి. సిక్కింలో ఇండిపెండెండ్‌ విజయం సాధించారు. ఉత్తరప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బిజెపి ఈ ఉపఎన్నికల్లో తీవ్ర అవమానానికి గురైంది. తన సిట్టింగ్‌ స్థానాలు 10కి గాను ఏడింటిని కోల్పోయింది. తన మిత్రపక్షం అప్నాదళ్‌ ఒక సీటులో ఓటమి చెందింది. ఈ 8 స్థానాలను పాలక సమాజ్‌వాదీ పార్టీ కైవసం చేసుకున్నది. బిఎస్‌పి ఎన్నికలకు దూరంగా వుండటంతో ఎస్‌పి, బిజెపి మధ్య ముఖాముఖి పోరు జరిగింది. లోక్‌సభ ఎన్నికల్లో ఓటమికి ఎస్‌పి ప్రతీకారం తీర్చుకున్నది. లవ్‌ జీహాద్‌ వంటి ప్రాధాన్యత లేని అంశాలతో బిజెపి ఎన్నికల ప్రచారానికి వెళ్లింది. దీనివల్ల కాషాయపార్టీకి ఎలాంటి ప్రయోజనం కలగలేదు. లోక్‌సభ ఎన్నికల్లో యుపిలో మొత్తం స్థానాలు గెలుచుకోవడంలో కీలకపాత్ర పోషించిన బిజెపి అధ్యక్షుడు అమిత్‌ షా చాణుక్యం కూడా ఇప్పుడు పనిచేయలేదు. రాజస్థాన్‌లో ఘోర పరాభవం జరిగింది. ఇక్కడ నాలుగు బిజెపి సిట్టింగ్‌ సీట్లకు ఎన్నికలు జరగగా అందులో మూడింటిని కాంగ్రెస్‌ గెలుచుకున్నది. గుజరాత్‌లో 9 సీట్లకుగాను మూడింటిలో కాంగ్రెస్‌ విజయం సాధించింది. గుజరాత్‌లో నరేంద్రమోడీ గైర్హాజరీలో 12 ఏళ్ల తర్వాత జరిగిన మొదటి ఎన్నికలు ఇవి. యుపి(11), గుజరాత్‌(9), రాజస్థాన్‌(4)లో ఎన్నికలు జరిగిన సీట్లన్నీ బిజెపికి చెందినవే. ఈ స్థానాలకు ప్రాతినిధ్యం వహించిన శాసనసభ్యులు పార్లమెంట్‌కు ఎన్నిక కావడంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. బిజెపి ఘోర పరాజయంపై కాంగ్రెస్‌, ఎస్‌పి స్పందిస్తూ మతోన్మాద శక్తులకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని వ్యాఖ్యానించాయి. బిజెపి తిరోగమనం ప్రారంభమైందని పేర్కొన్నాయి. నరేంద్రమోడీ ప్రభుత్వాన్ని, బిజెపి విభజనవాద రాజకీయాలను ప్రజలు తిరస్కరించారని స్పష్టం చేశాయి. ఇలాంటి ఫలితాలను తాము ఊహించలేదని, స్థానిక సమస్యలకు అనుకూలంగా ప్రజలు ఓటు వేశారని బిజెపి సమర్ధించుకున్నది. ఈ ఎన్నికల్లో బిజెపికి ఊరట కలిగించే అంశం ఒక్కటే. పశ్చిమబెంగాల్‌లో పాగా వేయాలని ఎంతోకాలంగా కంటున్న కల ఇప్పుడు నిజమైంది. పశ్చిమబెంగాల్‌లో రెండు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఒకటి అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌, మరొకటి బిజెపి గెలుచుకున్నాయి. నార్త్‌ 24 పరగణాల జిల్లాలోని బసిరత్‌ దక్షిణ్‌ స్థానం నుండి బిజెపి అభ్యర్థి శామిక్‌ భట్టాచార్య తృణమూల్‌ అభ్యర్థి దీపేందు బిశ్వాస్‌పై కేవలం 1586 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. ప్రధాని నరేంద్రమోడీ ఖాళీ చేసిన వదోదర లోక్‌సభ సీటును బిజెపి నిలబెట్టుకున్నది. అయితే, సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే మెజారిటీ బాగా తగ్గింది. మరో రెండు లోక్‌సభ సీట్లలో మెయిన్‌పురిని ఎస్‌పి, తెలంగాణలోని మెదక్‌ను టిఆర్‌ఎస్‌ తిరిగి గెలుచుకున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో 11 సీట్లకుగాను ఎస్‌పి 8, బిజెపి 3, గుజరాత్‌లో బిజెపి ఆరు, కాంగ్రెస్‌ మూడు, రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ మూడు, బిజెపి ఒక సీటు గెలుచుకున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో నందిగామను టిడిపి తిరిగి నిలబెట్టుకున్నది. అస్సాంలో బిజెపి ఒక సీటును కాంగ్రెస్‌ నుండి గెలుచుకున్నది. ఆల్‌ఇండియా యునైటెడ్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌, పాలక కాంగ్రెస్‌ చెరో సీటు గెలుచుకున్నాయి. త్రిపురలో మను స్థానాన్ని సిపిఎం కైవసం చేసుకున్నది. బీహార్‌, కర్నాటక, మధ్యప్రదేశ్‌ ఉప ఎన్నికల ఫలితాలు, జులైలో ఉత్తరాఖండ్‌లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు, ఇప్పటి ఫలితాలను పరిశీలిస్తే బిజెపికి అప్పుడే ఎదురుగాలి ప్రారంభమైనట్లు కనిపిస్తున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: