మరోసారి ఐటీ ఆఫ్‌షోర్‌ బిజినెస్‌లో అనువైన దేశాల్లో భారత్‌ అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. తర్వాత స్థానంలో చైనా ఉన్నా.. మనదేశానికి ఏమాత్రం పోటీ కాదంటున్నాయి నివేదికలు. అదే సమయంలో పెరుగుతున్న ఆధునిక సంకేతిక పరిజ్ఞానం భవిష్యత్తులో ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తుందని కూడా హెచ్చరిస్తున్నాయి. ఐటీ రంగంలో ఆఫ్‌షోర్‌ బిజినెస్‌కు భారతదేశానికి మించిన డిస్టినేషన్‌ లేదంటున్నారు. 51 దేశాల్లో జరిపిన సర్వేలో భారత్‌ కంటే మెరుగైన ప్రాంతం ఏదీ కనిపించలేదని ఏటీ కెర్నీ అనే సంస్థ జరిపిన సర్వే నివేదికలో పేర్కొన్నారు. గ్లోబల్‌ సర్వీసెస్‌, లొకేషన్‌ ఇండెక్స్‌ పేరిట నిర్వహించిన ఈ సర్వేలో భారత్‌ ఆఫ్‌షోర్ బిజినెస్‌కు అత్యంత సానుకూలంగా ఉన్నట్టు గుర్తించారు. ఐటీ సర్వీసులు అందిస్తున్న సంస్థలు తమ బిజినెస్‌లను విస్తరించడంతో పాటు.. పరిశోధనలు..అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం.. క్లయింట్స్‌ అవసరాలకు తగ్గట్లు ఉత్పత్తులను మెరుగుపరిచి అందించడంలో భారతీయ ఐటీ కంపెనీలు ముందున్నాయట.  ప్రపంచవ్యాప్తంగా 51దేశాల్లో ఆర్ధికపరమైన లాభదాయకత, మానవవనరుల లభ్యత- నైపుణ్యాలు, వ్యాపారానికి అనుకూల వాతావరణం అనే మూడు అంశాలను పరిగణనలోకి తీసుకుని చేసినఈ సర్వేలో భారత్‌ తర్వాత స్థానాలను చైనా, మలేషియాలు సొంతం చేసుకున్నాయి. టాప్‌ 10 ఐటీ ఆఫ్‌షోర్‌ డిస్టినేషన్స్‌లో 6 దేశాలు ఆసియాకు చెందినవే ఉండడం గమనార్హం. భారత్‌ సహా ఆసియాకు చెందిన ఐటీ ఆఫ్‌షోర్‌ కంపెనీలకు సవాళ్లు కూడా మొదలయ్యాయని సర్వే చెబుతోంది. దశాబ్ధం క్రితం భారత్‌ వంటి దేశాలకు లక్షలాది ఉపాధి అవకాశాలు కల్పించిన ఔట్‌సోర్సింగ్‌లో ఇప్పుడు మౌలిక మార్పులొస్తున్నాయి. చాలా కంపెనీలు సొంతంగా ఐటీ నిపుణులను రిక్రూట్‌ చేసుకుని ఔట్‌సోర్సింగ్‌ కాంట్రాక్ట్‌లు రద్దుచేసుకుంటున్నాయి. సొంతంగా సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసుకోవడం ద్వారా వీసాల సమస్యలుండవు. ఆర్ధిక భారం తగ్గుతుంది. ఇది భారత్‌ వంటి దేశాల ఔట్‌సోర్సింగ్‌ బిజినెస్‌ను తీవ్రంగా దెబ్బతీస్తోంది. కాస్ట్‌ కటింగ్‌లో భాగంగా సాఫ్ట్‌వేర్‌ కొని దానిని నిర్వహించే బాధ్యతను సొంతంగా కంపెనీలే నిర్వహించుకుంటున్నాయి. చాలామంది ఫ్రీలాన్స్‌ నిపుణులు అందుబాటులో ఉండడం కంపెనీలకు కలిసొస్తోంది. ఇక భవిష్యత్తులో తక్కువ ఖర్చుతో ఆటోమేషన్‌ రూపంలో రోబోలు కూడా అందుబాటులోకి వస్తుండడం మరింత సవాల్‌గా మారుతుందని హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: