‘అవినీతి’ గురించి మాజీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వినోద్ రాయ్ సెప్టెంబర్ 11న మాట్లాడింది చూసిన తర్వాత, ఆ పదానికి అర్థాన్ని అందరం పునర్నిర్వచించుకోవటం అవసరం. వాస్తవానికి వినోద్‌రాయ్ చెప్పి న నిర్వచనం కొత్తదికాదు. అవినీతి అనే మాటకు అర్థాన్ని నిఘంటువులలో వెతికినా, శాస్ర్తియంగా చూసినా, అది కేవలం ఆర్థికపరమైన అవినీతి అని ఎక్కడా కన్పించదు. స్థూలంగా చెప్పాలంటే, ‘నైతికత’ లేకపోవటం అవినీతి. నైతికత దేనికి సంబంధించి? పలానాదానికని కాదు. జీవితంలోని సమస్త అంశాలు దాని పరిధిలోకి వస్తాయి. ఏ అంశానికి సంబంధించి నైతికంగా వ్యవహరించకున్నా అది అవినీతే అవుతుంది. వ్యక్తికి రెండు జీవితాలుంటాయి. ఒకటి వ్యక్తిగతమైనది, రెండవది సామాజికమైనది. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ గురించి వినోద్‌రాయ్ ప్రస్తావించింది సమాజంతో సంబంధంగల నైతికత విషయం. సమాజంతో మన్మోహన్ సంబంధం రాజకీయ రూపంలో, పరిపాలకుని రూపంలో ఉండేది. ఆ సంబంధం కేవలం ఆర్థికానికి పరిమితమైంది కాదు. అటువంటి స్థితిలో మన్మోహన్ సింగ్ అనే వ్యక్తికి సమాజంతో రాజకీయాల ద్వారా, పరిపాలనా వ్యవస్థ ద్వారా ఉండే సకల సంబంధాలు కూడా నైతికంగా ఉండాలి. అవి ఆర్థికం, రాజకీయం, పరిపాలన, విధానపరం, ఇంకా చెప్పాలంటే ఆలోచనాపరం ఏవైనా కావచ్చు. ఆయన, లేదా ఏ పరిపాలకుడైనా సరే సమాజం పక్షాన ఆ స్థానంలో ఉన్నపుడు, ఆ విషయాలన్నింటిలోనూ నైతికంగా ఉండగలనని ఆ సమాజానికి మాట ఇస్తున్నాడన్న మాట. అట్లా మాట ఇవ్వటం ప్రమాణ స్వీకారంలోనో, రూల్స్‌బుక్‌లోనో లిఖితరూపంలో ఉండకపోవచ్చు. కాని ప్రమాణపత్రం, రూల్స్‌బుక్, రాజ్యాంగం అంతరార్థం అదే. అది సమాజానికి- ఆయనకు మధ్య ఉండే లా ఆఫ్ కాంట్రాక్ట్. నైతికత గురించి సమగ్రమైన ఆలోచనా దృక్పథం వేల సంవత్సరాలుగా ఉండి కూడా మనం దానిని ఆర్థిక అనైతికతకు పరిమితం చేసి చూస్తున్నాము. మన్మోహన్‌సింగ్ లంచాలు తీసుకుంటాడా లేదా? బొగ్గు గనులు, 2-జిల్లో డబ్బు తీసుకున్నాడా లేదా? మన్మోహన్ కాకపోతే మరొక నాయకుడు. డబ్బు తీసుకుంటే అవినీతిపరుడు. అదొక్కటే కాకుండా మరేమి చేసినా సమస్య లేదు, నీతిపరుడే. చివరకు డబ్బు తీసుకున్నా అది ‘తనకోసం’ గాక ‘పార్టీకోసం’ అయితే, నైతికతలో మళ్లీ రాయితీ ఇవ్వవచ్చు. బొగ్గుగనులు, 2-జి అంశాలపై కాగ్ నివేదికలు తయారుచేసిన వినోద్‌రాయ్ గత గురువారంనాడు ఔట్‌లుక్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నమాటలను గమనించండి: ‘‘నీతి అన్నది కేవలం ఆర్థిక సంబంధమైనది కాదు. అది మేధోపరమైన నీతి. వృత్తిపరమైన నీతి. మీరు రాజ్యాంగానికి బద్ధులం కాగలమని ప్రమాణం చేసారు. అది ముఖ్యం’’. ఇందులో ‘మేథోపరమైన, వృత్తిపరమైన’ అని పేర్కొనటం, రాజ్యాంగం ప్రస్తావన తీసుకురావటం అన్నవి మన పైన ఇచ్చుకున్న వివరణలను ఒక మేరకు సారాంశరూపంలో చెప్పటమే. మన్మోహన్ సింగ్ 1991లో ఆర్థిక మంత్రి అయినపుడు, అంతకన్నా ముఖ్యంగా 2004లో ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకున్నపుడు వచ్చిన పొగడ్తలు రెండు విధాలుగా ఉన్నాయి. ఒకటి, ఆర్థిక విషయాలలో తన ప్రజ్ఞాపాటవాలకు సంబంధించినవి కాగా రెండు, తన ‘మచ్చలేని నీతి’ గురించినవి. యుపిఎ-2 అధికారానికి వచ్చిన తర్వాత కుంభకోణాలు వెలుగులోకి రావటం మొదలైంది. వాటికి సంబంధించి మనకు మన్మోహన్‌సింగ్ వైపు నుంచి కన్పించింది ఏమిటి? అసలు వాటిలో తప్పులుగాని, అవినీతిగాని లేనేలేవన్నది ఒక మాట. ‘‘అభివృద్ధి’కోసం అటువంటివి అవసరమన్నది రెండవమాట. ఒకవేళ పొరపాట్లు ఏమైనా ఉంటే సరిదిద్దగలమన్నది మూడవ మాట. అవన్నీ జరుగుతుండిన కాలంలో తన దృష్టికి రానేలేదన్నది నాల్గవమాట. అవి తన వ్యక్తిగత నిర్ణయాలు కావు, కేబినెట్‌లలో కొన్ని సమస్యలుంటాయన్నది ఆరవ మాట. ఈ మాటలను జాగ్రత్తగా గమనించినపుడు కనిపించేదేమిటి? ఆయన తర్కానికి నిలవని, పరస్పరం పొంతనలేని విధంగా మాట్లాడుతూ పోయారు. అందులో ‘ఆర్థిక అవినీతి’ ఏదీ లేదు. కాని వినోద్‌రాయ్ అవసరమంటున్న మేధోపరమైన, వృత్తిపరమైన నీతిగాని, రాజ్యాంగంపై చేసిన ప్రమాణానికి కట్టుబడటంగాని ఏవీ లేవు. ఆయన స్వంతానికి డబ్బు తీసుకుని ఉండకపోవచ్చు. కాని ఆయా కుంభకోణాలవల్ల దేశానికి డబ్బు నష్టం జరిగిందా లేదా? అట్లా డబ్బు నష్టం జరగనున్నదని, జరుగుతున్నదని ఆయనకు ముందుగా తెలుసా లేదా? జరుగుతున్న సమయంలో తెలుసా లేదా? అటువంటప్పుడు అది మేధోపరమైన, వృత్తిపరమైన, రాజ్యాంగ ప్రమాణపరమైన అవినీతి అవుతుందా కాదా? ఇవి ఒక విధమైన ప్రశ్నలు అయితే, తను స్వంతానికి డబ్బు తీసుకోలేదు గదానన్నది చూపుతూ దేశానికి డబ్బు నష్టం చేయటం, అది జరిగినా వౌనం వహించటం, వెలుగులోకి వచ్చినపుడు తర్కరహితమైన, పరస్పర విరుద్ధమైన వాదనలతో సమర్థించుకొనటం నీతి అవుతుందా? అన్నది మరొక ప్రశ్న. ‘అభివృద్ధి’ లక్ష్యాల సాధనకు అదంతా చేయవలసి వచ్చిందని లేదా సంకీర్ణ ప్రభుత్వపు వత్తిళ్లవల్ల చేయక తప్పలేదని మరొక రెండు వాదనలు వినవచ్చాయి. అభివృద్ధి అనేది దేశ వనరులను కంపెనీలకు అక్రమంగా కట్టబెడితే తప్ప సాధ్యం కాదా? సక్రమంగా అప్పగించినందువల్ల ఆగేది అభివృద్ధా లేక సదరు కంపెనీల అక్రమ లాభాలా? అధికార పక్షం నుంచి మొదలుకొని, మంత్రులనుంచి అధికార యంత్రాంగంవరకు గల అందరి అవినీతి ఆర్జనలా? ఇవన్నీ తెలిసినా అందుకు అవకాశం కల్పించటం, అందుకు ‘అభివృద్ధి అవసరాలను’ కారణంగా చూపటం మేధోపరమైన, వృత్తిపరమైన, రాజ్యాంగ ప్రమాణపరమైన నీతి అవుతుందా? ఈ రకరకాల అవినీతులకు ఆస్కారమివ్వటం అవినీతి కాదా? వాస్తవానికి మన్మోహన్‌సింగ్ ఆర్థిక విషయాల జోలికి పోనే పోలేదన్న సర్ట్ఫికెట్ ఇవ్వటం కూడా కనీసం ఒక సందర్భాన్ని బట్టి అనుమానాస్పదంగా మారింది. అది, తన ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం వచ్చినపుడు గెలిచేందుకు ప్రతిపక్ష సభ్యులను తాను స్వయంగా ఖరీదు చేయకపోయినా డబ్బున్న మిత్రుల చేత ఖరీదు చేయించారన్న ఆరోపణలు. వాటికి సరైన సమాధానం ఇప్పటికీ లేదు. బొగ్గు గనులు, 2-జి వంటి అనేకానేకాలలో అక్రమాలను ఉద్దేశపూర్వకంగా జరగనిచ్చి దేశానికి భారీ నష్టాలు చేయటమే అయింది. అయినప్పటికీ కొందరి దృష్టిలో ఆయన ఇప్పటికీ ‘‘దేశాభివృద్ధి కోసం, ప్రభుత్వం నిలవటం కోసం’’ కొన్ని పరిపాలనాపరమైన పొరపాట్లు చేస్తే చేసి ఉండవచ్చుగాని, వ్యక్తిగతంగా మాత్రం నీతిపరుడే. స్వంతానికి డబ్బు తీసుకోని నీతిమంతుడు అయినందున, ఆ అర్హతాపత్రాన్ని చేబూని దేశానికి నష్టదాయకమైన ఎన్ని ఉల్లంఘనలనైనా అనుమతించవచ్చునన్నమాట. మనం కోరుకుంటున్నది ఇటువంటి నీతినేనా? సమస్య ఎక్కడున్నదంటే, మనం ఈసడించే వెనుకటి సత్తెకాలంలో విలువలు, నీతి అవినీతులు ఆర్థికీకరణ (మానెటైజ్) చెందలేదు. కనుక వాటిని సామాజికీకరణ (సోషలైజేషన్) పరిధులలో రూపొందించి పరిగణించారు. కేవలం పరిపాలనకు అవసరమైన మేర విలువల ఆర్థికీకరణ చాణక్యుడు సహా కొందరు సూచించినదే గాని, అది దేశాన్ని ఇంటా బయటా ధనికులకు దోచిపెట్టటం కోసం కాదు. కనుక విలువలకు, నీతి అవినీతులకు కొలబద్దలు సామాజికీకరణలో ఉండిపోయా యి. ఈసరికి అవన్నీ ఆర్థికీకరణ అయిపోయాయి. అందువల్ల పాలకుని నీతి తను స్వంతానికి డబ్బు తీసుకున్నాడా లేదా అన్న వక్రీకృత క్షీణప్రశ్నగా మిగిలిపోయింది. సమస్య అక్కడుంది. నిర్మొహమాటంగా చెప్పాలంటే అవినీతి కేవలం డబ్బుపరమైన అవినీతిగా ఉండటంకన్నా దానిని అభివృద్ధి వగైరాలతో ముడిపెట్టే మేధోపరమైన అవినీతి చాలా తీవ్రమైనది, భయంకరమైనది. డబ్బు తిన్నవాడు తాను తినిపోతాడు. తినబెట్టే మేధో అవినీతిపరుడు దేశాన్ని నాశనం చేస్తాడు. ‘మేధోపరమైన’ నీతి అనటంలో వినోద్‌రాయ్ ఆలోచన ఏమిటో తెలియదుగాని, నీతి అవినీతుల నిర్వచనాన్ని మనం మరొక విధంగా చెప్పుకోవలసి ఉంది. అది మేధోపరంగా రూపుతీసుకునే విధానపమైన, సైద్ధాంతికమైన అవినీతి. షికాగో స్కూలులో శిక్షణ పొంది, ఐఎంఎఫ్ వద్ద ఉద్యోగం చేసి వచ్చిన మన్మోహన్‌సింగ్ వంటి వారిని అప్పటి దశాబ్దాలలో అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలలోని పలు దేశాలలో ప్రధానమంత్రులుగా, దేశాధ్యక్షులుగా, ఆర్థిక మంత్రులుగా ప్రమోట్ చేయించటం బహిరంగ రహస్యం. వారి విధానపరమైన, సైద్ధాంతికమైన అవినీతులు ఆచరణలో ఎవరికేమి చేసాయో అందరికీ తెలిసిందే. మనకు కావలసింది ఆర్థికీకరణ చెందిన విలువల నీతిపరులు మాత్రమే కాదు. అంతకన్నా ముఖ్యంగా, సామాజికీకరణ చెందిన విలువల మేధోనీతిపరులు కావాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: