చంద్రబాబు సామర్థ్యమో.. కేసీఆర్ మొండితనమో తెలియదు కానీ.. ఏపీలో కొత్త ప్రాజెక్టులు వస్తుంటే.. తెలంగాణలో మాత్రం ఉన్నవి కూడా ఆగిపోయేలా కనిపిస్తున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి వివాదాస్పదంగా మారిన మెట్రో - ఎల్ అండ్ టీ వ్యవహారం ఇప్పుడు పెను వివాదానికి దారి తీస్తోంది. ఇంకొన్ని నెలల్లో ప్రాజెక్టు పూర్తవుతుందని అంతా భావిస్తున్న దశలో ప్రాజెక్టు నుంచి వైదొలగుతామంటూ ఎల్ అండ్ టీ హెచ్ ఎమ్మార్ కు సుదీర్ఘమైన లేఖరాయడం కలకలానికి దారి తీస్తోంది. కేసీఆర్ సర్కారు వచ్చిన మొదట్లోనే వివాదం పొడచూపినా.. ఆ తర్వాత అంతా సర్దుకుందనే అందరూ భావించారు. తాజా లేఖతో వివాద తీవ్రత మరోసారి వెలుగు చూసింది. ఇప్పటి దాకా వేచి చూసింది చాలు.. ఇంకా భరించడం మా వల్ల కాదని ఎల్ అండ్ టీ కంపెనీ లేఖ రాసే స్థాయికి వివాదం చేరుకుంది. ప్రధానంగా రైలు మార్గం కేటాయించడంలో జాప్యం జరగడం.. మార్గం మార్చాలంటూ కేసీఆర్ ఆదేశించడం.. ప్రత్యామ్నాయ మార్గాలు అంత సులభం కాకపోవడం వంటి అంశాల కారణంగా ఎల్ అండ్ టీ ప్రాజెక్టు పురోగతిపై తీవ్ర అసంతృప్తితో ఉంది. ఇలా నత్తనడకన పనులు నడిస్తే.. నిర్మాణ వ్యయం అనూహ్యంగా పెరిగిపోయి... నష్టాలు రావడం ఖాయమని ఎల్ అండ్ టీ ఓ నిర్ణయానికి వచ్చింది. కేసీఆర్ సర్కారు వైఖరిని ఎలాగూ మార్చలేం కనున.. తామే ప్రాజెక్టు నుంచి వైదొలగుతామని లేఖ రాసింది. ఇప్పటివరకూ అయిన ఖర్చులు తమకు ఇప్పిస్తే... మూటాముల్లే సర్దుకుంటాం.. మీ తిప్పలు మీరు పడండి.. అంటూ ఘాటుగా ఉత్తరం రాసింది. ఉమ్మడి రాష్ట్రంలో మొదలైన ప్రాజెక్టు జోరుకు.. రాష్ట్ర విభజనతోనే అడ్డుకట్ట పడింది. మెట్రో రైల్ ప్రాజెక్టులో ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటైంది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న హైదరాబాద్ కు.. ఇప్పటి హైదరాబాద్ కూ చాలా తేడా ఉంది. రియల్ ఎస్టేట్ మార్కెట్ పడిపోయింది. కేవలం రైలు టికెట్లమ్మితే వచ్చే ఆదాయంతో ఎల్ అండ్ టీ మెట్రోను నడపలేదు. ఇతర మార్గాల్లో అంటే.. స్టేషన్ల పరిధిలోని షాపుల నిర్వహణ వంటి ఆదాయాలతో మెట్రోను నడపవచ్చని ఎల్ అండ్ టీ భావించింది. ప్రస్తుత పరిస్థితుల్లో హైదరాబాద్ కున్న గ్లామర్ తగ్గడంతో... ఇప్పుడీ ప్రాజెక్టు ఏమాత్రం లాభదాయకం కాదని ఓ అంచనాకు వచ్చింది. ఒకవేళ ఎల్ అండ్ టీ కనుక ఈ ప్రాజెక్టు నుంచి నిజంగానే వైదొలగితే.. అది కేసీఆర్ సర్కారుకు పెద్ద దెబ్బే అవుతుంది. కొత్త ప్రాజెక్టులు రాకపోగా.. ఉన్న ప్రాజెక్టులు ఆగిపోవడం.. హైదరాబాద్ బ్రాండ్ పైనా ప్రభావం చూపే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: