ఇప్పటికే తెలంగాణలోని కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల డ్యాంలకు గండ్లు పడ్డాయి. అనేక మంది నేతలు ఈ పార్టీ ల వైపు నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి వైపు వెళ్లిపోయారు. మరో ఐదేళ్ల వరకూ ప్రతిపక్షంలో ఉండే ఓపికలేని నేతలతో హ్యాపీగా కేసీఆర్ పంచన చేరిపోయారు. ఈ విషయంలో కేసీఆర్ కూడా ఎంకరేజ్ చేయడంతో వలసలు ఉధృతస్థాయికి చేరుకొన్నాయి. ఇటువంటి నేపథ్యంలో మెదక్ ఉప ఎన్నికల ఫలితాలు ఈ వలసలు మరింత తీవ్రం అయ్యేలా చేస్తున్నాయని చెప్పవచ్చు. మెదక్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ భారీ మెజారిటీ సాధించడం ద్వారా తన సత్తా చాటుకొంది. ప్రస్తుతానికి తెలంగాణలో తనకు తిరుగులేదన్న సందేశాన్ని ఇచ్చింది. తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీలు కలిసి పోటీ చేసినా.. వారికి మోడీ మానియా అండగా ఉన్నా మూడో స్థానానికే పరిమితమయ్యారు. అంతో ఇంతో కాంగ్రెస్ పరిస్థితే బెటరు! కనీసం ద్వితీయ స్థానం అయినా దక్కింది. ఈ ఉప ఎన్నికల ఫలితాలను చూసి గ్రామీణ స్థాయిల్లో తెలుగుదేశం క్యాడర్ స్థైర్యం మరింత దెబ్బతిన్నట్లేనని అనుకోవాల్సి వస్తోంది. వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని సాధించేస్తామని చంద్రబాబు చెబితే చెప్పవచ్చునేమో కానీ.... వాళ్లకు మాత్రం ఇప్పుడు ఆ ధైర్యం కనపడటం లేదు. తెలుగుదేశం హవా రంగారెడ్డి, హైదరాబాద్ లలోని కొన్ని నియోజకవర్గాలకు మాత్రమే పరిమితం అన్న భావనను పెంపొందించాయి ఈ ఎన్నికలు. దీంతో తెలంగాణలోని రూరల్ ఏరియా కార్యకర్తలు డీలా పడిపోయే అవకాశాలున్నాయి. తిరిగి అధికారంలోకి వస్తామన్న బాబు విశ్వాసాన్ని ఈ ఫలితాలు నీరుగార్చాయి. ఇక కాంగ్రెస్ రెండో స్థానంలో నిలబడి తెలంగాణ వరకూ నైనా కోలుకొంటున్నాననే సంకేతాన్ని ఇవ్వడానికి ప్రయత్నించింది. అయితే ఇదే సమయంలో కాంగ్రెస్ ను కేసీఆర్ ప్రత్యేకంగా టార్గెట్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. తన తర్వాతి స్థానంలో నిలిచిన పార్టీనే కదా కేసీఆర్ మొదట దెబ్బ కొట్టేది!

మరింత సమాచారం తెలుసుకోండి: