ఎన్టీఆర్ సుజల.. చంద్రబాబు సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించబోతున్నపథకమిది. కేవలం రెండు రూపాయల ఖర్చుకే.. 20లీటర్ల మంచినీరు ఇవ్వాలనేది పథకం లక్ష్యం. సామాన్య జనానికి అత్యధికంగా ఉపయోగపడే గొప్ప పథకమిది. ఎందుకంటే.. ప్రజలకు వచ్చే రోగాల్లో చాలావరకూ అపరిశుభ్రమైన తాగునీటి ద్వారానే వస్తుందని నిపుణులు చెబుతున్నారు. మౌలిక సదుపాయాలు లేక.. తాగునీటి సౌకర్యంలేక అందుబాటులో ఉన్న మురికినీటితోనే జీవనం గడిపే గ్రామాలెన్నో. అలాగే నీరు పుష్కలంగా ఉన్నా ఫ్లోరైడ్ వంటి లవణాల కారణంగా రోగాలకు కారణమవుతున్న జలంతో ఇబ్బందులు పడుతున్న ఊళ్లెన్నో ఉన్నాయి తెలుగు నేలపై. మరి అలాంటి కీలకమైన తాగునీరు.. కేవలం రోజుకు 2 రూపాయల ఖర్చుతో అందించడమంటే... చాలా గొప్ప విషయమే. ఐతే ఈ పథకానికి సరిగ్గా నిధులు మంజూరు చేయకుండా... కేవలం దాతల ఔదార్యం పైనే ఆధారపడాలని సర్కారు భావిస్తున్నట్టు సమాచారం. వాస్తవానికి కొన్ని గ్రామాల్లో ఈ పథకం అప్పుడే ప్రారంభమైంది. కానీ అది ప్రభుత్వ నిధులతో కాదు.. కొందరు దాతలు తమ సొంత ఖర్చుతో ఈ పథకాన్ని నిర్వహిస్తున్నారు. సర్కారు కూడా దాతలను ప్రోత్సహించి.. వారి విరాళాల ఆధారంగానే ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని నిర్వహించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అక్టోబర్ 2 నుంచి తొలివిడతగా 175 నియోజకవర్గాల్లో ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకం కోసం ఒక్కో ప్లాంటులో నీటి శుద్ధి యంత్రం కోసం దాదాపు 3 లక్షల రూపాయలు ఖర్చవుతుంది. ఇప్పటికే దాదాపు 12వందల యంత్రాలు కొనేందుకు అవసరమైన విరాళాల మొత్తం దాతల నుంచి స్వీకరించినట్టు.. ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మిగిలిన చోట్ల కూడా దాతలు పెద్దఎత్తున ముందుకొస్తారని వారు అంచనా వేస్తున్నారు. ఇంతవరకూ బాగానే ఉంది. మిషన్లు దాతలు సమకూర్చినా.. వాటి నిర్వహణ భారం ప్రభుత్వం మోయకతప్పదు. విద్యుత్ ఖర్చు.. మిషన్లు ఉంచేందుకు అవసరమైన భవనాల ఏర్పాటు ప్రభుత్వం చూసుకోవలసిందే. అలాగే తొలివిడతగా కేవలం 12వందల చోట్ల మాత్రమే మిషన్లు పెడుతున్నారు. మరి రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకం ఎప్పటి నుంచి ప్రారంభిస్తారో తెలియాల్సి ఉంది. కేవలం దాతల ఔదార్యంపై ఆధాపడకుండా చిత్తశుద్ధితో పథకం నిర్వహించినప్పుడే సుజలం సుఫలమయ్యేది.

మరింత సమాచారం తెలుసుకోండి: