మెదక్‌ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలలో బిజెపి అభ్యర్థి ఘోర పరాజయం చవిచూడటం ఆ పార్టీ నేతలను తీవ్ర నిరాశకు గురి చేసింది. ఈ ఎన్నికకు సంబంధించి నామినేషన్‌ దాఖలుకు గడువు ముగిసే చివరి రోజున అనూహ్యంగా కాంగ్రెస్‌ నుంచి పార్టీ ఫిరాయించి బిజెపిలో చేరిన జగ్గారెడ్డికి టికెట్‌ ఇచ్చి పోటీని ఆసక్తికరంగా మార్చింది. అప్పటి నుంచి ఉప ఎన్నికల హోరు అధికార టిఆర్‌ఎస్‌ బిజెపి మధ్యనే జరుగనుందనే ప్రచారం కూడా సాగింది. అయితే మెదక్‌ ఉప ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టిఆర్‌ఎస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను అక్కడనే తిష్ట వేయించి మరీ పార్టీ అభ్యర్థి ప్రవీణ్‌రెడ్డి గెలుపు కోసం అహర్నిషలు కృషి చేశారు. టిఆర్‌ఎస్‌ పార్టీపై, ప్రభుత్వంపై బిజెపి నేతలు తీవ్రమైన పదజాలంతో విమర్శలు గుప్పించారు. బిజెపి మిత్రపక్షమైన టిడిపి నేతలు సైతం ఏకంగా సీఎం కెసిఆర్‌ను టార్గెట్‌గా చేసుకుని విమర్శలు గుప్పించారు. అయినప్పటికీ బిజెపి అభ్యర్థి ప్రతిపక్ష కాంగ్రెస్‌ అభ్యర్థికన్నా తక్కువ స్థాయిలో ఓట్లను సాధించి మూడో స్థానానికి దిగజారడం ఆ పార్టీ నేతలతో పాటు కార్యకర్తలను కూడా తీవ్ర నిరాశకు గురి చేసింది. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన తొలి ఎన్నికలలో జాతీయ నేతలు, కేంద్ర మంత్రులను సైతం రంగంలోకి దింపినప్పటికీ మెదక్‌ ఓటర్లు అధికార పక్ష అభ్యర్థికి భారీ మెజార్టీని ఎందుకు కట్టబెట్టాలరో అర్థం కాక ఆ పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర కల సాకారం కావడంలో బిజెపి క్రియాశీలకమైన పాత్రను పోషించినప్పటికీ తమ పార్టీని ప్రజలు ఎందుకు ఆదరించలేదో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. ఓవైపు తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో వారి ఆశలకు అనుగుణంగా పాలన సాగించడంలో టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం విఫలమవుతున్నప్పటికీ ఆ పార్టీనే ఎందుకు ఆదరిస్తున్నారో లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉందని పార్టీ నేతలు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: