భారతీయ జనతా పార్టీలో గ్రూపుల విభజన చానాళ్ల నుంచినే కనిపిస్తోంది. ప్రధానమంత్రిగా మోడీ అభ్యర్థిత్వం గురించి చర్చ మొదలైనప్పటి నుంచినే ఈ విభజన తలెత్తింది. కొంతమంది మోడీ అనుకూల వాదులుగానూ మరికొంతమంది వ్యతిరేక వాదులగానూ అప్పట్లో విడిపోయారు. వీళ్లంతా బహిరంగంగా మాట్లాడింది లేదు కానీ.... బీజేపీ నేతల్లో కొంతమంది అద్వానీ ని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని అంతర్గతంగా లాబీయింగ్ చేశారు. అయితే ఆర్ ఎస్ ఎస్ మోడీ వైపు మొగ్గు చూపడంలో పరిస్థితిలోమార్పు వచ్చింది. అక్కడికీ అద్వానీ తీవ్రమైన అసంతృప్తే వ్యక్తం చేశాడు. తన బ్లాగు ద్వారా ఆయన అసంతృప్తిని వెల్లగక్కాడు. అయితే సార్వత్రిక ఎన్నికల్లో దేశ ప్రజలంతా మోడీకి అండగా నిలబడటంతో పరిస్థితి మొత్తం మారిపోయింది. మోడీ ఒక సూపర్ పవర్ గా నిలిచాడు. ఈ వంద రోజుల్లోనే పార్టీపై ఆయన పూర్తిగా పట్టు సంపాదించాడు. తమకు కాని వారి శిబిరాన్ని మోడీ అండ్ కో విచ్చిన్నం చేసింది. పార్టీకి పునాదులు వేసిన వారందరినీ పక్కన పెట్టేసి అమిత్ షాను తెచ్చి అధ్యక్షుడిని చేశారు. అమిత్ షా మోడీకి మరో ముఖం లాగానే కనిపిస్తూ వచ్చాడు. వంద రోజుల్లోనే బీజేపీలో షా, మోడీలు ఏం చెబితే అదే వేదం అనే పరిస్థితి ఏర్పడింది. మరి పెరుగుట విరుగుట కొరకే అనేది సామెత. ఇప్పుడు మోడీ, షాల ప్రాభవం విషయంలోకూడా అదే జరుగుతోంది. భారతీయ జనతా పార్టీ ఉప ఎన్నికల్లో ఓటమి పాలవ్వడంతో పార్టీలోని అసంతృప్తులు తలలు బయటకు పెడుతున్నారు. తమ నాలుకలకు పని చెబుతున్నారు. మోడీ, అమిత్ షా విధానాలను వీళ్లు మీడియా ముందుకు వచ్చి తప్పుపడుతున్నారు. ముందుగా ఒకనాటి బాలీవుడ్ స్టార్ హీరో, ప్రస్తుత భారతీయ జనతా పార్టీ ఎంపీ శత్రుఘ్ఞ సిన్హా మీడియా ముందుకు వచ్చాడు. సీనియారిటీకి ప్రాధాన్యతను ఇవ్వాలని.. పార్టీ విధి విధానాలను మార్చాలన్నట్టుగా సిన్హా మాట్లాడాడు. మరి ఇలాంటి వారందరికీ ఉప ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తినడం ఒక అవకాశంగా మారిందనడంలో సందేహం లేదు!

మరింత సమాచారం తెలుసుకోండి: